హైదరాబాద్‌ ఇంత బ్యాడా?

హైదరాబాద్‌ ఇంత బ్యాడా? - Sakshi

ముంబై ప్రజలు అడుగుతున్నారు:వర్మ

 

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు విచారణలో ఎక్సైజ్‌ సిట్‌ తీరును తప్పుపడుతున్న డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అయ్యారు. మంగళవారం ఫేస్‌బుక్‌లో వరుస పోస్టింగ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ కేసు తీవ్రత ఎలా ఉన్నా హైదరాబాద్‌  ప్రతిష్టను మాత్రం దెబ్బ తీస్తోందని, హైదరాబాద్‌ ఇంత బ్యాడా అని ముంబై ప్రజలు తనను అడుగుతున్నట్లు పేర్కొన్నారు. కొందరినే టార్గెట్‌ చేసి జాతీయ స్థాయిలో డ్రామా నడపడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట కూడా మసకబారుతుందని అన్నారు. అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ విచారణతో వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చాలా మంది అనుకుంటున్నారని పేర్కొన్నారు.



సీఎం కేసీఆర్‌ను అనేక విషయాల్లో ముంబై ప్రజలు మెచ్చుకుంటారని కానీ టీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యవహారాన్ని చూసి షాక్‌ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ‘బాహుబలి’ ద్వారా తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని డైరెక్టర్‌ రాజమౌళి పెంచారని ప్రజలు అనుకుంటుండగా అకున్‌ సబర్వాల్, ఆయన బృందం కలసి తలదించుకునేలా చేశారని అన్నారు. అందుకే సిట్‌ను సరిగా సెట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.

 

వర్మ ట్వీట్స్‌పై రంగారెడ్డి కోర్టులో కేసు

సినీరంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ మాఫియా కేసులో ఎక్సైజ్‌ శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలైంది. డ్రగ్స్‌ మాఫియా పేరుతో సినీ పరిశ్రమ ను టార్గెట్‌ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ మీడియాకు బాహుబలిలా కనిపిస్తున్నారంటూ వర్మ తన ట్వీటర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ న్యాయవాది రంగప్రసాద్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. వర్మ వ్యాఖ్యలు ఎక్సైజ్‌ శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని, ఇది శిక్షార్హమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందన్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top