
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత
పౌరహక్కుల సంఘం నేత, సీనియర్ జర్నలిస్టు ఎం.టి.ఖాన్ (85) బుధవారం హైదరాబాద్ పురానాపూల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్: పౌరహక్కుల సంఘం నేత, సీనియర్ జర్నలిస్టు ఎం.టి.ఖాన్ (85) బుధవారం హైదరాబాద్ పురానాపూల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సాయంత్రం పురానాపూల్ మూసాఖాద్రీ దర్గాలో ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఖాన్ గొప్ప మానవతావాది అని.. పౌర హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడారని కొనియాడారు.
విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరులో అరెస్టైన తొలితరం పౌరహక్కుల నేతల్లో ఖాన్ ఒకరని చెప్పారు. పౌర హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ శేషయ్య, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, సియాసత్ సంపాదకులు జాహేద్ అలీఖాన్, సినీ దర్శకులు నారాయణమూర్తి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం సంతాపం: ఎంటీ ఖాన్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఖాన్ పాత్రికేయరంగానికి చేసిన సేవలను కొనియాడారు.
సీపీఐ సంతాపం..: ఎం.టి.ఖాన్ మృతిపట్ల తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంటకరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అణగారినవర్గాల ఉద్యమాలు, హక్కుల రక్షణతో ఖాన్ జీవితం ముడిపడి ఉన్నదని, ఆయన మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు.