రోగులకు ‘పరీక్ష’!

రోగులకు ‘పరీక్ష’!


 సాక్షి, హైదరాబాద్:  ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు.. పేదోడికి పెద్దరోగం వస్తే ఆదుకొనే వైద్యాలయాలు. కానీ, ఇప్పుడు వాటికే పెద్ద జబ్బు చేసింది. నిపుణులైన డాక్టర్లు ఉన్నా.. సుశిక్షుతులైన సిబ్బంది ఉన్నా.. సరైన సదుపాయాలు లేక విలవిలలాడుతున్నాయి. నిరుపేద నిండుప్రాణాలు తన ప్రాంగణంలోనే పోతున్నా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమైంది. ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, వెంటిలేటర్స్, ఈసీజీ, టూడీఎకో, డయాలసిస్, కలర్‌డాప్లర్, ఎక్స్‌రే, ఎండోస్కోపి, కొలనోస్కోపి మిషన్లు ఈ రెండు ఆసుపత్రుల్లో తగినన్ని లేవు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. గాంధీలో ఎంఆర్‌ఐ కోసం ఇప్పటికే 250 మందికిపైగా ఎదురు చూస్తుంటే, ఉస్మానియాలో 180 మందికిపైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల కోసం 15 నుంచి 30 రోజులు వేచి ఉండాల్సివస్తోంది. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత లేక సర్కారు ఆసుపత్రిల్లోనే రోజులు వెళ్లదీస్తున్న రోగులు చివరకు రోగం ముదిరి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు.

 

 గాంధీలో రోజూ 250 మంది వెయిటింగ్

 

 గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 200 నుంచి 300 రోగులు వస్తుండగా, వీరిలో చాలా మందికి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ అవసరం. ఒక్కో సీటీ స్కాన్‌కు 20 నిమిషాలు పడుతుంది. ఇలా గంటకు ముగ్గురి చొప్పున రోజుకు సగటున 30 నుంచి 35 మందికి మాత్రమే టెస్టులు చేయగలరు.  కానీ రోగుల సంఖ్య రోజు వందల్లో ఉండడంతో ఇక్కడి సిబ్బంది ప్రతిరోజు  50కిపైగా సీటీ, ఎంఆర్‌ఐ టెస్టులు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రస్తుతం 250 మందికిపైగా రోగులు ఇక్కడ తమ రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే మరుసటి ఉదయం 11 గంటలకు గానీ ఈ ఆసుపత్రిలో రిపోర్టులు రోగుల చేతికి అందవు. ఇక పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. రేడియాలజీ విభాగానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు(ఏఎంసీ) లేకపోవడం వల్ల రిపేరు చేయడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. రక్తప్రసరణ తీరును గుర్తించే కలర్‌డాప్లర్ టెస్ట్‌కు రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నెఫ్రాలజీ విభాగంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉంటే కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదనంగా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సమకూర్చాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యం డీఎంఈకి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందనే లేదు.

 

 ఉస్మానియాలో ఇలా...

 

 ఉస్మానియా ఆసుపత్రికి రోజూ రెండు వేలకుపైగా రోగులు వస్తుంటారు. ఇక్కడి క్యాజువాల్టీలో వెంటిలేటరే లేదు. ఇక ఏఎంసీ వార్డులో ఒకే వెంటిలేటర్ పని చేస్తుంది. రికార్డుల్లో 40కిపైగా వెంటిలేటర్లు ఉన్నా పనిచేస్తున్నవి మాత్రం 25కి మించి లేవు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఒకే ఒక్క ఎంఆర్‌ఐ మిషన్ ఉంది. దీంతో పరీక్ష  చేయాలంటే ఒక్కో రోగికి సగటున 30 నిమిషాలు పడుతోంది. దీంతో ఇక్కడ పేరు నమోదు చేయించుకున్న రోగులకు 12 రోజుల తర్వాతే టెస్టుల కోసం సమయం ఇస్తున్నారు. ప్రస్తుతం 180 మంది ఇక్కడ వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. సీటీస్కాన్‌దీ అదే పరిస్థితి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్ల కాలపరిమితి ముగియడంతో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. నెబులైజర్స్ లేక ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతున్నారు. రోగుల గుండెను రీయాక్టివ్ చేయడానికి ఉపయోగించే డి ప్రీవిలేటరూ అందుబాటులో లేదు. రోగుల నిష్పత్తికి తగినన్ని పరికరాలు సమకూర్చాలని ఆస్పత్రి అధికారులు ఏడాది క్రితం ప్రభుత్వానికి లేఖ రాసినా  స్పందన లేదు.  ఇక్కడ డిజిటల్ ఎక్స్‌రే సర్వీసులు అందుబాటులో ఉన్నా సాధారణ ప్రింట్‌లనే చేతికిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఎక్స్‌రే తీయించుకుంటే సాయంత్రం ఐదు గంటలకు రిపోర్టు చేతికందుతుంది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top