లక్ష్యం గోరంత.. నిర్లక్ష్యం బోలె డంత!


సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాలు, పేదలకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్ల తీరుపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  కలెక్టరేట్లో  బుధవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షలో ఆయా శాఖల నుంచి ఇదేతీరు వ్యక్తమైంది. చిన్న చిన్న టార్గెట్లను కూడా చేరని బ్యాంకులపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా రిజర్వ్ బ్యాంకు ఏజీఎంకు ఫిర్యాదు చేశారు. కీలకమైన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశానికి డుమ్మా కొట్టిన బ్యాంకు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు.

 

మైనార్టీ రుణాలకు‘అధోగతి’

 

రుణాల మంజూరులో ఎస్సీ కార్పొరేషన్, యువజన సంక్షేమం విభాగాలు లక్ష్యానికి  చేరువలో ఉండగా, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల వెనుకబడి ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. రుణాల మంజూరు నత్తనడకన సాగడంలో బ్యాంకుల నిర్లక్ష్యం ఉందని తేల్చారు. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి..



బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, యూకో బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దీనాబ్యాంకులు జారీచేసిన అనుమతి పత్రాలు నాలుగుకు మించిలేవని తేల్చారు. సమావేశానికి ఆహ్వానించినా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ప్రతినిధుల గైర్హాజరుపై ఎల్డీఎంను వివరణ కోరారు.



కాగా, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి బ్యాంకు శాఖలకు తగినన్ని దరఖాస్తులు కూడా అందలేదని బాంకర్లు ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ఫిబ్రవరి 10, 20, 29 తేదీల్లో బ్యాంకర్లు, కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. లక్ష్యానికి చేరువైన యువజన సంక్షేమ విభాగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ అభినందించారు.

 

లక్ష్యానికి మించి రుణాలిస్తాం: లక్ష్మణ్ కుమార్

 

ఎస్సీ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి తెచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. మంజూరైన రుణ ంలో 60శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి, నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ఎస్సీలకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలో బ్యాంకులు కన్సెంట్లు ఇచ్చిన పక్షంలో అవసరమైతే ఈ ఏడాది వార్షిక లక్ష్యానికి మించి కూడా సబ్సిడీ విడుదల చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ సంసిద్ధంగా ఉందన్నారు.



రుణాల కోసం దరఖాస్తు చేసుకొనే వారికి త్వరితగతిని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ భరత్‌కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం బి.సరోజిని, ఎస్బీహెచ్ ఎజీఎం బద్రీనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సలీంపాషా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాజానజీం అలీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శివప్రసాద్, యువజన సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top