ప్రక్షాళనకు ‘సర్వేయర్‌’ కష్టాలు

ప్రక్షాళనకు ‘సర్వేయర్‌’ కష్టాలు - Sakshi

- వ్యవసాయేతర భూ రికార్డుల పరిశీలనకు రెవెన్యూ ఆపసోపాలు

కనీసం మండలానికో సర్వేయర్‌ ఉంటే పరిశీలన సులభతరం

 

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సర్వేయర్ల అంశం సమస్యగా మారుతోంది. వ్యవసాయ భూముల వరకు సర్వేయర్లతో అవసరం లేకుండానే రికార్డుల పరిశీలన జరుగుతుండగా.. వ్యవసాయేతర భూములు, ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలో సర్వేయర్ల అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రక్షాళనలో 10 శాతం వరకు ఇలాంటి భూముల సమస్యలే వస్తున్నాయి. రికార్డుల్లో ఎక్కువ భూమి ఉండి, అసలు భూమి తక్కువగా ఉండటం, రికార్డుల్లో తక్కువగా ఉండి, అసలు భూమి ఎక్కువగా ఉండటం లాంటి సమయాల్లో కూడా కచ్చితంగా సర్వేయర్ల అవసరం వస్తోంది.



ఇప్పటివరకు 86 వేల సర్వే నంబర్ల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించగా.. అందులో 2 వేల వరకు భూముల కొలత ల్లో తేడాలొచ్చాయి. 840 సర్వే నంబర్లలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరుగుతుంటే రికార్డుల్లో ఇంకా వ్యవసా యమనే ఉంది. మరో 539 సర్వే నంబర్ల భూమిని ప్రజావసరాలకు ప్రభుత్వం సేకరించినా.. ఇంకా పట్టాదా రుల పేర్లే రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగు కేటగిరీల భూ రికార్డులను సవరించాలంటే సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.



ప్రక్షాళన పూర్తయ్యే సరికి ఈ సంఖ్య లక్షల సర్వే నంబర్లకు చేరుతుందని, ప్రక్షాళన జరుగుతుండగానే వీటిని పరిష్కరిస్తే రికార్డుల సవరణ సులభ తరమవుతుందని భావిస్తున్నాయి. ఎప్పుడో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు భూమిని సేకరించిన రికార్డులూ అందు బాటులోకి రావడం లేదని, అక్కడ సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

 

70 శాతం సర్వేయర్‌ పోస్టులు ఖాళీయే..

రాష్ట్రంలో 474 సర్వేయర్‌ పోస్టులు మంజూరు కాగా, అందులో 354 ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే ఇందులో 110 పోస్టులను డీగ్రేడ్‌ చేసి డిప్యూటీ సర్వేయర్లుగా మార్చారు. ఈ డిప్యూటీ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించారు. కానీ ఇంతవరకు ఫలితాలు రాలేదు. మంజూరైన పోస్టుల్లో 70 శాతం మేర ఖాళీలుండటంతో వారిని భూరికార్డుల ప్రక్షాళనకు విని యోగించుకోలేకపోతున్నారు. సర్వేయర్లున్న మండలాల్లో మాత్రం ప్రక్షాళన బృందాల్లో వారిని చేర్చుకున్నారు.



లేనిచోట్ల వదిలేస్తున్నారు. అయితే, నల్లగొండ జిల్లాలోని 31 మండలాలకుగాను 31 మంది సర్వేయర్లను ప్రక్షాళన బృందాల్లో నియమించారు. ప్రభుత్వ సర్వేయర్లు, ఐకేపీలో 25 మంది ఉండగా, వారితో పాటు మరో 10 మంది లైసెన్స్‌డ్‌ ప్రైవేటు సర్వేయర్లను ఆ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌.గౌరవ్‌ ఉప్పల్‌ ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుని ప్రక్షాళన బృందాల్లో చేర్చారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top