స్టెమ్‌.. నంబర్‌ వన్‌!

Global Education Senses Report Revealed about Stem Courses - Sakshi

మేథమెటిక్స్‌లోనే 88 శాతం మంది

ఇష్టం లేకున్నా..అందరూ స్టెమ్‌ కోర్సుల వైపే మొగ్గు 

వెల్లడించిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సెన్సెస్‌ రిపోర్ట్‌ 

గణితం.. పేరు వింటేనే భయపడి పారిపోయేవారున్నారు! అంతగా భయపెడుతుంది. అర్థం చేసుకుని ఆడుకునేవారూ ఉన్నారు! అంతలా కిక్కిస్తుందీ సబ్జెక్ట్‌. అయితే అత్యధిక ఉద్యోగాల్లో గణిత నైపుణ్యాలే కీలకమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు ఆ సబ్జెక్టునే ఎంచుకుంటున్నారు. ఈ విషయమై భారత్, చైనా, అమెరికా సహా పది దేశాలపై ‘కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌’ఓ అధ్యయనం జరిపింది. అధ్యయనాన్ని విశ్లేషించి ‘గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సెన్సెస్‌ రిపోర్ట్‌’ను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. 88% మంది మేథమెటిక్స్‌ కోర్సులు చేస్తున్నారు. కెమిస్ట్రీ (65%) ఫిజిక్స్‌ (63%) కోర్సులు చేస్తున్న వారూ ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌–టెక్నాలజీ– ఇంజనీరింగ్‌– మేథమెటిక్స్‌ (స్టెమ్‌) కోర్సుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్లు ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గణితం తర్వాత స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 84% మంది ఆంగ్ల కోర్సుల్లో చేరుతున్నారు. ప్రాంతాల వారీగా చూసుకున్నప్పుడు ఈ గణాంకా ల్లో కొద్దిపాటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. అర్జెంటీనా, అమెరికా విద్యార్థులు గణితం, ఆంగ్లం తర్వాత చరిత్రను ఎక్కువగా ఎంపి క చేసుకుంటున్నారు. చైనా, స్పెయిన్, దక్షిణాఫ్రికా విద్యార్థులు హ్యుమానిటీస్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్లేతర లాంగ్వేజ్‌ కోర్సులకు ఈ మూడు చోట్లా మూడో స్థానం లభిస్తోంది.

స్మార్ట్‌ స్టడీ.. 
చదువులో భాగంగా.. 42 శాతం మంది విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. 48 శాతం మంది విద్యార్థులు డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు వాడుతున్నారు. 35 శాతం మంది తమ తరగతి గదుల్లో ఇప్పటికీ బ్లాక్‌ బోర్డులు వినియోగిస్తున్నట్టు తెలిపారు.

పాఠ్యేతర కార్యకలాపాల్లో మన దేశ విద్యార్థులు (72%) మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. డిబేట్‌ (36%) సైన్స్‌ క్లబ్‌ (28శాతం) బుక్‌ క్లబ్‌ (22%) కళలు (25%) పాలుపంచుకుంటుండగా.. 74% మంది క్రమం తప్పకుండా ఆటలాడుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో 9 మంది ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలనుకుంటున్నారు. అయితే వారి ప్రణాళికలు ఆచరణరూపం దాల్చడం లేదంటూ, ‘ది ఎకనామిస్ట్‌’పరిశోధనను కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ ఉటంకించింది. ఈ పరిశోధన ప్రకారం– 2012 నాటికి ముగిసిన రెండు దశాబ్దాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు కేవలం 32 శాతమే! విద్యార్థులు చదువు కొనసాగించేందుకు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని కూడా ఈ గణాంకాలు రుజువు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.  

ఇష్టమైంది చదవడం లేదు.. 
సంగీత సంబంధమైన కోర్సులు ఇష్టపడతామని 22% మంది విద్యార్థులు చెబుతున్నారు. కానీ, వీరితో సహా ఎక్కువ మంది విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదివే పరిస్థితి లేదని నివేదిక చెబుతోంది. దీన్ని బట్టి ఉపాధి సంబంధిత ఒత్తిళ్లు విద్యార్థులను వారి ఇష్టాల వైపు మొగ్గు చూపకుండా అడ్డుకుంటున్నాయని భావించవచ్చు. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (21%) నాటకం (17%) ఆంగ్ల సాహిత్యం (13%) చరిత్ర (12 శాతం) కంప్యూటర్‌ సైన్స్‌ (11%) కోర్సులంటే ఇష్టమని చెబుతున్నారు పలువురు విద్యార్థులు. కాగా, ప్రైవేటు ట్యూషన్లు చదవడమనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. చైనాలో ఇంచుమించు 57% మంది విద్యార్థులు ట్యూషన్లకు వెళుతున్నారు. మన దేశంలో ఇలాంటి విద్యార్థులు 55% మంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 66% మంది గణిత విద్యార్థులు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. 43 శాతం మంది ఫిజిక్స్‌ పాఠాలు చెప్పించుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top