కొత్తకొత్తగా..

villages change over with smartphones digital transactions - Sakshi

వేగంగా మారుతున్న జీవనశైలి

డిజిటల్‌ ప్రక్రియతో ప్రజల మమేకం

షాపింగ్‌ మాల్స్‌తో విప్లవాత్మక ధోరణులు

నూతన ఆవిష్కరణలతో జిల్లావాసుల జీవనశైలి కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల వస్తుసేవలు అందుబాటులోకి రావడంతో వారి జీవన ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ వైపు
మళ్లుతున్నారు. షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు, మొబైల్‌ యాప్స్, డిజిటల్‌ లావాదేవీలు.. వంటివి పల్లెలు, పట్టణాలు అనే అంతరాలను చెరిపివేస్తున్నాయి.

గుంటూరు: చిలకలూరిపేట టౌన్‌ : మదిలో మెదిలే ఆలోచనలైనా, మార్కెట్‌లో లభించే వస్తువులైనా ఏవి కొత్తగా వచ్చినా పాత వాటిని పక్కకునెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లావాసులు టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా మారింది పరిస్థితి. పాతబడిన వస్తువులను ఓఎల్‌ఎక్స్‌కి.. పనికి రావనుకున్న ఆలోచనలను వాట్సాప్‌కి అమ్మి సొమ్ము చేసుకునే ట్రెండ్‌ ప్రారంభమైంది. ఉద్యోగం, ఉపాధిలో భాగంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రజల దైనందిన జీవితంలో అర్రులు చాస్తున్న అవసరాలను తీర్చే సరికొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. ఆన్‌లైన్, షాపింగ్‌ మాల్స్, ఈ–రిటైల్, ప్లాస్టిక్‌ మనీ, డోర్‌ డెలివరీ లాంటి డిజిటల్‌ వ్యవస్థలు అం దుబాటులోకి వచ్చాయి. సమయాన్ని, దూరాన్ని తగ్గించుకుని పనులను వేగంగా ఎలా చక్కబెట్టుకోవాలా? అన్న ఆలో చనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

అన్‌ సీజనల్‌ పండ్లు లభ్యం
దుస్తులు, విద్యుత్‌ ఉపకరణాలు, నిత్యావసర వస్తువులు, కంప్యూటర్‌ పరికరాలు, పండ్లు, కూరగాయలు, ఫాస్ట్‌ ఫుడ్, ఫ్యాషన్, ఫుట్‌వేర్, రెడీమేడ్‌ వస్తువులు, ఇమిటేషన్‌ జ్యూయలరీ.. ఇలా అన్ని వర్గాల అవసరాలను తీర్చే వస్తువులకు మాల్స్‌ కేంద్రబిందువుగా మారాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే లెక్కల ప్రకారం మాల్స్‌ వినియోగదారుల్లో 65 శాతం మంది గ్రామీణవాసులే ఉండటం గమనార్హం. అన్‌ సీజన్‌లో లభించని పండ్లు, కూరగాయలతో పాటు జామ, దానిమ్మ జ్యూస్, సబ్జా ఫ్లేవర్స్‌ ఇక్కడ లభ్యమౌతున్నాయి. జిల్లాలో 2017లో షాపింగ్‌ మాల్స్‌ ద్వారా సుమారు రూ.1,140 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఇందులో సుమారు రూ.298 కోట్ల బిజినెస్‌ ఈ–రిటైల్‌ ద్వారా జరిగింది.

హోమ్‌ మేడ్‌ ఫుడ్స్‌.. హోం డెలివరీ
మధ్య తరగతి కుటుంబీకుల అవసరాలను ఆసరాగా చేసుకుని హోం మేడ్‌ ఫుడ్స్‌ తయారీ సంస్థలు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలిశాయి. అరిసెలు, పూత రేకులు, కార, పచ్చళ్లు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలను చిటికెలో హోం డెలివరీ చేస్తున్నారు. ఇది జిల్లావాసులకు ఎంతో సౌలభ్యంగా మారింది.

సోషల్‌ మీడియాతో చైతన్యం..
సమాచార విప్లవం సోషల్‌ మీడియాతో వెల్లివిరుస్తోంది. టెలిగ్రామ్‌ పోయి టెలిగ్రామ్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. పోస్టల్‌ లెటర్స్‌ స్థానంలో ఈ–మెయిల్స్‌ వచ్చాయి. ఎస్టీడీ బూత్‌లను మొబైల్స్, వీడియో కాల్స్‌ భర్తీ చేస్తున్నాయి. పోర్టబుల్‌ టీవీల స్థానంలో యూట్యూబ్, ఆన్‌లైన్‌ టీవీలు తెరపైకి వచ్చాయి. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో అత్యధికులు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 9.16 లక్షల మందికి ఫేస్‌ బుక్‌ ఖాతాలుండగా, వాట్సాప్‌ వినియోగదారులు 7 లక్షలకు పైనే ఉన్నారు. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది. వీటితో పాటు ఈ ఏడాది నుంచి జిల్లా వాసులు ఇన్‌స్ట్రాగామ్, రెడిట్, లింక్డ్‌లైన్, స్కైప్, టంబ్లర్, ఫ్లిక్కర్, గూగుల్‌ ప్లస్, హైక్‌ తదితర మాధ్యమాలను అధికంగా ఫాలో అవుతున్నారు.

డిజిటలైజేషన్‌...
జిల్లాలో డిజిటలైజేషన్‌ ప్రక్రియకు 46శాతం మంది ప్రజలు అనుసంధానమయ్యారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పాఠశాలలో డిజిటల్‌ బోధనలకు పెద్దపీట వేస్తున్నారు. రైల్వే, బస్, ఫ్లైట్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. రైతులు ఈ–క్రాప్‌ బుకింగ్, యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. కూలీలతో అవసరం లేని పంట నూర్పిడి యంత్రాలపైనే రైతులు ప్రధానంగా ఆధారపడుతున్నారు.

పెరిగిన ఎల్‌ఈడీ బల్బుల వాడకం..
విద్యుత్‌ పొదుపు కోసం ఈ ఏడాది ఎల్‌ఈడీ బల్బుల వాడకం బాగా పెరిగింది. జిల్లావాసులు ఈ యేడాది రికార్డు స్థాయిలో 33.13 లక్షల ఎల్‌ఈడీ బల్బులు కొనుగోలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద దైనందిన జీవితంలో ఏయేటికాయేడు జిల్లావాసులు మార్పుకి పెద్దపీట వేసి ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ముందంజలో ఉన్నారు. 

షాపింగ్‌ మాల్స్‌..
రిటైల్‌ రంగంలో షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు విప్లవాత్మక ధోరణులు తెచ్చాయి. గతంలో పచారీ వస్తువులు కొనుగోలు చేయాలంటే నాలుగు దుకాణాలకు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు వచ్చేశాయి. దీంతో సమయం, శారీరక శ్రమ తప్పుతోంది. జిల్లాలో 62 భారీ, మధ్య తరహా మాల్స్, సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. నిత్యం సుమారు 40 వేల మంది వీటి ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు అంచనా.

వ్యాలెట్‌లు... యాప్‌లు
నగదు రహిత లావాదేవీల కోసం జిల్లాలోని మొబైల్‌ యూజర్లు ఎం–వ్యాలెట్‌లను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఇందులో పేటీఎం అగ్రస్థానంలో ఉంది. వీటితో పాటు యూపీఐ, పీపీఐ, రూపే, ట్రూపే, ఎంపర్స్, జిప్‌క్యాష్, చిల్లర్, ఎక్స్‌పే.. వంటి ఆర్థిక సంస్థల ద్వారా లావాదేవీలను సరళతరం చేసేలా యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. గతంలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ల కోసం వినియోగదారులు కమీషన్‌ చెల్లించేవారు. ఇప్పడు రూ.లక్ష లోపు చెల్లింపులకు కమీషన్‌ విధించని సంస్థలు యాప్స్‌ను రూపొందించాయి. జిల్లాలో 42వేల మంది పేటీఎం ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుతుండగా, మరో 10వేల మంది ఇతర సంస్థల ద్వారా మనీ ట్రాన్సాక్షన్‌ జరుపుతున్నారు.

స్వైపింగ్‌ సంచలనం...
నోట్ల రద్దు పుణ్యమా అని స్వైపింగ్‌ యంత్రాలు విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చాయి. గతంలో క్రెడిట్‌ కార్డులకే పరిమితమైన స్వైపింగ్‌ విధానం.. 2017 నుంచి డెబిట్‌ కార్డులకు వర్తించడంతో జిల్లాలోని వర్తక, వ్యాపార సంస్థలు అత్యధికంగా స్వైపింగ్‌ మెషీన్లను కొనుగోలు చేశాయి. బయటికొచ్చేటప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పెట్రోల్‌ నుంచి నిత్యావసర సరుకు కొనుగోళ్ల వరకు అన్నీ క్యాస్‌లెస్‌.. కార్డ్‌ స్వైపింగ్‌తో పూర్తవుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత జిల్లాలో డిజిటల్‌ పేమెంట్లు 80శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది జిల్లాలో ఒక్క అక్టోబర్‌ నెలలోనే రూ.48,442 కోట్ల మేర డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. జిల్లాలో 36 లక్షల డెబిట్‌ కార్డుదారులు, 1.44 లక్షల క్రెడిట్‌ కార్డుదారులు ఉండగా, ఇందులో 65శాతం మంది స్పైపింగ్‌తో విక్రయాలు జరిపారు. డిజిటల్‌ పేమెంట్లలో భాగంగా క్యాష్‌ ఆన్‌ డెలివరీపై 52 శాతం, డెబిట్‌ కార్డుతో 17, క్రెడిట్‌ కార్డుతో 13, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ 8, ఎం–వ్యాలెట్‌తో 10 శాతం మంది లావాదేవీలు జరిపారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top