కాలేజీల్లో సోదాలకు రెడీ.. | Ready to search in the colleges | Sakshi
Sakshi News home page

కాలేజీల్లో సోదాలకు రెడీ..

Apr 26 2016 4:43 AM | Updated on Aug 21 2018 5:54 PM

కాలేజీల్లో సోదాలకు రెడీ.. - Sakshi

కాలేజీల్లో సోదాలకు రెడీ..

ప్రైవేటు విద్యా సంస్థల్లో లోటుపాట్లపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

♦ ఉన్నతాధికారులతో డీజీపీ విస్తృత సమావేశం
♦ 600 పోలీసు బృందాల ఏర్పాటుకు నిర్ణయం
♦ తనిఖీ చేయాల్సిన అంశాలపై సుదీర్ఘ చర్చ
 
 సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో లోటుపాట్లపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు 600 పోలీసు బృందాల సేవలు అవసరముంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కాలేజీల్లో ఏయే అంశాలపై సోదాలు నిర్వహించాలనే విషయమై డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా తయారు చేయాలని నిర్ణయించారు. అడ్మిషన్ విధానం, ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, స్కాలర్‌షిప్‌ల మంజూరు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల వివరాలు, కాలేజీల అనుమతులు, వాటికి అనుగుణంగా ఉన్న బ్రాంచ్‌లు తదితర వాటిపై ఒక నమూనా రూపొందించి తనిఖీలు చేయాలని యోచిస్తున్నారు. 600 తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని భావించడంతో ఒక్కో బృందంలో ఎంత మంది సిబ్బందిని నియమించాలనే దానిపైనా కూలంకషంగా చర్చించారు. సమావేశంలో హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, సైబరాబాద్ డీఐజీ శశిధర్‌రెడ్డి, సీఐడీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్ అధికారులు  పాల్గొన్నారు.
 
 వేసవి సెలవులు కదా..
 రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రైవేటు కాలేజీలు 6,800 వరకు ఉన్నాయి. కాలేజీల చిరునామాలు, వాటి వ్యవహారాలకు సంబంధించి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, బోధన సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తనిఖీలకు ప్రాథమికంగా అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశముందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
 
 విద్యాశాఖ అధికారులతో భేటీ
 కాలేజీలపై దాడులకు సంబంధించి డీజీపీ అనురాగ్‌శర్మ ఒక వైపు సుదీర్ఘ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే మరోవైపు  విద్యా శాఖ అధికారులతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ప్రత్యేక భేటీ నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్ వద్దనున్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), ఉన్నత విద్యామండలి అధికారులు, కళాశాల విద్య, సాంకేతిక విద్య అధికారులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఏయే అంశాలపై సోదాలు నిర్వహిస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అప్పట్లోగా మరింత సమాచారంతో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులను రాజీవ్ త్రివేది కోరినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement