క్యాబ్‌.. కష్టమే.. | Ola joined the third day, Uber cabs strike | Sakshi
Sakshi News home page

క్యాబ్‌.. కష్టమే..

Jan 3 2017 1:44 AM | Updated on Aug 30 2018 9:02 PM

క్యాబ్‌.. కష్టమే.. - Sakshi

క్యాబ్‌.. కష్టమే..

కొత్త వాహనాలకు అనుమతి, షేర్‌ బుకింగ్‌ల నిలిపివేత వంటి డిమాండ్లతో ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్లు చేపట్టిన బంద్‌ సోమవారం మూడో రోజుకు చేరింది.

♦ మూడో రోజుకు చేరిన ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ల బంద్‌
♦ నగరవాసులకు తప్పని తిప్పలు  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త వాహనాలకు అనుమతి, షేర్‌ బుకింగ్‌ల నిలిపివేత వంటి డిమాండ్లతో ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్లు చేపట్టిన బంద్‌ సోమవారం మూడో రోజుకు చేరింది. తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బంద్‌తో రెండు సంస్థలకు చెందిన సుమారు 60 వేల క్యాబ్‌లకు గత మూడు రోజులుగా బ్రేక్‌లు పడ్డాయి. అయితే ఉబెర్, ఓలా యాజమాన్యాలు దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వం సైతం ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరవధిక సమ్మె దిశగా క్యాబ్‌ డ్రైవర్ల సంఘాలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.

ఈ నెల 4న సమ్మె విర మించాలని మొదట భావించినప్పటికీ... క్యాబ్‌ సంస్థల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో నిరవధికంగా సమ్మె కొనసాగించాలని భావిస్తున్నట్లు అసోసి యేషన్‌ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూకర్‌ తెలిపా రు. మరోవైపు సికింద్రాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, తదితర ప్రాంతాల్లో మూడో రోజూ క్యాబ్‌ డ్రైవర్ల ధర్నాలు, ఆందోళనలు కొనసాగాయి. కాగా, అంతర్జాతీయ సంస్థలైన ఓలా, ఉబెర్‌ లు ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు సాగి స్తున్నం దున మోటారు వాహన చట్టం పరిధి లోకి రావని,ఈ విషయంలో తామేమీ చేయ లేమని తనను కలిసిన క్యాబ్‌ డ్రైవర్లకు సంయుక్త రవాణా కమిషనర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు.

నేడు ఇందిరా పార్కు వద్ద ధర్నా...
తమ సమస్యలను పరిష్కరించమని క్యాబ్‌ల యాజమాన్యాల వద్దకు వెళితే... ‘మా నిబంధనల ప్రకారం నడిపితే నడపండి... లేదంటే కేసులు పెట్టుకోండి. మాకు ప్రభుత్వం అండగా ఉంది’అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నాయని తెలంగాణ స్టేట్‌ క్యాబ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకటరంగారావు ఆరోపించారు. సంస్థల తీరుకు వ్యతిరేకంగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తామని, అనంతరం సీఎం, రవాణా శాఖ మంత్రులకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు.

నగరవాసుల ఇబ్బందులు...
నూతన సంవత్సర వేడుకల తరువాత తొలి వర్కింగ్‌ డే కావడంతో క్యాబ్‌లపై అధికంగా ఆధారపడ్డ ఐటీ ఉద్యోగులు సోమవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు.  ఇదే అదనుగా ఇతర క్యాబ్‌ సర్వీసులు, ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అందిన కాడికి దోచుకున్నారు.

ఆటోవాలాలకు డిమాండ్‌...
మూడు రోజులుగా క్యాబ్‌లు అందు బాటులో లేకపోవడంతో ఆటోవాలాలు బాగా డిమాండ్‌ చేస్తున్నారు. కేపీహెచ్‌బీ నుంచి మాదాపూర్‌ వరకు రూ.200 డిమాండ్‌ చేస్తున్నారు. నలుగురు ఉద్యోగు లం కలిసి ఒక క్యాబ్‌ బుక్‌ చేసుకొంటే ఎంతో చౌకగా ఆఫీసుకు చేరుకొనేవాళ్లం.
    – ఇమ్రాన్, ఐటీ ఉద్యోగి

ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం..
రోజుకు 18 నుంచి 20 గంటలు స్టీరింగ్‌ వదలకుండా పనిచేసినా ఈఎం ఐ చెల్లించలేకపోతున్నాము. మొదట్లో మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కో డ్రైవర్‌కు ఒక్కో విధమైన ఇన్సెంటివ్‌లు ఇస్తూ అందరినీ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు.
    – సురేష్, డ్రైవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement