ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం  | Sakshi
Sakshi News home page

ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం 

Published Sun, Feb 18 2024 5:24 AM

CM YS Jagan Mohan Reddy extends financial help: andhra pradesh - Sakshi

గుంటూరు వెస్ట్‌: ఆపన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో వారిలో ఆరుగురికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్‌ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోపే చెక్కులను అందజేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరమొచ్చినా తక్షణ సాయం లభిస్తుందన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు తమ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.

వీరికి మొత్తం రూ.9.90 లక్షలు మంజూరు చేస్తూ సీఎంవో కార్యాలయం చెక్కులు పంపింది. ఈ చెక్కులను కూడా  ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కలెక్టర్, జేసీలు అందజేశారు. మట్టుకొయ్య కోటేశ్వరరావుకు రూ.60 వేలు, నిలకుదిటి రఘుపతమ్మకు రూ.40 వేలు, మర్రి వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలు, ఇట్ల కుసుమసాయికి రూ.1.60 లక్షలు, అజీ్మర్‌ దివ్యకు రూ.4.30 లక్షల చొప్పున మొత్తం రూ.9.90 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement