
లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయి?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 3బడ్జెట్ల ద్వారా లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి చేయలేకపోయిందని, సీఎం కేసీఆర్
ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం 3బడ్జెట్ల ద్వారా లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి చేయలేకపోయిందని, సీఎం కేసీఆర్ ఆ నిధులను ఏం చేశారో ప్రజలే నిలదీయాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.2.15 లక్షల కోట్ల బడ్జెట్ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాల్లో జరిగిన పార్టీ మినీ మహానాడులు, తిరుపతి మహానాడులో చేసిన తీర్మానాలపై కార్యాచరణ రూపొందించేందుకు బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఏ ప్రభుత్వానికైనా 5బడ్జెట్లు పెట్టే వీలుంటుందని, చివరి ఏడాది ఎన్నికల ఏడాది అయినందున అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుందని, అప్పుడు గరిష్టంగా 4 బడ్జెట్లు ప్రవేశపెడతారని పేర్కొన్నారు. అంటే ఇప్పటికే మూడు బడ్జెట్లు పూర్తి చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగిలి ఉన్న ఒక్క బడ్జెట్‌తో ప్రజల హామీలన్నీ ఎలా నెరవేరుస్తుందని రేవంత్ ప్రశ్నించారు. టీడీపీని బలోపేతం చేయడానికి రూపొందించిన ప్రణాళికలో భాగంగా జిల్లాకు అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.