కులరహిత సమాజం దిశగా... | Sakshi
Sakshi News home page

కులరహిత సమాజం దిశగా...

Published Fri, Apr 13 2018 1:25 AM

Venugopal Reddy Write About Untouchability - Sakshi

అస్పృశ్యతపై సాగుతున్న పోరాటం ఫలించాలంటే కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితే కులాతీత సమాజానికి నాంది.

గుణకర్మలను అనుసరించి చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయన్న గీతావాక్యానికి ఎప్పుడు, ఎవరు సవరణ తెచ్చారో  తెలీకుండానే హిందూ సమాజంలో పంచముల పుట్టుక, అంట రానితనం  చోటు చేసుకున్నాయి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల్లో మార్పుల ఫలితంగా సమాజంలో పొడసూపిన కొన్ని రుగ్మతలు స్వల్పకాలంలో సర్దుకోవడాన్ని చూస్తుంటాం. అలా సమసిపోని రుగ్మతలు సాంఘిక దురాచారాలుగా బలం పుంజుకుని స్థిరపడతాయి. 

అంటరానితనం సైద్ధాంతిక దోషమని ప్రకటిం చిన ఆది శంకరులు కాశీ నగరంలో మానిషా పంచకం వెలువరించారు. వారి బోధను ఆచరించడం ఇష్టంలేని పెద్దలు ఆ చారిత్రక ఘట్టాన్ని తమకు సానుకూలంగా మార్చుకున్నారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి మానిషా పంచక శక్తి చాలలేదు కానీ, సామాజిక సమరసతకు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతం ఊతమిచ్చింది. ఆ తరువాత రామానుజుల నుంచి గాంధీజీ వంటి సంస్కర్తలెందరో అంటరానితనాన్ని రూపు మాపాలని ప్రయత్నించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిబా ఫూలే, డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వంటి పలువురు మహనీయులు పోరాడారు. 

సమాజ ప్రగతికి కుల వ్యవస్థ అవరోధంగా మారిందని వంద ఏళ్ల క్రితమే హిందూ సమాజం గ్రహించింది. ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి, శ్రద్ధానంద వంటి సంస్కర్తలు కులభేదాలను నిర్మూలించాలని ప్రయత్నించారు. ఆంధ్రప్రాంతంలో గోరా వంటి నాస్తికోద్యమకారులు కులనిర్మూలనకు కృషిచేశారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూనే వైద్య పట్టభద్రులు ఒకరు విభిన్నంగా ఆలోచించారు. ఇతరులతో పోల్చితే అన్ని అంశాల్లో సర్వ ప్రథమంగా నిలచిన జాతి కేవలం కుల భేదాలవల్ల విఘటితమై  బలహీనపడిందని, కొద్దిమంది విదేశీయుల చేతిలో పరాజిత అయి, బానిసగా మిగిలిం దని నిర్ధారించారాయన. అసలు రుగ్మతకు చికిత్స జరపడమే సరయిన పరిష్కారం అని భావించిన డా.కేశవరావు బలిరామ్‌ హెగ్డెవార్‌ కులాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలని సంకల్పిం చారు. హిందూ సమాజ ఐక్యతలో భాగంగానే అంట రానితనం అంతం కావాలని ఆయన ఆశించారు. అంటరానితనం నేరం కాకపోతే మరేదీ నేరం కాదని ఆరెస్సెస్‌ అధినేత బాలాసాహెబ్‌ దేవరస్‌ అన్నారు. 

రాజకీయ సమానత్వం ద్వారా దళితులకు సామాజిక సమానత్వం ప్రాప్తిస్తుందని అంబేడ్కర్‌ భావిం చారు. ఆ దృష్టితోనే ఆయన రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొందుపరిచారు. స్వతంత్ర భారత పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరుస్తారని, రిజర్వేషన్‌ సౌకర్యాలను ఉపయోగించుకుని ఆయా వర్గాల ప్రజలు పదేళ్ల కాల వ్యవధిలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభ్యున్నతి సాధిస్తారని ఆయన ఆశించారు. కానీ అధికార పీఠాలను అధిష్టించిన పెద్దల అల్పబుద్ధి కారణంగా రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలు గడచినా దళితవర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని 1980లలో గణాంకాలతో సహా ఏబీ వాజ్‌పేయి పార్లమెంటులో ఎలుగెత్తిన పిదప కొంత కదలిక మొదలైంది. 

అమానవీయ నేరాల నిరోధానికి 1955లో ఏర్పడిన చట్టం 1976లో పౌరుల హక్కుల రక్షణ చట్టంగా రూపాంతరం చెందింది. అయినా  ఫలితం కనిపించక ప్రజాందోళనల నేపథ్యంలో 1989లో దానికి సవరణలు తెచ్చారు. ఆపైన  అది ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంగా పేరొంది ప్రచారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు కాగితం పులిగా పేరుపడిన ఈ చట్టం ఖాకీలకు దయ, ధైర్యం కలిగినప్పుడు అడపాద డపా ఊపిరి పోసుకునేది.  

న్యాయస్థానాల ధోరణి కూడా భిన్నంగా లేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందనే ఆరోపణపై ఆదేశాలు జారీ చేసే ముందు ఆరుదశాబ్దాల తర్వాత కూడా దళితులు రిజర్వేషన్లు అడుక్కునే పరిస్థితి నుంచి బయట పడలేకపోవడానికి కారకులెవరని ఆలోచించి ఉండాల్సింది కాదా! దళిత ఆవేదనను ఆకళింపు చేసుకోగల హృదయాలు మన న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో లేకపోవడం దళిత పక్షానికి శాపమైందని బీజేపీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ బంగారు లక్ష్మణ్‌ వెల్లడించిన ఆవేదన అర్థం చేసుకోతగినదే. 

ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి స్వార్థపరుల ప్రతిక్రియకు విరుగుడు వ్యూహాన్ని స్వార్థం ఆసరాగానే అమలు చేయాలి. కులం పేరిట స్వప్రయోజనాలను పండించుకోడానికి విశాల హిందూ సమాజ ప్రయోజనాలను తుంగలో తొక్కే స్వార్థపరులను స్వార్థం ఆసరాగానే దారికి తేవాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఇది అంత సులువు కాదు. కానీ ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితి దాపురించి, రిజర్వేషన్‌ సౌకర్యం పొందడానికి కులాంతర వివాహం చేసుకోవాలని ప్రయత్నించడం కష్టమై కులాలకు అతీ తంగా సమాజం పురోగమించగలదు.

వ్యాసకర్త అధ్యక్షులు, ఏకలవ్య ఫౌండేషన్‌
పి. వేణుగోపాల్‌ రెడ్డి
మొబైల్‌ : 77022 52011

Advertisement

తప్పక చదవండి

Advertisement