ఎవరి సత్తా ఎంత?
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
సైనిక పరంగా భారత్–చైనా బలాబలాలివీ..
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాటల యుద్ధంతో పాటు బలగాల మోహరింపు దిశగా చర్యలు మొదలయ్యాయి. టిబెట్, ఇతర ప్రాంతాల్లో చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు యుద్ధ సన్నద్ధతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సైనిక, ఆయుధ శక్తి వివరాలు...
సైన్యం: చైనా 16 లక్షల సైన్యంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. భారత్ 13 లక్షల సైన్యంతో మూడోస్థానంలో ఉంది.
మందుగుండు సామగ్రి: వివిధ దేశాల సైనికపాటవాలను విశ్లేషించే గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్ ప్రకారం.. చైనా 6,457 సైనిక ట్యాంకులను, భారత్ 4,426 ట్యాంకులను కలిగి ఉన్నాయి. యుద్ధరంగంలో ఆయుధాలు అమర్చిన అర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ (ఏఎఫ్‌వీ) భారత్ వద్ద 6,704 ఉండగా, చైనాకు 4,788 మాత్రమే ఉన్నాయి. మరోవైపు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ (శతఘ్నులు) ఆయుధ వాహనాలు చైనా వద్ద 1,710 ఉండగా.. వాటిలో కేవలం ఆరో వంతు అంటే 290 మాత్రమే భారత్ కలిగి ఉంది. టోవ్డ్ ఆర్టిలరీ(ఫిరంగులు) వాహనాలు భారత్ వద్ద 7,414 ఉండగా.. చైనాకు 6,246 ఉన్నాయి.
వైమానిక దళం: ఈ రంగంలో చైనా కంటే భారత్ వెనకబడి ఉన్నట్టు గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్‌సైట్ పేర్కొంది. దీని ప్రకారం.. భారత్‌కు 676 యుద్ధ విమానాలుండగా, చైనా వద్ద 1,271 ఉన్నాయి. సైన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు ఉద్దేశించిన రవాణా విమానాలు భారత్‌కు 857, చైనాకు 782 ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నుంచి హెలికాప్టర్లు వైమానిక దళంలో ముఖ్యమైన అంతర్భాగంగా మారాయి. చైనా వద్ద 1,100 హెలికాప్టర్లుండగా వాటిలో 206 శత్రు సేనలపై దాడులకు ఉపయోగపడతాయి. భారత్ వద్ద ఉన్న 666 హెలికాప్టర్లలో 16 మాత్రమే యుద్ధానికి పనికొస్తాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఇంకా భారత సైనిక బలగంలో చేరకపోవడం, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నడిపే స్క్వాడ్రన్ లీడర్ల సంఖ్య తక్కువగా ఉండడం భారత్‌కు ప్రతికూల అంశం.
నావికాదళం: ఈ రంగంలో కూడా చైనాదే పైచేయిగా ఉందని ‘గ్లోబల్ ఫైర్ పవర్’ తెలిపింది. చైనాకు 283 పెద్ద జల ఉపరితల యుద్ధ నౌకలుండగా, భారత్‌కు ఇలాంటిæ వార్‌షిప్‌లు 66 మాత్రమే ఉన్నాయి. ఆసియాలో భారీ విమాన వాహక యుద్ధ నౌక కలిగి ఉన్న తొలి దేశంగా భారత్ నిలిచినా.. చైనా కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. మొదటి లియోనింగ్ యుద్ధనౌక తర్వాత దేశీయంగా టైప్ 055 భారీ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌ను రూపొందించింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా అంచనా వేస్తున్నారు. ఇది గతనెల 28న చైనా తమ జలాల్లోకి ప్రవేశపెట్టగా, 2018 కల్లా వారి నావికాదళంలో చేరనుంది. సోవియట్ యూనియన్ కాలం నాటి లియోనింగ్‌ను ఉక్రెయిన్ నుంచి చైనా కొనుగోలు చేసి.. 2012లో దాన్ని మరింత అభివృద్ధిపరిచింది.
నాలుగేళ్ల పాటు దాన్ని పరీక్షించాక గతేడాది డిసెంబర్ 16న ప్రత్యక్షంగా లైవ్ ఫైర్ డ్రిల్‌ను చేసింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో సైతం 2017 జనవరి 3న ఇలాంటి డ్రిల్స్ నిర్వహించింది. మరోవైపు భారత నావికాదళం తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోంది. విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్–విక్రాంత్ స్థానంలో ప్రవేశపెట్టడానికి దేశంలోనే రూపొందించే ఐఎన్‌ఎస్–విశాల్ తయారీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాల్‌ను 65 వేల టన్నుల అణ్వాయుధాలను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో నిర్మించనున్నారు. గతంలోని ఐఎన్‌ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య కంటే ఎక్కువ విమానాలను ఇది తీసుకెళ్లగలదు. యుద్ధవిమానాలకు అధునాతన ‘ఎలక్ట్రోమేగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్’ను జోడించేందుకు భారత్.. అమెరికా సహకారం తీసుకుంటోంది.
