బాలకృష్ణపై ఇండియాటుడే ప్రత్యేక సంచిక

బాలకృష్ణపై ఇండియాటుడే ప్రత్యేక సంచిక - Sakshi


ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు


హైదరాబాద్: సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలపై పుస్తకాలు రావాల్సి ఉందని.. అలాంటి పుస్తకాలు, ప్రత్యేక సంచికలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఇండియా టుడే ప్రచురించిన ప్రత్యేక సంచికను గురువారం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. తొలి కాపీని బాలకృష్ణకు అందించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి గురించిన అంశాలను వేర్వేరు చోట్ల చదువుకునే కన్నా.. అంతా కలిపి ఒకేచోట గుదిగుచ్చి ఇచ్చిన పుస్తకంలో చదువడం బాగుంటుంది. ఇండియా టుడే పత్రిక చాలా శ్రమించి, అత్యున్నత ప్రమాణాలతో వేసిన ఈ బాలకృష్ణ ప్రత్యేక సంచిక బాగా వచ్చింది. మంచి టైమ్‌లో వచ్చిన మంచి పుస్తకం ఇది. భవిష్యత్ తరాలకు ఒక రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.

సినీ, రాజకీయ, సేవా రంగాలు మూడింటిలోనూ తన కృషిని గుర్తించి ఇండియా టుడే ఈ ప్రత్యేక సంచిక వేయడంపై బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఐదారు నెలల పాటు శ్రమించి ఎన్నో ఇంటర్వ్యూలు, అరుదైన ఫోటోలను క్రోడీకరించి, ఈ సంచికను అందంగా తీసుకొచ్చారు. నాలోని అన్ని కోణాలనూ స్పృశిస్తూ వచ్చిన ఈ సంచిక అందరినీ ఆకట్టుకుంటుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సంచిక రూపకల్పనలో పాలుపంచుకొన్న కొమ్మినేని వెంకటేశ్వరరావు, డాక్టర్ సురేంద్ర, సీనియర్ జర్నలిస్టులు ఎ.రామ్మోహన్‌రావు, ప్రదీప్, ఎల్.వేణుగోపాల్, ‘ఇండియా టుడే’ మార్కెటింగ్ విభాగానికి చెందిన శ్రీనివాసబాబు తదితరులను చంద్రబాబు, బాలకృష్ణ అభినందించారు. ఈ సంచిక కోసం ప్రత్యేకంగా బాలకృష్ణ పెయింటింగ్ వేసిన ప్రముఖ చిత్రకారుడు ఈశ్వర్‌ను చంద్రబాబు, బాలకృష్ణ సన్మానించారు.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top