
కొడుక్కి తెలియకుండా కోడలికోసం..!
అమెరికాలో ఓ పెద్దాయన కోడలి కోసం పెద్ద ఉపాయమే చేశాడు.
లాస్ ఏంజిల్స్: అమెరికాలో ఓ పెద్దాయన తన కొడుక్కి ఎలాగైనా భార్యను తీసుకురావాలని పెద్ద ఉపాయమే చేశాడు. స్థానిక వార్తా పత్రికలో కోడలు కోసం ఓ ఫుల్పేజీ యాడ్ ఇచ్చాడు. అందులో కొడుకు ఫోటోతో పాటు.. తనకు కోడలిగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చాడు. ఆసక్తి ఉన్న వారిని ఇంటర్వ్యూకు రావాల్సిందిగా ఆహ్వానించాడు.
సాల్ట్ లేక్ పట్టణానికి చెందిన 48 ఏళ్ల బిజినెస్మ్యాన్ బ్రూక్స్ తనకు తెలియకుండా తన తండ్రి ఇచ్చిన ఈ యాడ్ చూసి షాక్ తిన్నాడు. యాడ్ గురించి మీడియా బ్రూక్స్ను సంప్రదించగా.. తనకు తెలియకుండా తన తండ్రి ఆర్దర్ చేసిన ఈ పనిని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదని 'ఒకసారి బాంబు వదిలిన తరువాత దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం' అని చెప్పుకొచ్చాడు.
పేపర్లో ఇచ్చిన ప్రకటనలో కోడలికి ఉండాల్సిన వయసు, ఎత్తు, అర్హతలతో పాటు.. ఒబామాకు ఓటేసిన, హిల్లరీకి ఓటేయాలనుకుంటున్న వారైతే ఇంటర్వ్యూకు రావాల్సిన అవసరం లేదని ఆర్దర్ పేర్కొన్నాడు. తండ్రి తనకు తెలియకుండా ఈ యాడ్ ఇచ్చినా.. ఇంటర్వ్యూలు ముగిసిన తరువాత దీని గురించి తండ్రితో చర్చిస్తానని బ్రూక్స్ తెలిపాడు. వ్యాధితో బాధపడుతున్న తండ్రి..తనకు పెళ్లి చేసి ఓ మనువడిని పొందాలని కోరుకుంటున్నాడని.. అయితే దానికి ఈ పని చేస్తాడని ఊహించలేదని బ్రూక్స్ తెలిపాడు.