
బీజేపీలో చేరడానికి చాలా మంది రెడీ
బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు.
సెప్టెంబర్‌లో రాష్ట్రానికి అమిత్‌షా: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. పార్టీ కార్యాల యాన్ని ఆధునీకరించిన సందర్భంగా కార్యాలయంలో గురువారం పూజలు, హోమాలు నిర్వహించారు. కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రాజేశ్ గోహైన్‌తో కలసి పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఏయే పార్టీలకు చెందినవారు, ఎప్పుడు చేరుతారనేది సందర్భాన్ని బట్టి వెల్లడిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని, ప్రజలకు మేలుచేయాలనే యోచన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని, రైతుల పంటలకోసం బీమా యోజన పథకాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేవలం రాజకీయపరమైన విమర్శలకు దిగుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. సెప్టెంబర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారని, మూడు రోజులపాటు రాష్ట్రంలోనే ఉంటారని వెల్లడించారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నామని, దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారని లక్ష్మణ్ వివరించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రాజేశ్ గోహైన్ మాట్లాడుతూ 2020లోగా కేంద్ర రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెంట 162 కిలోమీటర్ల మేరకు సర్కులర్ రైల్వే లైన్ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.