‘మహా’ ఒప్పందంతో రాష్ట్రానికి శాశ్వత ద్రోహం | uttam kumar reddy fire on trs party | Sakshi
Sakshi News home page

‘మహా’ ఒప్పందంతో రాష్ట్రానికి శాశ్వత ద్రోహం

May 12 2016 3:10 AM | Updated on Sep 19 2019 8:44 PM

‘మహా’ ఒప్పందంతో రాష్ట్రానికి శాశ్వత ద్రోహం - Sakshi

‘మహా’ ఒప్పందంతో రాష్ట్రానికి శాశ్వత ద్రోహం

ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, తెలంగాణకు శాశ్వతద్రోహం

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఆర్‌డీఎస్‌కోసం కొట్లాడినప్పుడు హరీశ్ ఎక్కడున్నారు : డీకే అరుణ
ఆర్‌డీఎస్‌పై బహిరంగచర్చకు సిద్ధమేనా? : సంపత్ సవాల్

 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, తెలంగాణకు శాశ్వతద్రోహం చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌తో కలసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును తగ్గిస్తామని మహారాష్ట్రతో ఒప్పందంచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలతో గొప్పలు చెప్పుకుంటోందని ఉత్తమ్ విమర్శించారు.

తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించుకోవడం ద్వారా తెలంగాణకు ప్రభుత్వం శాశ్వతద్రోహం చేసిందన్నారు. మహారాష్ట్రకు లాభం చేసే విధంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పొందుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలిగే ప్రతీ అంశానికి సహకరిస్తామమన్నారు. అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలను కొల్లగొట్టడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపేవిధంగా అప్పులు తెస్తూ వేలకోట్ల రూపాయలను కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఆర్‌డీఎస్ పనులు, మహబూబ్‌నగర్‌కు తాగునీటికోసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, నీటిపారుదలశాఖ మంత్రి పాటిల్‌ను టీపీసీసీ బృందం కలిసిందన్నారు. టీపీసీసీ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కర్ణాటక ప్రభుత్వం, ఆర్‌డీఎస్ పనులను ఈ సీజన్‌లోనే పూర్తిచేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఆర్‌డీఎస్ పనుల విషయంలో పెరిగిన అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.52 కోట్లు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఆర్‌డీఎస్ పనులు పూర్తయితే 80 వేల ఎకరాలకు నీరు అందుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే టీఆర్‌ఎస్‌నాయకులు నోటికొచ్చిన అబద్ధాలను మాట్లాడుతున్నారని ఉత్తమ్ అన్నారు.

 కాంగ్రెస్ వెనుక టీఆర్‌ఎస్ నడిచింది...
డి.కె.అరుణ మాట్లాడుతూ, ఆర్‌డీఎస్ గురించి ఉద్యమాలు జరిగినప్పుడు హరీశ్‌రావు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్‌డీఎస్ తూములు ధ్వంసమైనప్పుడు ఉద్యమాలుచేస్తే కాంగ్రెస్ వెనుక టీఆర్‌ఎస్ నడిచిన విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. ఆర్‌డీఎస్ తూములను కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మూసివేయించామని గుర్తుచేశారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ, ఉద్యమాలను అవమానించేవిధంగా మంత్రి హరీశ్‌రావు దొంగజపం, కొంగజపం అంటూ మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. రైతులకోసం ఉద్యమాలు చేసినవారిని సన్నాసులు అని మంత్రి లకా్ష్మరెడ్డి దూషిస్తే, ఎన్నిసార్లు తిట్లు పడటానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఆర్‌డీఎస్‌కోసం ఉద్యమం జరిగినప్పుడు హరీశ్‌రావు రాజకీయాల్లోకి కూడా రాలేదన్నారు. ఆర్‌డీఎస్ చరిత్ర ఏమిటో, దానిపై ఎవరేం చేశారో తేల్చుకోవడానికి బహిరంగచర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement