భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు | bhatkal may have chance to escape from jail, says dg vk singh | Sakshi
Sakshi News home page

భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు

Jul 11 2015 4:55 AM | Updated on Sep 3 2017 5:15 AM

విలేకరులతో మాట్లాడుతున్న జైళ్లశాఖ డీజీ వీకే సింగ్

విలేకరులతో మాట్లాడుతున్న జైళ్లశాఖ డీజీ వీకే సింగ్

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన భత్కల్‌ను ప్రతీసారి కోర్టుకు తీసుకెళ్లడమంటే కాస్త ఇబ్బందికరమేనని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు.

- జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్
- ఆయనను కోర్టుకు తరలించడం ఇబ్బందికరమే
- రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు
 
సాక్షి, హైదరాబాద్:
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన భత్కల్‌ను ప్రతీసారి కోర్టుకు తీసుకెళ్లడమంటే కాస్త ఇబ్బందికరమేనని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే మార్గంలో వారు తప్పించుకోవడానికి అవకాశాలు లేకపోలేదన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో డీజీ వీకే సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘భత్కల్‌తో పాటు ఇతర ఉగ్రవాదులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ఉంచుతామని సూచించాం. అయితే ట్రయల్స్ ఉన్నందున కచ్చితంగా తీసుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. మాకు కాస్త ఇబ్బందికరమైనా కోర్టు ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో న్యాయస్థానాలదే అంతిమ నిర్ణయం’ అని అన్నారు.

తనకు ప్రాణహాని ఉందంటూ భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖ విషయాన్ని ప్రస్తావించగా... ‘ప్రాణహాని ఉందని భత్కల్ చెబితే మేం ఏం చేసేది. మా జైల్లో ఉన్నంత వరకు అతను భద్రంగా ఉంటారు. ఎలాంటి అపోహలకు తావులేదు’ అని అన్నారు. భత్కల్ జైల్ నుంచి పారిపోతారని తమకు కేంద్రం నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని స్పష్టం చేశారు. ైజైల్లో కల్పించిన ఫోన్ ద్వారా భత్కల్ తన భార్యతో మాట్లాడిన రికార్డులన్నీ పరిశీలించామని, ఎక్కడా కూడా పారిపోతానని చెప్పిన సందర్భం లేదన్నారు.

రేవంత్ రాజకీయ నాయకుడు
చర్లపల్లి జైల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ కొట్టిపారేశారు. ఆయన రాజకీయ నాయకుడని, ఆయనేం చెప్పారో తమకు తెలియదన్నారు. జైళ్లలో మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ అవినీతి రహితంగా మార్చుతున్నామన్నారు. తాము ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 60 కాల్స్ వచ్చాయని, వాటిలో 18 మాత్రమే తమశాఖకు చెందినవి కావడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు.

60 ఏళ్లుగా జైళ్ల విభాగానికి ప్రాధాన్యం లభించలేదని, ఏడాది కాలంగా అనేక మార్పులు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణ జైళ్ల శాఖను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటి వరకు జైళ్లలో నిరక్షరాస్యులుగా ఉన్న 20వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించినట్లు వెల్లడించారు. కొన్ని సంస్థల సహకారంతో పదో తరగతి పూర్తి చేసుకున్న వారికి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement