ధర్మమూ... ధర్మ సూక్ష్మమూ

Vardelli Murali Article On Chandrababu Naidu - Sakshi

జనతంత్రం

శ్రీరామచంద్రుని యాగాశ్వాన్ని కుశలవులు బంధిస్తారు. అశ్వ రక్షకునిగా వచ్చిన శత్రుఘ్నుడిని తరిమేస్తారు. అప్పుడు రంగ ప్రవేశం చేసిన లక్ష్మణుడికీ, కుశలవులకూ మధ్య ఏది ధర్మం, ఏది న్యాయం అనే విషయాలపై పద్య సంవాదం జరుగుతుంది. తర్కంలో వారిని ఎదుర్కోలేని లక్ష్మణుడు ‘బాలురకు ధర్మ సూక్ష్మమేపాటికి తెలియూ...’ అంటూ దబాయిస్తాడు. అదిగో, అప్పటి నుంచీ మూడు యుగాలు మారినా ఈ ధర్మసూక్ష్మమనే బ్రహ్మపదార్థం సామాన్యుడికి నేటికీ సరిగ్గా అర్థం కాలేదు. సామాన్యులకే కాదు ద్వాపరయుగంలో ద్రౌపదిలాంటి విదుషీ మణి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. కురు రాజసభలో శకు నికీ, ధర్మరాజుకూ మధ్య జూదం జరుగుతుంది. ద్రౌపది అంతః పురంలో వుంటుంది. కొద్దిసేపటి తర్వాత ప్రాతికామి అనే సూత పుత్రుడు ద్రౌపది వద్దకు వచ్చి ‘మిమ్మల్ని ధర్మరాజులవారు జూదంలో పణంగా పెట్టి ఓడిపోయారు. గెలిచిన దుర్యోధన సార్వభౌములు సభకు తీసుకొని రమ్మంటున్నారు’ అని చెబు తాడు. ఆ స్థితిలో సభలోకి ప్రవేశించడం అవమానంగా భావిం చిన ద్రౌపది ఆ ప్రాతికామితో ‘ఓయీ నా సందేశాన్ని సభలో ధర్మమూర్తులకు వినిపించు. నా స్వామి నన్నోడి తానోడెనా? లేక తానోడి నన్నోడెనా? ఒకవేళ తానే ముందుగా ఓడిపోయి, తర్వాత నన్ను పణంగా పెడితే ఆ పందెం చెల్లదు. కనుక నేను ధర్మ విజితనో అధర్మ విజితనో కనుక్కొని రా’ అంటుంది. కొద్దిసేపటి తర్వాత ప్రాతికామి మళ్లీ ద్రౌపది వద్దకు వస్తాడు. ‘అమ్మా తమరి పిటిషన్‌ను ధర్మమూర్తుల ముందుంచాను. తమరు స్వయానా తమ్ముని కోడలు కనుక ధృతరాష్ట్ర, విదురులు ‘నాట్‌ బిఫోర్‌’ అన్నారు. భీష్మ పితామహులకు మనుమరాలవు తారు కనుక ఆయనా అదే మాట అన్నారు. ద్రోణ కృపా చార్యులకు మీరు శిష్యుల భార్య అవుతారు కనుక వారూ ‘నాట్‌ బిఫోర్‌’ అన్నారు. అశ్వత్థామ, వికర్ణుడు, యుయుత్సుడూ ఏదో మాట్లాడబోయారు కానీ, దుర్యోధనుల ఆగ్రహం చూసి మిన్న కుండిపోయారు. మీరు వెంటనే రాకపోతే దుశ్శాసనుడు వస్తా డ’ని చెబుతాడు. తర్వాత కథ తెలిసిందే. ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం కలిగిన ద్రౌపదికి కూడా కొన్ని సందర్భాల్లో ధర్మపీఠం మౌనం వహిస్తుందనీ అందులో ఏదో కిటుకు వుందనే ధర్మ సూక్ష్మం మాత్రం బోధపడలేదు. 

కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు పాత్రనుబోలిన జీవితంలోని వేలు లక్షల మంది లిటిగెంట్లూ, సీనియర్‌ రాజ కీయవేత్త చంద్రబాబును పోలిన కొంతమంది పొలిటీషియన్లు కూడా న్యాయశాస్త్రంలోని కొన్ని ‘ధర్మసూక్ష్మాల’ను బాగానే వంటబట్టించుకున్నారు. గతంలో న్యాయమూర్తులకూ, న్యాయ వాదులకూ, కోర్టు ఉద్యోగులకు మాత్రమే తెలిసిన ‘నాట్‌ బిఫోర్‌’ అనే సంప్రదాయం ఈ తరహా ‘ధర్మసూక్ష్మగ్రాహుల’ కారణంగా ఇప్పుడు అందరికీ తెలిసింది. నిజానికి అదొక సత్సం ప్రదాయం. న్యాయ వ్యవహారాల్లో ఆశ్రిత పక్షపాతం వుండకూడ దన్న సంకల్పంతో న్యాయవ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఒక కట్టడి. అటువంటి దానినికూడా ఈ ‘సూక్ష్మగ్రాహులు’ స్వప్ర యోజనాల కోసం వాడుకోవడం, ప్రయోజనం పొందడం దారుణం. లిటిగెంట్‌ ‘సూక్ష్మగ్రాహు’ల కారణంగా కొన్ని పాపు లర్‌ కేసుల్లో జనం ఊహలకు విరుద్ధంగా కోర్టు తీర్పులు వెలు వడటం మనకు తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించారనే సత్యం జగద్విదితం. కళాకారుడు కనుక తన పార్టీ పతాకాన్ని తానే స్వయంగా డిజైన్‌ చేసుకు న్నాడు. ఆయన చిత్రకారుడు కూడా. విలేకరుల ముందు తెల్ల కాగితంపై స్వయంగా జెండాపై ఉండే బొమ్మలను (గుడిసె, నాగలి, చక్రం) గీసి వాటి అర్థాన్ని విడమరిచి చెప్పాడు. అటు వంటి పార్టీని, జెండాను ఎన్టీరామారావు దగ్గర్నుంచి చంద్ర బాబు లాగేసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేలను నిర్బంధించారు. వాళ్లను కలవనీయలేదు. కనీసం అసెంబ్లీలో ఒకసారి మాట్లాడు తానని బతిమాలుకున్నారు. ఒప్పుకోలేదు. చివరికి ఎన్టీఆర్‌ కన్న బిడ్డల్లాంటి పార్టీ పేరునూ, పతాకాన్నీ న్యాయస్థానంలో తన బిడ్డలుగా చంద్రబాబు జయప్రదంగా నిరూపించుకోగలిగారు.

ఎన్టీరామారావుకు ధర్మము తెలుసును కానీ, ‘సూక్ష్మము’ తెలి యదు. చంద్రబాబు నైజం ఇందుకు పూర్తి విరుద్ధం. ప్రత్యర్థుల మీద ఎటువంటి ఆధారాలు జతపరచకుండా కేవలం తెల్ల కాగితం మీద పిటిషన్‌ రాసి కోర్టులో వేస్తే సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చిన యదార్థాన్ని మనం చూశాము. అదే చంద్ర బాబుపై ఆయన ప్రత్యర్థులు అనేక ఆధారాలను జతచేసి పిటి షన్‌ వేస్తే సీబీఐ వద్ద తగినంత సిబ్బంది లేని కారణంగా సదరు పిటిషన్‌ తిరస్కరణకు గురవుతుంది. దాదాపు 20 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకొని దశాబ్దాలపాటు కాలం వెళ్లబుచ్చిన ఘనచరిత్ర ఆయనకు వుంది. డాక్టర్‌ సుధాకర్‌ అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో చంద్రబాబు పార్టీకి చెందిన అనిత అనే మాజీ ఎమ్మెల్యే ఒక ఎడిట్‌ చేసిన వీడియోను జతపరచి వేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించి సీబీఐ విచారణకు ఆదేశిం చింది. న్యాయమూర్తులు తమ ఎదుటవున్న సాక్ష్యాలు లేదా కేసు మెటీరియల్, వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లే ఆధారంగా తమ తీర్పులను ప్రకటించి ఉండవచ్చు. కానీ, కొందరు వ్యక్తులు ప్రజాభిప్రాయాలకు భిన్నంగా కోర్టు వివాదాల్లో విజయం సాధి స్తున్న వైనం జనంలో అనేక అనుమానాలకు కారణమవుతు న్నది. శనివారం ఉదయం ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఒక కాలర్‌ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్‌ చేశాడు. ‘లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి సహాయ కార్యక్రమాలు చేపట్టారని ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల మీద కేసుపడింది. దీనిపై జడ్జిగారు మాట్లాడుతూ ఈ కేసు సీబీఐకి ఎందుకు ఇవ్వగూడదూ అని అడిగారు. ఆ తరువాత చంద్ర బాబు, లోకేశ్‌లపై సాక్ష్యాధారాలతో అదే కేసు పడింది. అప్పుడు ఈ కేసులన్నీ కలిపి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విచారణకు ఇచ్చారు. ఇదేంటండీ?’ అన్నారు. న్యాయస్థానం నిర్ణయం వెనుక సహేతు కమైన కారణమే ఉండి ఉండవచ్చుగాక. కానీ ఆ నిర్ణయాలు జనంలోకి ఎలా పోతున్నాయో గమనించుకోకపోతే ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలమీద విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో అధి కారంలోకి వచ్చిన ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా రంగంలోనూ, వైద్యరంగంలోనూ, రాజకీయ–పరిపాలనా రంగాల్లోనూ ఈ సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ ఇప్పటికే గ్రామ స్థాయికి చేరుకున్నది. దీని కొనసాగింపుగానే ఎన్నికల సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకంలో మార్పులు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. రిటైర్డ్‌ అధికారులను ఎన్నికల సంఘం బాధ్యులుగా నియమించడం వలన తమను నియమించిన రాజకీయ నాయకత్వం పట్ల వారు కృతజ్ఞులుగా ఉండే అవకాశం ఉన్నదనీ, రిటైర్డ్‌ న్యాయమూర్తులైతే రాజకీయ నాయకత్వం కింద పనిచేసి ఉండరు కనుక వారు స్వతంత్రంగా ఉండే వీలుందని రాష్ట్ర ప్రభుత్వం భావన. అయితే కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమ్మతించలేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనూ, ఆర్డి నెన్సును కొట్టివేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తానని తెలిపింది. ఇంతవరకూ పేచీలేదు. కానీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నత న్యాయస్థానం పునఃప్రతిష్టించమని చెప్పిన వ్యక్తి రాష్ట్రప్రభుత్వంపైనా, సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖను కూడా చంద్రబాబే రాయించారని వైసీపీ వాదన. కానీ స్వయంగా నేనే రాశానని ఆయనే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతపై ఇంత వ్యతిరేకతను కడుపులో పెట్టుకున్న వ్యక్తి ఎన్నికల అధికారిగా నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరిస్తారన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఒక రాజకీయ పార్టీ ప్రజల ముందు ఒక మేనిఫెస్టోను ఉంచి ఓట్లడిగి అధికారంలోకి వస్తుంది. ఆ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను అమలు చేయవలసిన బాధ్యత ఆ పార్టీకి ఉంటుంది. అంతేకాక రాష్ట్ర అభివృద్ధికీ, ప్రజాసంక్షేమానికి సంబంధించీ ఆ పార్టీకి తనదైన ఒక బ్లూప్రింట్‌ ఉంటుంది. దానిప్రకారం అమలు చేసే కార్యక్రమాలకు అడ్డు తగిలే విధంగా ప్రత్యర్థులు వేసే పిటి షన్లను అనుమతిస్తూ పోతే ఇక పరిపాలన ఎలా సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన. 

ఎన్టీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వర సగా కొన్ని కోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ విషయంపై ఆయన ‘న్యాయపరిషత్‌’ కార్యక్ర మంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే తీర్పులు ఒక్క ఎన్టీఆర్‌కు వ్యతిరేకం కాదు. మొత్తం 6 కోట్లమంది పైనా (అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర జనాభా) వ్యతిరేక తీర్పులని కామెంట్‌ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల్లో నూటికి 98 మంది కోరు కుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఇంగ్లిష్‌ మీడియం అమలు జీవోను హైకోర్టు కొట్టి వేసింది. సొంత ఇల్లు అనేది ఆత్మగౌరవ చిహ్నంగా భావించి అర్హులైన పేదలందరినీ గుర్తించి ఇళ్లపట్టాలు అందజేయాలని జారీ చేసిన జీవో అమలుపై తెలుగుదేశం మద్దతుదారులు పెద్దఎత్తున పిటిషన్లు వేశారు. ఆ జీవోను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. రాజధాని ప్రాంతంలో పేద వర్గాలకు ఇవ్వ తలపెట్టిన 1250 ఎకరాల తాలూకు జీవోను కూడా కొట్టివేసింది. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించే జీవోను కూడా కోర్టు కొట్టివేసింది. ఇదే పద్ధతి కొనసాగితే ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ఏ విధంగా పనిచేయగలదన్న ప్రశ్న తలెత్తుతున్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 32, 226ల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో న్యాయస్థానాలు ఏమేరకు జోక్యం చేసుకోవచ్చన్న అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. 

1. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగజేసి నప్పుడు.
2. రాజ్యాంగ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా, తన పరిధిని దాటి చట్టాలను చేసినప్పుడు.
3. ప్రజల మీద, పర్యావరణం మీద తీవ్రమైన విధ్వంసకర ప్రభావాన్ని చూపగల ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హితవు పలికింది. సజ్జన్‌సింగ్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ కేసులో తీర్పునిస్తూ అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను కూడా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నదని నిర్ధారించింది. కేశవానంద భారతి కేసులో చట్టసభ రాజ్యాంగ సవరణ అధికారాన్ని సమర్థిస్తూనే రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని మాత్రం మార్చకూడదని చెప్పింది. ఆరావళి గోల్ఫ్‌ క్లబ్‌ వర్సెస్‌ చంద్రహాస్‌ (2008) కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ కొందరు న్యాయమూర్తులను తీవ్రంగా మందలించింది. ఒకవేళ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయకపోతే అందుకు ఆ ప్రభుత్వాన్ని శిక్షించే అధికారం ఓటర్లదే గానీ న్యాయస్థానాలది కాదని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది.

ధర్మసూక్ష్మము అనే మాటను త్రేతాయుగంలో లక్ష్మణు డైనా, ద్వాపరంలో దుర్యోధనుడైనా, కలియుగంలో మన ఫార్టీ ఇయర్స్‌ నాయకుడైనా, దాని సంకుచితార్థంలో ఉపయోగించి నప్పటికీ... ఆ మాటకు అర్థం చాలా విస్తృతమైనది. ధర్మశాస్త్రాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకున్నవాడికి ధర్మసూక్ష్మం బోధపడు తుందని నమ్మిక. వర్తమానంలో మన న్యాయ పరిభాషలో చెప్పు కోవాలంటే రాజ్యాంగం మౌలిక లక్ష్యాలను అర్థం చేసుకోవడమే ధర్మసూక్ష్మాన్ని బోధపరచుకోవడం. దేశ ప్రజలందరికీ సర్వతో ముఖీన మెరుగైన జీవితాన్ని అందజేయడమే రాజ్యాంగ మౌలిక లక్ష్యం. అందుకోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానాంగాలన్నీ తోడ్పాటునందీయడమే రాజ్యాంగ విహితం.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top