
అమెరికా పీఠం హిల్లరీదే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భారీ విజయం ఖాయమంటూ మీడియా, రాజకీయ నిపుణులు,
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భారీ విజయం ఖాయమంటూ మీడియా, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) హిల్లరీ, ట్రంప్‌ల మూడో, చివరి డిబేట్ నేపథ్యంలోమీడియా సంస్థలు పోల్ నిర్వహించి హిల్లరీ గెలుపును దాదాపు ఖాయం చేసేశాయి. హిల్లరీ ప్రత్యర్థి వర్గమైన రిపబ్లికన్ల వ్యూహకర్త స్టీవ్ స్కిమిట్ అయితే ఏకంగా ఆమెకు400 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వస్తాయని చెప్పారు! సెనెట్, ప్రతినిధుల సభలోను డెమోక్రాట్లే ఆధిక్యంలో ఉంటారని స్టీవ్ అన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఓట్లు ఉండగా... గెలవాలంటే 270 ఓట్లు వస్తే చాలు. రియల్ క్లియర్ పిక్చర్స్ సంస్థ అంచనా ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే హిల్లరీ 7.2 % పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీకి 256, ట్రంప్‌కు 176 ఓట్లు ఖాయమని, మిగిలిన 112 సీట్లలో హిల్లరీకి 14 ఓట్లు వస్తే చాలని తెలిపింది. హిల్లరీకి 92 శాతం గెలుపు అవకాశాలున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇక బ్లూమ్‌బెర్గ్ పోల్ ప్రకారం ట్రంప్ కంటే క్లింటన్ 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హిల్లరీ వైపే భారతీయ అమెరికన్ల మొగ్గు!
హిల్లరీ వైపే భారతీయ అమెరికన్లలో అత్యధికులు మొగ్గు చూపుతున్నట్లు ‘ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ సర్వేలో వెల్లడైంది. ఇమిగ్రేషన్‌వంటి విషయాల్లోట్రంప్ కంటే హిల్లరీవైపే వీరు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తేలింది. ఇమిగ్రేషన్ విషయంలో హిల్లరీకి 59 శాతం మంది మద్దతుగా నిలవగా.. ట్రంప్‌కు ఓటేస్తామని 29% మంది చెప్పారు.