మా బతుకు మమ్ముల బతకనీయండి

మా బతుకు మమ్ముల బతకనీయండి - Sakshi


చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపాటు

సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ వాళ్లకు ఉదయం నిద్రలేవడం తెలువదట! ఎన్టీరామారావు వచ్చిన తర్వాతనే ఉదయం నిద్రలేవడం నేర్పిండట. శారీరక కష్టం చేయడం కాదు.. మనసుతో కష్టం చేయాలె.. మీకు బుద్ధిలేదు.. అనే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న రాజమండ్రిలో అన్నడు. ఇది ఏ రకమైన సంస్కారం? దీన్ని వారి విజ్ఞతకే వదిలేద్దామనుకున్నం కానీ.. కేసీఆర్‌ను ఓ మాటంటే పడగలను.కానీ తెలంగాణ సమాజాన్ని అంటే సహించేది లేదు.తెలంగాణ ప్రజలను గానీ, సమాజాన్ని గానీ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కించపరిస్తే ఊరుకోం.. ఎంతవరకైనా వెళ్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతీయులు, వాళ్ల ముఖ్యమంత్రి ఇంకా తెలంగాణపై రకరకాల పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్వేచ్ఛావాయువులు పీలుస్తూ తన బతుకు తాను బతుకుతున్న తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురి కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.బుధవారం దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుక సందర్భంగా  తన గురువు ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్యకు  దాశరథి సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సి. నారాయణరెడ్డి, మధుసూదనాచారి. (పక్కన) శ్రీనివాసాచార్యకు పాదాభివందనం చేస్తున్న కేసీఆర్తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో దాశరథి కృష్ణమాచార్య 91వ జయంత్యుత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్.. దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్యకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, కొన్ని పత్రికలు వ్యవహరిస్తున్న తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘ఒక చక్రబంధం నుంచి బయటపడి స్వేచ్ఛావాయువు పీల్చుకుంటూ తెలంగాణ ముందుకు సాగుతున్నది.తెలంగాణకు ఉన్నదేందో ఉంది. లేనిదేదో లేదు. మన బతుకేందో మనం బతకాలనే ప్రయత్నంలో ఉన్నం. కానీ ఇప్పటికీ కొందరు తమ అక్కసును రకరకాలుగా వ్యక్తీకరిస్తున్నరు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘తిర్రివో, మొర్రివో కొన్ని పత్రికలు ఏపీలో ఏదో జరిగిపోతోందని పుంఖానుపుంఖాలుగా తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నాయి. అమరావతి రాజధాని గురించి అంతంత పెద్ద వార్తలు పేజీలకు పేజీలు వేసి తెలంగాణ ప్రజల మీద రుద్దడం అవసరమా?’’ అని సీఎం ప్రశ్నించారు.

 

అమరావతి కాకపోతే ఆరావళి కట్టుకో

‘‘ఏపీలో రాజధాని నగరం కట్టుకుంటున్నారు. వ ర్ధిల్లాలనే కోరుకుంటున్న. మంచిగ కట్టుకోండి సంతోషిస్తా. అమరావతి కాకపోతే ఆరావళి కట్టుకోండి. ఎవరు వద్దంటున్నరు. మీ ప్రజలకు మీరు సేవ చేసుకోండి. అదేందో మా తెలంగాణకేం అవసరమండీ? మాకర్థం గాదు. హైదరాబాద్ కన్నా అద్భుతం జరిగిపోతుందని పోల్చుకోవడం ఎందుకు... ఆ భంగపాటు ఎందుకు? హైదరాబాద్ హిస్టారికల్ సిటీ. అదృష్టవశాత్తూ తెలంగాణ రాజధాని. తరతరాల కృషి ఫలితం హైదరాబాద్. ఇవ్వాళ హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కాదు.హెచ్‌ఎండీఏ. దీని పరిధి 7,200 చదరపు కిలోమీటర్లు. 18.35 లక్షల ఎకరాలు. కాకతీయుల నుంచి మొదలుకొని నిజాంల వరకు రిజర్వు చేసుకున్న ఫారెస్టే లక్షా యాభై వేల ఎకరాలు. దీనితో పోలిస్తే ఎక్కడ అమరావతి?’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంత మంచి జరుగుతుందనుకున్న దాశరథి మహాంధ్రోదయం అన్నడు. తెలుగు పిచ్చిలో అ ప్పుడు సమర్థించామని దాశరథి సమకాలీన కవులు, రచయితలు చెప్పిన్రు’’ అని సీఎం గుర్తుచేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో విస్మృత కవి దాశరథి

ఉమ్మడి ఏపీలో దాశర థి విస్మృత కవి, ఒక క్రమం ప్రకారం అణచివేతకు గురైన కవి అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక దాశరథి, కాళోజీ వంటి కవులను స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెపుతూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ‘‘అంటే బాధగని.. ఆధునిక కవులలో సి.నారాయణ రెడ్డితో పోల్చదగిన కవి తెలుగు సాహిత్యంలో ఉన్నడా? మాకు లేరా ఇలాంటి పర్సనాలిటీలు? మేం మిడిసిపడుతున్నమా? జబ్బలు జరుచుకుంటమా.మా బతుకు మమ్ముల్ని బతుకనీయండి మహాప్రభో అంటున్నం. అయినా ఇట్లనే అంటే ఒక్కటికి పదంటం. ఈట్‌కా జవాబ్ పత్తర్‌తో దేనా.. తప్పదు! దాశరథి తెలంగాణ కోసం పోరాడిన స్ఫూర్తి ఇక్కడి ప్రతి వ్యక్తిలో నిబిడీకృతమై ఉంది’’ అని పేర్కొన్నారు. అనంతరం తిరుమల శ్రీనివాసాచార్య మాట్లాడుతూ.. దాశరథితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ దుబ్బాక హైస్కూల్‌లో తన శిష్యుడని, ఆయన ఈ స్థితికి చేరడం గర్వకారణమని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దాశరథి తనను సోదరుడిగా ఆశీర్వదించారని చెప్పారు.గాలిబ్ గజళ్లను గీతపద్యాలుగా అనువదించిన కవి అని కొనియాడారు. దాశరథి జయంతిని ప్రభుత్వ పండుగగా జరుపుకోవడం ఆనందదాయకమని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top