టామ్‌కామ్ ద్వారానే దుబాయ్ ఉద్యోగాలు


 వెబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి నాయిని


 సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో పనిచేయడానికి వెళ్లాలనుకునే కార్మికులందరినీ ఇకపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ద్వారానే పంపిస్తామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నకిలీ వీసాలతో, తప్పుడు పద్ధతుల ద్వారా వెళ్లి అక్కడ ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సచివాలయంలో మంగళవారం టామ్‌కామ్ వెబ్ పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. ‘గల్ఫ్ దేశాలలో పనిచేయాలనుకొనేవారు టామ్‌కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే అర్హులు. రిజిస్టర్ చేసుకున్నవారికి గల్ఫ్ దేశాల్లో అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఈ ఏడాది వెయ్యి మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఏడాది 5 వేల మందిని పంపడమే లక్ష్యం’ అని నాయిని వెల్లడించారు.



దుబాయ్‌లో తెలంగాణకు చెందిన కార్మికులు అత్యధికంగా ఉన్నారని, వారు ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తారని కంపెనీల యాజమాన్యాలు మెచ్చుకొంటున్నాయన్నారు.  ఇక్కడి నుంచి ఎంత మందిని పంపించినా అక్కడ ఉద్యోగాలిస్తామని యాజ మాన్యాలు చెప్పాయన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ జీఎం భవానీ పాల్గొన్నారు.


Tags: 



 

Read also in:
Back to Top