
ఆలయాల్లో మళ్లీ సమ్మె సైరన్
గుడిగంటలకు బదులు సమ్మె సైరన్ మోగనుంది. ఆలయాల్లో మళ్లీ ఆందోళనల పర్వం మొదలుకాబోతోంది.
జూన్ 6 నుంచి సమ్మెకు అర్చక, ఉద్యోగ జేఏసీ నిర్ణయం
వేతనాల క్రమబద్ధం హామీని విస్మరించిన ప్రభుత్వం
ఈసారి ఆమరణ దీక్షలకూ సిద్ధమని ప్రకటన
హైదరాబాద్: గుడిగంటలకు బదులు సమ్మె సైరన్ మోగనుంది. ఆలయాల్లో మళ్లీ ఆందోళనల పర్వం మొదలుకాబోతోంది. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఉద్యోగులు, అర్చకులు జూన్ ఆరో తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. వారి వేతనాల క్రమబద్ధంపై ఏడాది క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవటంతో జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. తక్కువ వేతనాలు, చెల్లింపుల్లో పద్ధతి లేకపోవడాన్ని నిరసిస్తూ ఏడాదిన్నరగా ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
గత సంవత్సరం జూన్‌లో వారు జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగారు. ఆ సందర్భంలో వారు ఆందోళ అనూహ్యంగా ఉగ్రరూపం దాల్చటంతో ప్రభుత్వం దిగొచ్చి వారి వేతనాలను క్రమబద్ధం చేస్తామని హామీ ఇచ్చింది. వేతనాల కోసం ప్రత్యేకనిధి ఏర్పాటు చేసి దాని ద్వారానే చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను, న్యాయపరమైన అంశాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
ప్రస్తుతం దేవాదాయశాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని దేవాదాయశాఖ ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తోంది. ఇక దేవాదాయశాఖ పరిధిలోని ఉద్యోగులు, అర్చకులకు మాత్రం ఆయా దేవాలయాల ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు.
ఆ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు- దేవాలయ ఉద్యోగుల, అర్చకులకు ఈ చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం ఉంది. ఆలయాల ఆదాయం సరిగా లేని సమయంలో సిబ్బందికి వేతనాల చెల్లింపు మరీ అస్తవ్యస్తంగా ఉంటోంది. దీంతో వేతనాల్లో ఏకరూపత కోసం వీరు ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి తమ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.