జీపీఎస్ గుప్పిట్లో గస్తీ కార్లు

జీపీఎస్ గుప్పిట్లో గస్తీ కార్లు


నగర పోలీసు కమిషనరేట్‌లో మరో కొత్త అధ్యాయానికి తెర

మొబైల్ పెట్రోలింగ్ కార్లకు జీపీఎస్‌తో అనుసంధానం

పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్ ఠాణాల నుంచి షురూ


 

ఏదైనా అనుకోని ఘటనపై సమాచారం అందిన వెంటనే పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి ఎంత సమయంలో చేరకుంది? డ్రైవర్, సిబ్బంది కానీ ఏమైనా ఆలస్యం చేశారా? తదితర విషయాలు పోలీసు కంట్రోల్ రూంలోని అధికారులకు గతంలో తెలిసేవి కావు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. జీపీఎస్ అనుసంధానంతో  గస్తీ వాహనం ఎప్పుడు ఎక్కడ ఉంది? ఏఏ రూట్‌లో  ఏం వేగంతో వెళ్తోంది తదితర వివరాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

 

సిటీబ్యూరో:  నగర పోలీస్ కమిషనరేట్ మరో కొత్త అంకానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు మొబైల్ పెట్రోలింగ్ కార్లకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)తో అనుసంధానం చేసింది. తొలిసారిగా పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ వాహనాలకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. గత ఆగస్టులో జంట కమిషనరేట్లకు ప్రభుత్వం 1600 ఇన్నోవా కార్లు అందజేయగా, వాటిలో 124 నగరంలోని ఠాణాలకు పెట్రోలింగ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. గస్తీ వాహనాలను జీపీఎస్ విధానంలోకి తీసుకొస్తామని అప్పట్లో కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించగా, దీనిని అమలుకు సాంకేతిక నిపుణులు, ఐటీ సెల్ అధికారులు మూడు నెలలు శ్రమించారు. ప్రయోగాత్మకంగా మూడు పోలీసుస్టేషన్‌ల పరిధిలో అమలు చేస్తున్నారు. త్వరలో నగరంలోని అన్ని ఠాణాలకు విస్తరిస్తారు. ఈ విధానం ఆపదలో ఉన్నవారికి పోలీసు సేవలు మరింత త్వరగా అందేందుకు ఉపకరిస్తుంది.



ఇలా పనిచేస్తుంది...



వాహనంలో వెహికిల్ ట్రాకింగ్ డివైస్ (వీటీడీ) అమర్చుతారు. ఈ పరికరం సిమ్ కార్డు రూపంలో ఉంటుంది.   దీనికి కేటాయించిన ఐడీ నంబర్‌ను జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సర్వర్‌కు లింక్ చేస్తారు. కంప్యూటర్ స్క్రీన్ పై వాహన కదలికలను గమనిస్తారు. స్క్రీన్ పై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల కార్లు కనిపించేలా డిజైన్ చేశారు. ఎరుపు రంగు కారు కనిపిస్తే ఆ వాహనం ఇంజన్ ఆఫ్‌లో ఉన్నట్లుగా, పసుపు రంగు కారు కనిపిస్తే వాహనం ఇంజన్ ఆన్‌లో ఉన్నట్లుగా, ఆకుపచ్చ రంగు కనిపిస్తే వాహనం రన్నింగ్‌లో ఉన్నట్లుగా గుర్తిస్తారు. స్క్రీన్ పై ఉన్న కారు బొమ్మను క్లిక్ చేస్తే ఆ వాహనం ఎంత వేగంతో వెళ్తోంది, ఎక్కడ పార్క్ చేసి ఉందో ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా గస్తీ వాహనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఏ రూట్‌లో తిరిగింది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది. ఎక్కడ ఎంత సేపు ఆగింది పూర్తి డేటా సర్వర్‌లో నమోదు అవుతుంది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top