వీసీ అతిథిగృహంపై 100 మంది దాడి చేశారు | 100 people have been attack the host to VC | Sakshi
Sakshi News home page

వీసీ అతిథిగృహంపై 100 మంది దాడి చేశారు

Mar 27 2016 3:59 AM | Updated on Oct 20 2018 5:03 PM

వీసీ అతిథిగృహంపై 100 మంది దాడి చేశారు - Sakshi

వీసీ అతిథిగృహంపై 100 మంది దాడి చేశారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేశారు.

హెచ్‌సీయూలో విద్యార్థుల అరెస్టుపై సభలో హోంమంత్రి నాయిని ప్రకటన
♦ ప్రాణభయంతో అప్పారావు ఓ గదిలో దాక్కున్నారు
♦ అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు
♦ మహిళా ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ‘‘రెండు నెలల తర్వాత హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఈ నెల 22న ఉదయం 8 గంటలకు విధుల్లో చేరారు. 10 గంటలకు వీసీ లాడ్జ్‌లో అధికారులతో సమావేశంలో ఉండగా దాదాపు వంద మంది విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లు దూకి లోపలకు దూసుకెళ్లారు. తలుపులు, కిటికీలు, పూలకుండీలు, కంప్యూటర్, టీవీలను ధ్వంసం చేశారు. దీంతో అప్పారావు ప్రాణభయంతో ఓ గదిలో దాక్కున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకొని విద్యార్థులను బయటకు పంపేందుకు యత్నించగా వారు నిరాకరించారు. ఆరు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా మరోసారి భవనంలోకి చొచ్చుకెళ్లాలని చూశారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌తోపాటు నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేసి 25 మంది విద్యార్థులు, ఇద్దరు బోధన సిబ్బందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు’’ అని హోం మంత్రి నాయిని చెప్పారు.

 ఓయూలో చనిపోయింది కూలీయే...
 ఉస్మానియా యూనివర్సిటీ నీటి సంపులో బయటపడ్డ యువకుడి మృత దేహంపై రేగిన వివాదంపైనా హోంమంత్రి ప్రకటన చేశారు. ‘‘మాణికేశ్వరినగర్‌కు చెందిన బత్తుల నాగరాజు 23న తన తమ్ముడు శిలారి బాబు అదృశ్యమయ్యాడని, అతని మృతదేహం యూనివర్సిటీ లైబ్రరీ వెనక సంపులో ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. అతను స్థానికంగా కూలి పనిచేసుకునేవాడు. ఘటనాస్థలి నుంచి మృతుని బట్టలు, సెల్‌ఫోన్, చెప్పులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించే సమయంలో విద్యార్థులు అడ్డుకున్నారు.

మృతుడి వివరాలు చెప్పాలని డిమాండ్ చేయటంతో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు చూపారు. అయినా శాంతించకుండా అతను విద్యార్థేనని వాదించారు. ఉదయం 10:30 గంటలకు అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే సంపత్ ధర్నాకు దిగారు. అతను విద్యార్థి కాదు, కూలీ అని మైకు ద్వారా పోలీసులు వివరించినా శాంతించకుండా వారిపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో అదనపు డీసీపీ చంద్రశేఖర్‌తోపాటు 16 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసు వాహనం, ఎమ్మెల్యే సంపత్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్‌ల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యేను పోలీసులు రక్షించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.’’ అని నాయిని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement