breaking news
MT Khan
-
నేలకొరిగిన ఉద్యమ కెరటం
పౌరహక్కుల నేత ఎంటీ ఖాన్ మృతితో విషాదఛాయలు ఉద్యమ నేతగా,జర్నలిస్టుగా సుపరిచితం సంతాపం తెలిపిన పలువురు నేతలు సాక్షి, సిటీబ్యూరో: తొలితరం కమ్యూనిస్టు నేత, పౌరహక్కుల ఉద్యమ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడైన ఎంటీ ఖాన్ మృతి ఆయన అభిమానుల్లో విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఖాన్ అనేక చారిత్రక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ఎంతోమంది ఉద్యమకారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేశారు. జీవించే హక్కు ప్రశ్నార్థకమైన ప్రతి సందర్భంలో ఆయన ఒక ఉద్యమ కెరటమై ఎగిసారు. మగ్దుం మొహియొద్దీన్ రచించిన ‘సుర్ఖ్‌సవేరా’ (అరుణోదయం) ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. చదువుకునే రోజుల్లోనే ఉద్యమ బాట పట్టించింది. ఉద్యమకారుడిగానే కాకుండా ‘న్యూస్‌టైమ్,‘ సియాసత్’ వంటి దినపత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. ఎంటీ ఖాన్‌గా సుపరిచితులైన మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ మరణంతో పౌర హక్కుల నేతలు ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఉద్యమ ప్రస్థానం... వైభవోపేతమైన నిజాం పరిపాలనకే కాదు. దళిత, అణగారిన వర్గాలు, హిందూ-ముస్లింల సహజీవనానికి కేంద్రమైన పురానాఫూల్‌లో ఎంటీఖాన్ జన్మించారు. తల్లి మతిస్థిమితాన్ని కోల్పోవడంతో చిన్నప్పటి నుంచి దళితుల ఇళ్లల్లోనే పెరిగారు. ‘అందుకే జన్మతహా ముస్లిం అయినా పెంపకం రీత్యా తెలుగువాడినే’ అంటారాయన. సిటీ కాలేజీ హైస్కూల్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో మగ్దుం మొహియొద్దీన్ అక్కడ ఉపాధ్యాయుడు. ఆయన చెప్పే పాఠాలు విద్యార్థులను బాగా ప్రభావితం చేసేవి. మగ్దుం రాసిన ‘సుర్ఖ్‌సవేరా’ గ్రంథాన్ని ప్రభుత్వం నిషేధించింది. మగ్దుం సాహిత్య పరిమళాలు నగర వాసుల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపాయి. అలా మగ్దుం నుంచి స్ఫూర్తి పొందిన ఎంటీ ఖాన్ ఆయన చూపిన బాటలోనే నడిచారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ పేరుతో సంఘటితమయ్యారు. పదోతరగతి చదివే రోజుల్లోనే ఖాన్ ఆ పార్టీలో సభ్యత్వం పొందారు. గులాంహైదర్, శ్రీనివాస్ లహూటి, పి.లక్ష్మీరాజ్, జి.రాంచందర్, పొన్నయ్య, పరమేశ్వర్, శంకర్‌దాస్ వంటి నగర ప్రముఖులు అప్పటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. ఆ తరువాత పార్టీలో అనేక చీలికలు చోటుచేసుకున్నాయి. ఏడో దశాబ్దం నాటి నక్సల్బరీ వసంత మేఘగర్జన ఆయన్ను ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో నారాయణగూడలోని వైఎంసీఏ హాల్ విప్లవకారుల సమావేశాలకు కేంద్ర బిందువుగా ఉండేది. తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య వంటి ప్రముఖుల పరిచయం, ప్రసంగాలు ఖాన్ జీవితాన్ని మలుపు తిప్పాయి. 1972లో కొండపల్లి నేతృత్వంలో వెలువడిన ‘పిలుపు’ పక్షపత్రిక నిర్వహణలో ఖాన్ కీలక భూమికను పోషించారు. శ్రీకాకుళ ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొందారు. నగరంలో జరిగిన ప్రతి సాహిత్య, చారిత్రక ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొన్నారు. చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ వంటి దిగంబర కవులు, శ్రీశ్రీ, సత్యమూర్తి వంటి విప్లవ రచయితలతో బాగా ప్రభావితమయ్యారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్టు కాగా ఏడాదికిపైగా జైలు జీవితం గడిపారు. ఆ తరువాత ఎమర్జెన్సీ రోజుల్లోనూ జైలు శిక్షను అనుభవించారు. ఎమర్జెన్సీ అనంతరం జైలు నుంచి బయటకు వచ్చాక ఏపీసీఎల్సీలో చురుగ్గా పాల్గొన్నారు. రెండేళ్లపాటు ఆ సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ బుక్ ట్రస్టులో పని చేశారు. ఉర్దూ, ఇంగ్లిష్ దినపత్రికల్లో పాత్రికేయుడిగా విధులు నిర్వహించారు. ఉద్యమానికి తీరని లోటు.. ఎంటీ ఖాన్ మరణం పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఏపీసీఎల్సీ మాజీ అధ్యక్షుడు ఖాన్ మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు అని మానవ హక్కుల వేదిక రాష్ర్ట అధ్యక్షులు ఎస్.జీవన్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హక్కుల ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టుగానే కాకుండా రచయితగా, పాత్రికేయుడిగా సుపరిచితులైన ఖాన్‌తో అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని ప్రముఖ కవి నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. విలువల కోసం పనిచేసిన మేధావి ఎంటీ ఖాన్ కల్లోల దశాబ్దంలో పాతనగరంలో వికసించిన ఎర్రయోధుడు ఎంటీ ఖాన్ అని ప్రముఖ కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు అన్నారు. ఖాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, ప్రగతిశీల రంగంలో ఉన్నత విలువలతో పనిచేసిన మేధావి అని కొనియాడారు. -
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత
హైదరాబాద్: పౌరహక్కుల సంఘం నేత, సీనియర్ జర్నలిస్టు ఎం.టి.ఖాన్ (85) బుధవారం హైదరాబాద్ పురానాపూల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సాయంత్రం పురానాపూల్ మూసాఖాద్రీ దర్గాలో ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఖాన్ గొప్ప మానవతావాది అని.. పౌర హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడారని కొనియాడారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరులో అరెస్టైన తొలితరం పౌరహక్కుల నేతల్లో ఖాన్ ఒకరని చెప్పారు. పౌర హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ శేషయ్య, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, సియాసత్ సంపాదకులు జాహేద్ అలీఖాన్, సినీ దర్శకులు నారాయణమూర్తి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం సంతాపం: ఎంటీ ఖాన్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఖాన్ పాత్రికేయరంగానికి చేసిన సేవలను కొనియాడారు. సీపీఐ సంతాపం..: ఎం.టి.ఖాన్ మృతిపట్ల తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంటకరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అణగారినవర్గాల ఉద్యమాలు, హక్కుల రక్షణతో ఖాన్ జీవితం ముడిపడి ఉన్నదని, ఆయన మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు.