టీచర్ల భర్తీకి రెండు పేపర్ల విధానం! | Sakshi
Sakshi News home page

టీచర్ల భర్తీకి రెండు పేపర్ల విధానం!

Published Mon, Jun 6 2016 3:16 AM

టీచర్ల భర్తీకి రెండు పేపర్ల విధానం! - Sakshi

ఒక్కో పేపరుకు 150 మార్కులు
క్లాస్ రూమ్ డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూకు 30 మార్కులు
త్వరలో విధానాన్ని ఖరారు చేయనున్న సర్కారు

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో రెండు పేపర్ల విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో ఈ పరీక్షను నిర్వహించగా.. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణ బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీ బాధ్యతలను కూడా కమిషన్‌కే అప్పగించింది. అయితే విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీక రణ తర్వాతే ఆ లెక్క తేలనుంది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే (2016-17) ప్రారంభించాలనుకుంటున్న మైనారిటీ, ఎస్సీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

అందులో ప్రిన్సిపల్‌తోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) విధానం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరీక్ష విధానంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే స్థూలంగా రెండు పేపర్ల విధానం (ఒకటి సబ్జెక్టు పేపరు, మరొకటి జనరల్ అవేర్‌నెస్, ఎబిలిటీస్, జనరల్ ఇంగ్లిష్ పేపరు) ఉంటే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున ఉండేలా కసరత్తు చేస్తోం ది. ఆలాగే తరగతి గది డెమాన్‌స్ట్రేషన్‌కు 30 మార్కులు ఉండేలా చర్యలు చేపడుతోంది.

కొత్తగా ప్రారంభించే గురుకులాల్లో టీచర్ల భర్తీ విషయంలో డిస్క్రిప్టివ్ విధానం అమలు చేయాలా? ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష పేపర్లు ఉండాలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో ఆబ్జెక్టివ్ విధానం లో త్వరగా పరీక్ష నిర్వహించి టీచర్లను ఇవ్వాలని ఒక శాఖ కోరుతుండగా, ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్ష పేపరు ఉండాలని, క్లాస్ డెమాన్‌స్ట్రేషన్ కూడా కచ్చితంగా ఉండాలని మరో శాఖ అధికారులు కోరుతున్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. ఈ రెండింటిలో ఏదో ఒక విధానం ఖరారైతే విద్యా శాఖ పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీకి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.

 టెట్ వెయిటేజీ ఎలా?
రెండు పేపర్ల విధానం, తరగతి డెమాన్‌స్ట్రేషన్ పద్ధతి ఖరారైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వెయిటేజీ సంగతిని తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంది. వాస్తవానికి టెట్‌ను ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు (ఎలిమెంటరీ విద్య) బోధించే టీచర్లకే వర్తింపజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) స్పష్టం చేసింది. కానీ రాష్ట్రంలో 9, 10 తరగతులు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు కూడా టెట్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. నిబంధనలకు ఇది విరుద్ధం కావడంతో టెట్ విషయంలో ఏం చేద్దామని యోచిస్తోంది.

ఒకవేళ టెట్ వెయిటేజీని కొనసాగించినా, 330 మార్కుల రాత పరీక్షకు, క్లాస్‌రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కమ్ ఇంటర్వ్యూకు మొత్తంగా 80 శాతం వెయిటేజీ ఇచ్చి, టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపట్టాలా? లేదా టెట్‌కు వెయిటేజీ పూర్తిగా తొలగించి, దాన్ని ఒక అర్హత పరీక్షగానే చూడాలా? అన్న అంశాలపైనా ఆలోచనలు చేస్తోంది. ఎన్ సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ స్కోర్‌కు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నందునా వెయిటేజీ తొలగింపు సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పీజీటీ పోస్టులకు టెట్ అవసరం లేనందునా, 330 మార్కులకు రాత పరీక్ష,  క్లాస్‌రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కమ్ ఇంటర్వ్యూ చేపట్టి నియామకాలు చేస్తే బాగుంటుందని ఆలోచనలు చేస్తోంది. మరోవైపు సిలబస్ విషయంలోనూ మార్పులు చేయాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం ఎస్‌జీటీ పోస్టుకు ప్రస్తుతం 8వ తరగతి వరకు సిలబస్‌ను, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పదో తరగతి వరకున్న సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే 8, 10 తరగతుల సిలబస్ కాకుండా డిగ్రీ స్థాయి వరకు సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకునేలా కసరత్తు చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement