లండన్‌ సురక్షిత నగరమేనా? | Sakshi
Sakshi News home page

లండన్‌ సురక్షిత నగరమేనా?

Published Fri, Jul 19 2019 5:14 AM

Growing Crime in London For Inequalities  - Sakshi

విప్లవమైనా, నేరమైనా ఆకలి నుంచే పుడుతుంది   - ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌

లండన్‌ : భారత్‌లో మతహింస పెరిగిపొతోందంటూ లండన్‌ నుంచి తరచూ మాటలు వినిపిస్తుంటాయి. మరి ఇంగ్లండ్‌లో భద్రత ఎంత? ప్రపంచ ప్రధాన రాజధానుల్లో ఒకటైన లండన్‌లో అంతా క్షేమమేనా? ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ, భిన్న సంస్కృతులతో ఫరిడవిల్లే లండన్‌లో నిజంగా ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. 2019 జనవరి నుంచి జూన్‌వరకూ జరిగిన నేరాలను చూస్తే లండన్‌ ప్రజలకు ఎంత సురక్షితమో తెలస్తుంది. 

1,25,190  దొంగతనాలు
1,08,084  హింసాత్మక దాడులు
9,998    లైంగిక నేరాలు
21,906  మాదకద్రవ్యనేరాలు
40,409  దోపిడీలు

ఇక నేరాలకు పరాకాష్టగా భావించే హత్యలు 67. ఇవన్నీ పోలీసుల సంరక్షణ నుంచి లండన్‌ చేయిదాటిపోతుందనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. దీనిపై లండన్‌ మేయర్‌ సాదిక్‌ఖాన్‌ మాట్లాడుతూ పేదరికమే లండన్‌లో పెరుగుతున్న హింసాత్మక ఘటనలకు  కారణమని ప్రకటించాడు. తగ్గిపోతోన్న శాంతిభద్రతలపై తన బాధ్యత కప్పిపుచ్చుతూ మానవుల నిరాశ కారణంగానే ఇలా జరుగుతోందని తేల్చేశాడు. అలాగే మరికొద్ది రోజుల్లో పదవి దిగిపోనున్న ఇంగ‍్లండ్‌ ప్రధాని థెరిసామే తన చేతులకు అంటిన రక్తాన్ని ఎలా చెరిపేసుకోలదని ఓ విలేకరి ప్రశ్నించగా.. పోలీసుల సంఖ్య 2010తో పోల్చితే ప్రస్తుతం పెరిగిందని ఒక అసందర్భ పోలిక తెచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేగానీ లండన్‌లో పోలీసులకు, నేర ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం అంగీకరించడం లేదు. 

అసమానతలే కారణమా?
యూరప్‌ ఇప్పుడు బయటకు కన్పించని ఓ అసమానతల అగ్నిపర్వతం. అప్పుడప్పుడు నిరసనల రూపంలో లావా ఎగిసిపడుతున్నా ఈ పెట్టుబడుల అగ్నిపర్వతం పూర్తిగా బద్దలు కావడానికి మరింత సమయం పట్టొచ్చు. యూరప్‌లో అగ్రదేశాలు అయిన ఫ్రాన్స్‌లో ధనికులకు పేదలకు మధ్య పెరిగిపోతున్న అసమానతలు  విప్లవరూపం తీసుకొని యెల్లోఫెస్ట్‌ ఉద్యమం బయలుదేరగా, ఇంగ్లండ్‌లో మాత్రం నేరాలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటికి కారణం మాత్రం ఒక్కటే.. ‘అసమానత’.  దీనికి రూపాలు వేతనాలు తగ్గిపోవడం, ధరలు పెరగడం , నిరుద్యోగం, ప్రభుత్వ సేవలు తగ్గడం.  పేదరికంలో మగ్గిపోతున్న యువకులను ఆదరించడంలో లండన్‌ సమాజం వైఫల్యాన్ని ఇది సూచిస్తుంది. దీంతో వీరు సామాజిక ప్రయోజనాలు పొందడంలో విఫలమై నేరాలను మార్గంగా ఎంచుకున్నారు.

బ్రెగ్జిట్‌ చుట్టే రాజకీయం
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత  అంతటి రాజకీయ సంక్షోభం బ్రెగ్జిట్‌ రూపంలో ఇవాళ ఇంగ్లాండ్‌లో నెలకొని ఉంది. యురోపియన్‌ యూనియన్‌ నుంచి ఇంగ్లండ్‌ బయటకు రావడం ఇప్పుడు ఆ దేశానికి సవాలుగా మారింది. బ్రెగ్జిట్‌ గోడలో నుంచి ఒక ఇటుకను తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలే స్థితిలో బ్రిటన్‌ ఉంది. ప్రస్తుత ప్రధాని థెరిసామే వైదొలిగిన తర్వాత ప్రధాని ఎవరు అనేదానిపైనే ఆ దేశ దృష్టి కేంద్రీకృతమైంది. ఇలా బ్రెగ్జిట్‌ చుట్టూ దేశం తలమునకలు అవుతుంటే మరోపక్క లండన్‌ను హింసాత్మక నేరాలు ముంచెత్తుతున్నాయి. ఒకప్పుడు భూమిలో పావుభాగం  సామ్రాజ్యం ఏర్పరచుకున్న  బ్రిటిష్‌ సామ్రాజ్యం నేడు అమెరికాకు  జేబు దేశంగా మారి, సొంత నిర్ణయాలు తీసుకోలేక పోతుండటం కూడా దాని ఆర్థిక పతనానికి ఒక కారణం. ఏదేమైనా నగరం లేదా దేశంలో గ్యాంగ్ వార్‌ సంస్కృతి విచ్చలవిడిగా స్వైర్యవిహారం చేస్తోంది. నగర ప్రజలు నేరాలకు అలవాటుపడుతున్నారు. 
 

Advertisement
Advertisement