ఆమె నా ‘భార్య’... కాదు అతను మా అంకుల్‌

Indian Sentenced To 12 Strokes Of Canes And 13 Years Prison In Singapore - Sakshi

సింగపూర్‌ : పన్నెండేళ్ల మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి అకృత్యానికి పాల్పడిన భారత్‌కు చెందిన ఓ వ్యక్తికి 13 ఏళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తూ సింగపూర్‌ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఇక్కడి మినిమార్ట్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్‌ దక్షిణామూర్తి (31) అనే వ్యక్తి షాప్‌నకు వచ్చిన ఓ బాలికకు ఉచితంగా తినుబండారాలు, ఆడుకొనే బొమ్మలు ఇచ్చి వశపర్చుకున్నాడు. మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అనుమానం రావడంతో ఈ కామాంధుడి లీలలు వెలుగుచూశాయి. ఈ ఘటన 2016లో చోటుచేసుకోగా 2019 జనవరి 10న నేర నిరూపణ అయింది.

జ్యూడిషియల్‌ కమిషనర్‌ పాంగ్‌ ఖాంగ్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. ఉదయ్‌కుమార్‌ దక్షిణామూర్తి మినిమార్ట్‌లో పనిచేస్తుండగా.. మైనర్‌ బాలిక ఆ షాప్‌నకు వెళ్లేది. ఆమెకు డబ్బు, బొమ్మలు తినుబండారాలు ఆశ చూపి.. రోజూ తనతో పాటు షికార్లకు తీసుకెళ్లేవాడు. అలా మూడు మాసాలపాటు ఆమెను లైంగికంగా మోసం చేశాడు. 2016 సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌ ఆ కామాంధుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

ఎవరైనా ఈ ఇద్దరి వ్యవహారంపట్ల అనుమానం వ్యక్తం చేస్తే..  ‘తను నా భార్య’ అని నమ్మబలికేవాడు. ఆ బాలిక మాత్రం అతను మా అంకుల్‌ అని అమాయకంగా బదులిచ్చేది.  తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి  దక్షిణామూర్తి బాలికను మరింతగా నమ్మించాడు.  అయితే, అక్టోబర్‌లో ఓ రోజు దక్షిణామూర్తి నిజమైన గర్ల్‌ఫ్రెండ్‌ ఈ ఇద్దరినీ ఓ హోటల్‌ వద్ద చూసింది. దక్షిణామూర్తి మరో అమ్మాయితో అఫైర్‌ కొనసాగిస్తున్నాడని నిశ్చయించుకుంది. ఓ రోజు దక్షిణామూర్తి మొబైల్‌ను చెక్‌ చేయగా అందులో... సదరు బాలిక నగ్న చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన హైకోర్టు దక్షిణామూర్తిని దోషిగా తేలుస్తూ కఠిన శిక్షలను విధించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top