అదనపు ట్యాంకర్లే.. కొత్త బోర్లు లేవు! | No new bores...in summer | Sakshi
Sakshi News home page

అదనపు ట్యాంకర్లే.. కొత్త బోర్లు లేవు!

Apr 16 2015 1:06 AM | Updated on Sep 3 2017 12:20 AM

ప్రతి యేటా వేసవిలో తలెత్తే నీటిఎద్దడి దృష్ట్యా దాదాపు రూ. 10 నుంచి రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ ఈసారి కొత్త బోర్లు వేయడం లేదు.

సాక్షి, సిటీబ్యూరో : ప్రతి యేటా వేసవిలో తలెత్తే నీటిఎద్దడి దృష్ట్యా దాదాపు రూ. 10 నుంచి రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ ఈసారి కొత్త బోర్లు వేయడం లేదు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో  పాలకమండలి సమయంలో వేసవి వచ్చిందంటే చాలు కార్పొరేటర్ల నుంచి బోర్ల కోసం విజ్ఞప్తులు వెల్లువెత్తేవి. దాంతో అధికారులు బోర్ల కోసమని నిధులు మంజూరు చేసేవారు. నిధులు ఖర్చయ్యేవి కానీ.. బోర్లలో నీరు వచ్చేది కాదు. వెయ్యి అడుగుల మేర బోరు వేసినా నీరు రాకపోవడం  అందుకు ఒక కారణం కాగా, కార్పొరేటర్లు..కాంట్రాక్టరుల కుమ్మక్కై  పనులను మమ అనిపించేవారు.

మొత్తానికి ప్రజలకు నీరందకపోయినా నిధులు ఖర్చయ్యేవి. భూగర్భజలాలు తగినంతగా లేనందున కొత్తగా పవర్‌బోర్లు వేసినా ఫలితం లేదని భావించిన అధికారులు ఈసారి నీటికొరత ఉందంటూ విజ్ఞప్తి అందినప్రాంతాలకు అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. అదనపు ట్యాంకర్ల ద్వారా వేసవిలో  నీటి పంపిణీకి  దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు.  ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిసరఫరా పైప్‌లైన్లు లేని శివారు కాలనీలకు  జీహెచ్‌ఎంసీయే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. రెగ్యులర్ ట్యాంకర్లతో పాటు వేసవిలో అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సర్కిళ్ల వారీగా వినియోగించనున్న అదనపు ట్యాంకర్లు,  అందుకయ్యే వ్యయం వివరాలిలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement