ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు ఉద్యోగాలు లేవు | 80 per cent of the jobs should be given to the local : kodandaram | Sakshi
Sakshi News home page

ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు ఉద్యోగాలు లేవు

Jul 5 2016 5:07 AM | Updated on Jul 29 2019 2:51 PM

ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు ఉద్యోగాలు లేవు - Sakshi

ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు ఉద్యోగాలు లేవు

తెలంగాణకు ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.

80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి: కోదండరాం
 
 సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎన్ని కంపెనీలొచ్చినా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కనపెట్టి, తెలంగాణ వ్యతిరేకులను ఇక్కడకి తెస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే జరుగుతోందన్నారు. ఇక్కడి పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ‘తెలంగాణలో విద్యాభివృద్ధి ప్రభుత్వ బాధ్యత’ అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. తెలంగాణలో పుట్టుపూర్వోత్తరాలు కనుక్కొనిమరీ ఆంధ్రావారికే ఉద్యోగాలిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆధారపడే ఉపాధి అవకాశాలుంటాయని, తెలంగాణ వికాసానికి సాంకేతిక విద్య ఆయుధం లాంటిదని అన్నారు. పాలిటెక్నిక్‌ను ప్రైవేటీకరించేందుకు అంగీకరించవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావంలో పాలిటెక్నిక్ విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమంలో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థి గిరిబాబు ప్రాణ త్యాగాన్ని గుర్తు చే సుకున్నారు.

 దేశ భవితకు వృత్తి విద్య కీలకం...
 హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తులో వృత్తి విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు వృత్తి నైపుణ్యం ఉపయోగపడుతుందన్నారు. కళాశాలల్లో లేబొరెటరీస్‌లో ఎక్కడా సరైన వసతులు లేవని, గత రెండేళ్లలో కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు జరిగిన దాఖలాలు లేవన్నారు. సాంకేతిక విద్యా వ్యయం మొత్తాన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కావూరి సాంబశివరావు బ్యాంకులను ముంచిన డబ్బు 1,000 కోట్ల రూపాయలని, అంత డబ్బు వెచ్చిస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ... ఐటీఐలతో పాలిటెక్నిక్‌ని అనుసంధానం చేయడంవల్ల పాలిటెక్నిక్ విద్యా ప్రమాణాలు ప్రమాదంలో పడతాయన్నారు. అనంతరం మురళీధర్ గుప్తా అధ్యక్షతన జరిగిన సదస్సులో పదోన్నతి పొందిన అధ్యాపకులు వై.నర్సయ్యగౌడ్, వెంకటేశ్వర్లు, సీవీవీ ప్రసాద్‌ను జస్టిస్ చంద్రకుమార్ సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement