కరోనా: ఇటలీ చేరుకున్న భారత వైద్య బృందం

Corona: Indian Medical Team Reaching Italy To Test Stranded Students - Sakshi

రోమ్‌ : ఇతర దేశాల నుంచి భారత్‌కు చేరుతున్న వారితో కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో భారత వైద్య బృందం శుక్రవారం ఇటలీకి చేరుకుంది. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటు, భారత పౌరులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి లియెనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించనున్నారు. కాగా దీనికంటే ముందు ఇటలీలోని భారతీయులకు కోవిడ్‌ 19 పరీక్షలు నిర్వహించడానికి భారత్‌ రాయబార కార్యాలయం ఇటాలియన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇటలీలో ఇప్పటికే కరోనా అధికంగా ప్రభావం చూపుతున్నందున భారతీయులకు వైద్యసాయం అందించేదుకు అక్కడి అధికారులు ఇందుకు అంగీకరించలేదు. (కరోనా భయం: నా సోదరి శవాన్ని తీసుకువెళ్లండి..)

ఈ నేపథ్యంలో స్పందించిన భారత ప్రభుత్వం.. స్వయంగా భారత్‌ వైద్యాధికారులు ఇటలీకి పంపించింది. ఇండియన్‌ మిషన్‌ ప్రకారం ఇటలీలో సుమారు 1.6 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. వారిలో 3,800 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటలీలోని పలు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై సంప్రదింపులు జరుపుతున్నామని, రాయబార కార్యాలయంలోని ఓ అధికారి తెలిపారు. ఇక ఇటలీకి చేరుకున్న భారత వైద్య బృందం రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉంటారని ఇటలీ భారత రాయబారి రీనాట్‌ సంధు తెలిపారు.(ఆర్మీకి సోకిన కరోనా వైరస్‌)

అక్కడి భారతీయులకు కరోనా టెస్ట్‌లు నిర్వహించి నెగిటివ్‌ వచ్చిన వారిని తిరిగి ఇండియాకు పంపిస్తామని తెలిపారు. వాళ్లు భారత్‌కు వచ్చాక 14 రోజుల పాటు మళ్లీ వైద్య పరీక్షలు నిమిత్తం నిర్బంధంలో ఉంటారని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1, 34, 500 కరోనా కేసులు నమోదవ్వగా, 4,900 మందికి పైగా మరణించారు. చైనా తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతం ఇటలీనే. ఇప్పటి వరకు ఇటలీలో 15, 113 కరోనా కేసులు నమోదవ్వగా 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. (కరోనా: ‘ఈ మధ్యకాలంలో ఇదే గొప్ప బహుమతి’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top