రోజాపై మళ్లీ అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

రోజాపై మళ్లీ అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవాలి

Published Sat, Mar 19 2016 3:00 AM

రోజాపై మళ్లీ అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవాలి - Sakshi

ఈ అంశంపై సోమవారం చర్చ.. స్పీకర్ కోడెల ప్రకటన

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో మళ్లీ అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. శాసనసభలో ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై శాసనసభలో సోమవారం చర్చ జరుగుతుందని తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదాపడిన సభ తిరిగి మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రారంభమైనప్పుడు.. రోజా సస్పెన్షన్, కోర్టు ఉత్తర్వులపై స్పీకర్ ప్రకటన చేశారు. ‘గత సమావేశాల్లో (డిసెంబర్‌లో) జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కొందరి అనుచిత ప్రవర్తన, హావభావాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సభలో చర్చించిన అనంతరం గౌరవ సభ్యురాలిని సస్పెండ్ చేయడం జరిగింది. దానిపై నిన్న (గురువారం) ఆమె కోర్టు నుంచి ఆర్డరు తీసుకువచ్చారు. అది నా దగ్గర ఉంది. ప్రతిపక్ష సభ్యులు సహా గౌరవ సభ్యులందరికీ ఆ ప్రతిని అందజేస్తాం. దీనిపై సోమవారం చర్చిద్దాం, సభే ఈ దీనిపై తిరిగి నిర్ణయం తీసుకోవాలి’ అని స్పీకర్ పేర్కొన్నారు. సభలో ఉన్న అధికార పక్ష సభ్యులకు కోర్టు తీర్పు ప్రతులను ఇచ్చారు.

 స్పీకర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం: యనమల
 బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ‘మేమందరం తీర్పు ప్రతిని చదివి సంసిద్ధమై వస్తాం. మాకు ఎవరిపై కోపం లేదు. ఎవరి ఆర్డరును కించపరచాలని లేదు. హౌస్ తీసుకున్న నిర్ణయం గనుక తిరిగి హౌసే నిర్ణయించాల్సి ఉంది’ అని అన్నారు.

Advertisement
Advertisement