
ఎస్-మార్ట్ యజమాని భారీ మోసం
ఎస్-మార్ట్ షోరూమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేముల రవికుమార్ భారీ మోసానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: ఎస్-మార్ట్ షోరూమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేముల రవికుమార్ భారీ మోసానికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలో నిర్మించిన భారీ భవనంలో జీహెచ్‌ఎంసీ వద్ద మార్ట్‌గేజ్‌లో ఉన్న అంతస్థును నిబంధనలకు విరుద్ధంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు విక్రయించేందుకు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇదే భాగాన్ని మరో సంస్థ వద్ద మార్ట్‌గేజ్ చేశారు. మొత్తమ్మీద రూ.5 కోట్ల గోల్‌మాల్‌కు పాల్పడటంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రవికుమార్‌పై సైబరాబాద్‌లోని పోలీసుస్టేషన్లలోనూ కేసులు ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో ఆ వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
కర్నూలుకు చెందిన రవికుమార్ ఖైరతాబాద్‌లో రాఘవేంద్ర టెలిట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. దీనికి అనుబంధంగానే నగర వ్యాపంగా ఐదారు ప్రాంతాల్లో ఎస్-మార్ట్ పేరుతో షోరూమ్స్ ఏర్పాటు చేసి కేవలం ఎలక్ట్రానిక్ వస్తువుల్ని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. రాఘవేంద్ర టెలిట్రానిక్స్ సంస్థలో రవికుమార్ సోదరుడు రాఘవేంద్ర, భార్య నీలిమ సైతం డైరెక్టర్లుగా ఉన్నారు. రవికుమార్ కొన్నేళ్ళ క్రితం గచ్చిబౌలి ప్రాంతంలో 800 గజాల సంస్థలాన్ని వ్యక్తిగతంగా ఖరీదు చేశారు.
ఇందులో ఐదు అంతస్థుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం నిర్మాణానికి అనుమతి తీసుకునేప్పుడే ఆ భవనంలోని కొంత భాగాన్ని మార్ట్‌గేజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే దీన్ని రిలీజ్ చేస్తారు. నిబంధన ప్రకారం అప్పటి వరకు మార్ట్‌గేజ్ చేసిన భాగాన్ని విక్రయించడానికి ఆస్కారం లేదు. రవికుమార్ నిర్మిస్తున్న భవనంలో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండో అంతస్థును జీహెచ్‌ఎంసీకి మార్ట్‌గేజ్ చేశారు. ఇది రిలీజ్ కాకుండానే 2015 ఆగస్టులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకటరమణకు రూ.3.15 కోట్లకు విక్రయించేందు సేల్ అగ్రిమెంట్ చేసుకుని రూ.2.5 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు.
నిర్ణీత సమయంలోపు ఆ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసి అప్పగించలేని పక్షంలో తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా ఒప్పందం చేయడంతో వెంకటరమణ బ్యాంకు ద్వారా నగదు చెల్లించారు. ఇది జరిగిన పదిహేను రోజులకు అదే అంతస్థును ప్రికా డెవలపర్స్ అనే సంస్థకు మార్ట్‌గేజ్ చేసిన రవికుమార్ రూ.2.5 కోట్లు రుణం తీసుకున్నారు. ఇలా జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్న భవనం రెండో అంతస్థుపై నిబంధనలకు విరుద్ధంగా రూ.5 కోట్లు తీసుకున్నారు. నిర్ణీత గడువు లోపు రెండో అంతస్థును తనకు అప్పగించకపోవడం, అసలు నిర్మాణం సైతం పూర్తి చేయకపోవడంతో అనుమానం వచ్చిన వెంకటరమణ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో సేల్ అగ్రిమెంట్ సమయంలో తన వద్ద అడ్వాన్స్‌గా తీసుకున్న మొత్తాన్ని ఒప్పందం ప్రకారం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిందిగా వెంకటరమణ ఎస్-మార్ట్ ఎండీ రవికుమార్‌కు స్పష్టం చేశారు. చివరకు కనీసం వడ్డీ లేకుండా అసలైనా ఇవ్వాల్సిందిగా కోరినా రవికుమార్ నుంచి సరైన స్పందన లేదు. తన డబ్బు విషయం అడిగిన వెంకటరమణకు రవికుమార్ నుంచి బెదిరింపులు సైతం ఎదురయ్యాయి. దీంతో ఆయన ఎస్-మార్ట్ ఎండీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాణాలో నమోదైన ఈ కేసు పూర్తిస్థాయి లోతైన దర్యాప్తు కోసం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఇన్‌చార్జ్ అదనపు డీసీపీ జి.జోగయ్య నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ అధికారులు జీహెచ్‌ఎంసీ సహా ఇతర చోట్ల నుంచి రికార్డులు సేకరించడంపై దృష్టి పెట్టారు. ఆధారాలు లభించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోపక్క రవికుమార్ గత చరిత్రను పరిశీలిస్తున్న పోలీసులకు ఆయనపై గతంలో సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలోనూ ఓ కేసు నమోదైనట్లు తెలిసింది. దీంతో ఆ కేసు వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టారు.