చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

China Economic Slowdown With Trade War - Sakshi

బీజింగ్‌ :  చైనా ఆర్థిక వృద్ధి గత మూడు దశాబ్దాలతో పోల్చితే కనిష్ట స్థాయికి చేరింది. ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి రెండవ త్రైమాసికంలో 6.2 శాతానికి పడిపోయింది. చైనా ప్రభుత్వం 1992లో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కనిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి.  దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ చైనా వస్తువులపై అమెరికా టారిఫ్‌లు పెంచడం వల్లే చైనా వృద్ధి మందగించిందని పేర్కొన్నారు. పెంచిన టారిఫ్‌లు చైనాపై ప్రభావం చూపడమే గాక విదేశీ కంపెనీలు(వీటిలో అధిక భాగం అమెరికా కంపెనీలే) వేల సంఖ్యలో చైనాను వదిలి ఇతర దేశాలవైపు చూస్తున్నాయని తెలిపారు. అందుకే చైనా అమెరికాతో ఒప్పందం కోసం తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు.

గత నెలలో ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా సుంకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చైనా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు ఈ సుంకాల సెగతో నెమ్మదించాయి. అయితే ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనా ఆర్థిక వృద్ధి తగ్గుదలకు అమెరికాతో ట్రేడ్‌వార్‌ ఒక్కటే కారణం కాదంటున్నారు. వారు ట్రంప్‌ వాదనతో ఏకీభవించట్లేదు. చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగియుందని, కేవలం ఒక దేశంతో ట్రేడ్‌వార్‌ వల్ల దానికొచ్చే నష్టం తక్కువేనని వీరి అభిప్రాయం. మరి తగ్గిపోతున్న ఆర్థిక వృద్ధికి కారణం ఏంటి? అంటే.. కొండలా పేరుకుపోతున్న ప్రభుత్వ అప్పులు, చైనీయుల పొదుపులే కారణం అంటున్నారు.

2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చైనా ప్రారంభించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం అధిక స్థాయిలో అప్పులు చేసుకుంటూ పోయింది. ఉద్దీపన ప్యాకేజీ చైనా ఆర్థిక వృద్ధిని పెంచినా, దీని ఫలితంగా మార్చి 2019 నాటికి చైనా జీడీపీలో 300% కంటే ఎక్కువ ప్రభుత్వ, కార్పొరేట్ మరియు గృహ రుణాలు పేరుకుపోయాయి. ఎంతలా అంటే దేశం మొత్తం అప్పు  ప్రపంచ మొత్తం అప్పులో 15% వాటా కలిగి ఉంది. దీంతో అప్పులను తగ్గించుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో నిబంధనలను కఠినతరం చేయడం, బ్యాంక్ రుణాలను తగ్గించడం తదితర చర్యలను ప్రారంభించింది. అప్పులు చేసి వృద్ధిపై ఆధారపడటాన్ని తగ్గించే ఈ ప్రయత్నాలు దేశంలో కంపెనీలకు ఫైనాన్సింగ్ పొందడం మరింత కష్టతరం చేశాయి. ప్రత్యేకించి ప్రైవేటు రంగ సంస్థలు బ్యాంకుల నుంచి నిధులను సేకరించడం కష్టమైంది. గత సంవత్సరం చైనా కంపెనీల రుణ ఎగవేతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే రుణఎగవేతల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని చైనా ఆర్థిక డేటా చూస్తే తెలుస్తుంది. 

కొనేవారు కరువు అయ్యారు
ఈ సంవత్సరం వృద్ధికి దెబ్బ తగిలింది ప్రధానంగా చైనా వినియోగదారుల నుంచే. వీరు చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుతో పాటు వ్యక్తిగత రుణ స్థాయిల గురించి ఆందోళన చెందడంతో ఖర్చును తగ్గించారు. పెరిగిన ఆస్తి ధరలు కూడా వారి కొనుగోలు శక్తిని దెబ్బతీశాయి. రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే విపరీతంగా తగ్గిపోయాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల అమ్మకాలు కూడా చైనాలో నెమ్మదించాయి. ఉదాహరణకు చైనాలో ఆపిల్ ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఆపిల్‌ మొత్తం ఆదాయంలో గ్రేటర్ చైనా (హాంకాంగ్‌, తైవాన్‌లతో కూడిన చైనా) వాటా 18%. రెండవ త్రైమాసికంలో వాటి అమ్మకాలు ఏకంగా 21.5శాతం తగ్గిపోయాయి. అలాగే కార్ల అమ్మకాలలో తగ్గుదల కూడా చైనా వృద్ధి తగ్గుదలకు ఒక సంకేతం. ఫోర్డ్, జనరల్ మోటార్స్ తదితర దిగ్గజ కంపెనీలకు వినియోగదారులు లేక అమ్మకాలు నిలిచాయి.

దశాబ్ద కాలంగా క్షీణిస్తూనే..
చైనా ఆర్థిక మందగమనం వాణిజ్య యుద్ధానికి చాలా సంవత్సరాల ముందు నుంచే మొదలైంది. 2007లో వృద్ధి రికార్డు స్థాయిలో 14.2శాతానికి చేరుకున్నా.. తర్వాత తన ఆర్థిక వ్యవస్థపై సాధించిన పట్టును క్రమంగా కోల్పోయింది. ఆ ప్రభావం గత ఐదు సంవత్సరాల నుంచి కనిపిస్తోంది. ఈ సంవత్సరానికి తన వృద్ధి లక్ష్యాన్ని 6.5శాతం నుంచి కనిష్టంగా 6శాతానికి సైతం తగ్గించింది. దీనికి కారణాలు అనేకం ఉన్నా.. మొదటి నుంచి తయారీపై దృష్టి కేంద్రీకరించిన చైనా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, సేవల ద్వారా నడిచే ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేసిన ప్రయత్నాలే ఆర్థిక మందగమనానికి దోహదం చేశాయనేది విశ్లేషకుల వాదన.

స్టీల్, సిమెంట్, షిప్ బిల్డింగ్ వంటి భారీ పరిశ్రమలలో అధిక సామర్థ్యాన్ని తగ్గిస్తూ, అదే సమయంలో దేశీయ సంస్థలను ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. దీంతో టెన్సెంట్, అలీబాబా, హువావే వంటి దిగ్గజ కంపెనీలు ఇతర రంగాలలో తమ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకున్నా, సాంప్రదాయ ఉత్పాదక కంపెనీలు ఈ మార్పు కోసం కష్టపడుతుండటంతో వృద్ధికి బలమైన విఘాతం ఏర్పడింది. తిరిగి వృద్ధిని పెంచడానికి గత కొంతకాలంగా చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవలే పన్నులను తగ్గించింది. అలాగే ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తిని ఇవ్వడానికి మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచింది.  కానీ, విశ్లేషకులు 2008 ఉద్దీపన ప్యాకేజీలాగా మరోసారి ఈ నమూనా పనిచేయకపోవచ్చని అంటున్నారు. దాని పాత పద్ధతులు కొత్తగా ఏర్పడుతున్న సమస్యలను  పరిష్కరించలేక పోవచ్చనేది వారి భావన. ఏదేమైనా అనేక రంగాలలో దూసుకుపోతున్న చైనాను అమెరికా ట్రేడ్‌వార్‌తో నిలవరించలేదని, ఆర్థిక రంగాన్ని తిరిగి వృద్ధివైపు నడిపించగల శక్తి చైనా రాజకీయరంగానికి ఉందని అభిప్రాయపడుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top