ఇప్పుడైనా టీచర్లను ఇవ్వండి | School education director With 60 meeting of the sarpanch! | Sakshi
Sakshi News home page

ఇప్పుడైనా టీచర్లను ఇవ్వండి

Jun 17 2016 1:01 AM | Updated on Sep 15 2018 4:26 PM

ఇదంతా మహబూబ్‌నగర్ జిల్లాలోని మారుమూల మండలాలకు చెందిన 60 మంది సర్పంచ్‌ల ఆవేదన. ఈసారైనా సరిగ్గా టీచర్లను ఇచ్చి బడులను...

* మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు మండలాల సర్పంచ్‌ల విజ్ఞప్తి
* టీచర్లు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన
* పాఠశాల విద్య డెరైక్టర్‌తో 60 మంది సర్పంచ్‌ల భేటీ

 
‘‘మాది మారుమూల ప్రాంతం. బస్సు కూడా లేదు. మా స్కూల్లో 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క టీచర్ కూడా లేరు. విద్యా వలంటీర్‌ను ఇంతవరకు ఇవ్వలేదు. బడిని ఎలా నడపాలి’’   
- ఓ సర్పంచ్ ఆవేదన

 
‘‘మా గ్రామంలో ఉన్నది ఒక్క టీచరే. 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్క టీచర్‌తో బడి నడిపేదెలా? ఇప్పుడైనా సకాలంలో సక్రమంగా టీచర్లను ఇవ్వండి’’     
- మరో సర్పంచ్ విజ్ఞప్తి

 
‘‘మా ఊరి స్కూల్ టీచర్ 12 గంటలకు వస్తున్నారు. ఆయన మహబూబ్‌నగర్ నుంచి రావాలి. నేనేమైనా అంటే ఆ ఒక్క టీచర్ కూడా బడికి రారు.’’ 
- ఇంకో సర్పంచ్ ఆందోళన
 
సాక్షి, హైదరాబాద్: ఇదంతా మహబూబ్‌నగర్ జిల్లాలోని మారుమూల మండలాలకు చెందిన 60 మంది సర్పంచ్‌ల ఆవేదన. ఈసారైనా సరిగ్గా టీచర్లను ఇచ్చి బడులను బాగా నడిపించాలని వీరంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గట్టు, అమ్రాబాద్, అయిజ, ధరూర్ మండలాలకు చెందిన ఆ సర్పంచ్‌లంతా గురువారం హైదరాబాద్ కు వచ్చారు. పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్‌తో సమావేశమయ్యారు. తమ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న అనేక పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేకపోవడంతో వారంతా చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా శాఖ చాలా పాఠశాలలకు టీచర్లను కూడా ఇవ్వలేదని, కనీసం విద్యా వలంటీర్లను కూడా నియమించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తామే గ్రామంలోని ఒక నిరుద్యోగిని నియమించి పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నామని వివరించారు. 250 నుంచి 450 వరకు విద్యార్థులున్న పాఠశాలలను ఒక్క టీచర్‌తో ఎలా నడిపించాలని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోందని, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వలంటీర్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈసారైనా రెగ్యులర్ టీచర్లను ఇవ్వాలని, వారంతా స్థానికంగా ఉండేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.
 
జిల్లా కలెక్టర్లకే అధికారాలు
సర్పంచ్‌ల ఆవేదనను విన్న పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్.. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. హేతుబద్ధీకరణ తర్వాత టీచర్లను ఇస్తామని, అంతకంటే ముందు విద్యా వలంటీర్లను నియమిస్తామని చెప్పారు. విద్యా వలంటీర్లను నియమించే బాధ్యతను ఈసారి జిల్లా కలెక్టర్లకే అప్పగించామని, అవసరాల మేరకు ఎంతమంది విద్యా వలంటీర్లు కావాలో కలెక్టర్‌కు తెలియజేస్తే ఇస్తారని తెలిపారు. ఇక గ్రామాల్లో స్కూళ్లకు టీచర్లు సక్రమంగా వస్తున్నారా? లేదా? చూడాల్సిన బాధ్యతను సర్పంచులు కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement