ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులపై దాడులకు పాల్పడటం.. వారి వాహనాలను తగలపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఇసుక మాఫియాపై ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులపై దాడులకు పాల్పడటం.. వారి వాహనాలను తగలపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. వివిధ ఘటనల్లో అధికారులపై దాడులు చేసిన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. వారిని అరెస్ట్ చేయడం అంత కష్టమా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని, ఇందుకు గాను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండటాన్ని ప్రశ్నిస్తున్న రైతులను ఇసుక మాఫియా హతమారుస్తోందని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని మహబూబ్‌నగర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్, హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ధర్మాసనం విచారించింది.