అమ్మా.. నే చదువుకుంటా!

అమ్మా.. నే చదువుకుంటా! - Sakshi


భిక్షాటన చేయనన్న బాలిక

చిత్రహింసలు పెట్టిన మారు తల్లి

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
అమ్మా... అందరి పిల్లల్లా నేనూ చదువుకుంటా.. ఆనక ఉద్యోగం చేసి నిన్నూ సాకుతా.. అన్నీ బానేవుండీ అడుక్కోవాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నా.. రోడ్డున పోయేవారు ఇదేం బతుకని ముఖంమీదే తిడుతుంటే... సిగ్నళ్ల దగ్గర పోకిరోళ్లు అదోలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా.. నేనీ బిచ్చమెత్తలేను.. నన్నొదిలెయ్‌... తల్లి గాని తల్లి వద్ద పదిహేనేళ్ల బాలిక ఆక్రందన ఇది.     సాక్షి, హైదరాబాద్‌:   ఆ తల్లి మనసు కరగలేదు. మాట విననందుకు... తన ఆదేశాలు ధిక్కరించినందుకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టిందా మారు తల్లి. కర్రతో గొడ్డును బాదినట్టు బాది... చేతిపై వాతలు పెట్టి... ప్రత్యక్ష నరకం చూపింది. ఈ బాధలు తట్టుకోలేక బాలిక సోమవారం పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగలక్ష్మి (15) మూడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులిద్దరూ చిన్నప్పుడే చనిపోవడంతో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను పెంచుకుం టానంటూ ఏడేళ్ల క్రితం బాలికను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో భిక్షాటనకు పెట్టింది. రోజూ రూ.250 తీసుకురాకపోతే వాతలు పెట్టేది. అర్ధరాత్రి అయినా.. వానొచ్చినా.. టార్గెట్‌ పూర్తి చేయనిదే ఇంటికి రావడానికి వీల్లేదని హెచ్చరించింది.జ్వరం వచ్చినా... ఆరోగ్యం బాగా లేకున్నా.. ఆ దీన స్థితి చూసి మరిన్ని డబ్బులు జోలెలో పడతాయంటూ చౌరస్తాలో కూర్చోబెట్టేది. అయితే వయసు పెరుగుతుండటంతో నాగలక్ష్మికి భిక్షాటన నామోషీగా అనిపించింది. రోజూ చౌరస్తాలో తాను పడుతున్న బాధలు, ఇబ్బందులను తల్లికి చెప్పింది. ఇకపై ఆ పని చేయలేనని, చదువుకుంటానని వేడుకుంది. ఇంట్లో కూర్చున్నందుకు తల్లి రోజూ ఒంటిపై వాతలు పెట్టి, చితకబాది హింసించడం మొదలుపెట్టింది. ఇవి భరించలేక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానా ఇంటికి పోనని, ఏదైనా ఆశ్రమంలో చేర్పించి, ఈ పాడు జీవితం నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను ప్రాథేయపడింది.పునరావాస కేంద్రానికి తరలింపు:

స్పందించిన పోలీసులు మారు తల్లిని స్టేషన్‌కు రప్పించారు. నాగలక్ష్మి తన బిడ్డేనని ఆమె వాదించింది. అందుకు ఆధారాలు చూపాలని పోలీసులు కోరగా... నీళ్లు నమిలింది. తనలాగే మరికొందరిని జూబ్లీహిల్స్, కేబీఆర్‌ పార్కు చౌరస్తాల్లో నియమించిందని, సాయంత్రం కాగానే డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుందని నాగలక్ష్మి పోలీసులకు తెలిపింది. నాగలక్ష్మిని పోలీసులు నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top