చర్చించమంటే రచ్చ చేస్తారేం!

trs govt vip palla rajeshwar reddy fires on oppositions - Sakshi

సందర్భం

60 ఏళ్లు పాలించిన ఈ ప్రతిపక్షాల పాలనలో జరగని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే జరుగుతుంటే వారికి ఊపిరి ఆడటం లేదు. ఏదో ఒక సమస్యపై గగ్గోలు పెట్టి పత్రికల్లో కనపడకపోతే ప్రజలలో వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందేమోననే తప్పుడు భావంతో ఉన్నారు. ప్రజల సంక్షేమమే ప్రతిపక్షాలకూ ప్రాధాన్యతాంశంగా మారాలి. స్వార్థ ప్రయోజనాలను విడనాడి తెలంగాణ అభివృద్ధికి కలసి నడవాల్సిన చారిత్రక సందర్భంలో ప్రతిపక్షాలున్నాయనే విషయాన్ని వారు మరువరాదు.

నేటి నుంచి ఎనిమిదవ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రభుత్వం గణాంకాలతో సహా సిద్ధంగా ఉంది. ఈ మూడున్నరేళ్లలో చేసిన కార్యక్రమాలే ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుతున్నాయి కూడా. కానీ ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళంతో లేని సమస్యలను సృష్టించాలని చూస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న రోజునే ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. అలాంటి పిలుపు ఎవరు, ఎందుకు, ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో కాంగ్రెస్‌ పడిపోవడం శోచనీయం. 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వైఖరిని అవలంబించటం ఆత్మహత్యాసదృశమేగానీ మరొకటి కాదు. ప్రతినిధులు లేని చిన్న చిన్న ప్రజా సంఘాలు తమ డిమాండ్లను వినిపించడానికి ఆఖరి నిమిషంలో ఇచ్చే పిలుపు, అసెంబ్లీ ముట్టడి. కానీ మీ వాణిని అసెంబ్లీ వేదిక మీద వినిపించండి అని స్వయంగా ప్రభుత్వపక్షమే కాంగ్రెస్‌ను కోరుతున్నది. ఏ అంశంపైన అయినా, ఎంత సేపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వమే చెబుతున్నది. అయినా కాంగ్రెస్‌ చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వడం స్వార్ధ రాజకీయ ఆరాటం తప్ప ప్రజల కోసం పోరాటం కాదు.

రైతుల దుస్థితికి కారణం ఎవరో తెలియదా?
అధికారంలో ఉండగా రైతుల నడ్డి విరిచిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఆ వర్గం పేరు చెప్పుకుంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇవాళ దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నది తెలం గాణ ప్రభుత్వమే. ఆ సంక్షేమ దృష్టిని చూసి దేశమే గర్విస్తున్నది. రాష్ట్రంలో ఎక్కువ మందికి ఆధారం వ్యవసాయమే. అందుకే ఆ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, రైతే కేంద్ర బిందువుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది. వ్యవసాయ, సహకార రంగాలకి బడ్జెట్‌లో కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలో, 2013–14 సంవత్సరంలో రూ. 4,040.59 కోట్లు. ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే 2017–18 సంవత్సరం నాటికి దీనిని రూ. 5,755.62 కోట్లకు పెంచిందీ ప్రభుత్వం. కోటి ఎకరాలకు నీటిని అందించాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నది.

 సాగునీటి ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తే తమ అస్తిత్వానికే ప్రమాదమున్నదనే భయంతో ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి కోసం తీసుకున్న కార్యాచరణ ఇప్పటికే ఫలితాలనివ్వడం ప్రారంభించాయి. పాలమూరు జిల్లాలో వలసలు వాపస్‌ అయ్యాయి. దశాబ్దాల నాటి ఆ సమస్యకు ఈ ప్రభుత్వం మూడేళ్లలోనే పరిష్కారం చూపగలిగింది. కేవలం తాగునీటికి పరిమితమైన సింగూరు, గణపురం ప్రాజెక్ట్‌ నీటిని, సాగుకు ఇవ్వటంతో అక్కడ సిరులు పండుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో చరిత్ర సృష్టించబోతున్నది. కానీ రైతులకు మేలు చేసే పనులకు సహకరించకుండా, అడ్డుకునే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్‌.

సొంత రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి ప్రాజెక్ట్‌లకు అడ్డు పడటం ఎక్కడైనా ఉందా? మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రతిపక్షం తీరు ఇదే మాదిరిగా ఉన్నదని ఎవరైనా అనగలరా? కర్ణాటక మాత్రమే కాదు, మరో రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా? ప్రాజెక్టులతో భూమిని కోల్పోయే వారికి పరిహారం పెంచాలని కోరుతూ కోర్టులకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు పార్టీలు, కొన్ని సంఘాలు పనిగట్టుకొని కేసులు వేయించడమే ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్నాయి. ఇట్లా వ్యవహరించి తెలంగాణకు ఎంత నష్టం కలిగిస్తున్నారో వారికి అర్థం కావడంలేదు. కోట్లాదిమంది సామాన్య జీవుల ప్రయోజనాలు ముఖ్యమా? లేకుంటే కొద్దిమంది రాజకీయ స్వార్థం ముఖ్యమా? అనే విషయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్‌ తేల్చుకోలేని స్థితిలో ఉంది. అలాంటి అసూయాపూరిత రాజకీయ ఉచ్చులో ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే కేసీఆర్‌ ముందు ఈ కుప్పిగంతులు సాగవు. తెరాస ప్రభుత్వం నిబద్ధతను కట్టడి చేయలేవు.
 
పంటల మద్దతు ధర విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పత్తి మద్దతు ధర విషయానికొస్తే ఇది పూర్తిగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిధిలోనిది. దేశంలో మొదటి పత్తి పంట చేతికి వచ్చేది తెలంగాణలోనే. అయితే ఈ వర్షాల వల్ల పత్తిలో తేమ శాతం ఎక్కువయింది. అదనపు ఒక శాతం తేమకు పది శాతం చొప్పున కనీస మద్దతు ధరలో కోత విధిస్తున్నారు. దీనితో రైతులు నష్టపోతున్నారు. దాదాపు 46 లక్షల మేర పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాల కారణంగా సుమారు లక్షన్నర ఎకరాల్లో పత్తి తడిసింది. తేమ శాతం 20 పైగానే ఉంది. దీనిని గుర్తించి మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు ‘బి’రకం పత్తి కింద మద్దతు ధర ఇవ్వమని సీసీఐని లేఖ ద్వారా కోరారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై అసూయా ద్వేషాలతో నిత్య నిరసనకారులుగా ప్రతిపక్ష నాయకులు పబ్బం గడుపుతున్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజానీకం కోసం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్రను పోషించడం ఎప్పుడు ఆరంభిస్తారో తెలియడం లేదు.

విద్యుత్‌ పరిస్థితి మెరుగుపడింది
రాష్ట్రంలో అత్యధిక సేద్యం బోర్ల ద్వారా జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తామని చెప్పి, అమలు చేసి చూపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విపక్షాలు దీనినే మానిఫెస్టోలో చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిన మాట వాస్తవం కాదా? వారి పవర్‌ కట్‌ల పాలనలో రైతులు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్‌ అమలవుతోంది. మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయడానికి విద్యుత్‌ శాఖ సమాయత్తం అవుతోంది. తెలం గాణ ప్రాంతంలోని మార్కెటింగ్‌ శాఖ ఉమ్మడి రాష్ట్రంలో నిధుల లేమితో కుదేలై పోయింది.

గత అరవై సంవత్సరాలలో వారు చేయలేని కొత్త గోదాముల నిర్మాణం రూ.1,024 కోట్ల ఖర్చుతో 21 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన 364 అదనపు గోదాముల నిర్మాణం జరుగుతోంది. దీనిని మూడు సంవత్సరాల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయటం ప్రభుత్వాల కనీస భాద్యత. దీనిని విస్మరించిన గత ప్రభుత్వాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశాయి. విత్తనాల కోసం రైతులు తమ చెప్పులు రోడ్డుపై లైన్లలో పెట్టడం చూశాం. రైతుల వీపులపై లాఠీ దెబ్బలు చూశాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అడ్వాన్సుగా ఎండాకాలంలోనే విత్తనాలు సిద్ధం చేసింది. నకిలీ విత్తనాలు అమ్మే ఏజెన్సీలపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి, నిర్వాహకులను జైలుకు పంపించింది. ఇలాంటి ఎన్నో రైతు పక్షపాత కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం, ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే మాట్లాడుకుందాం రమ్మని ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నది. అందుకు చట్టసభలను వేదికగా చేసుకుందామని, పార్లమెం టరీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే చర్చిద్దామని, అసెంబ్లీ సమావేశాలు పెడుతుంటే వారేమో రోడ్డుకెక్కి చలో అసెంబ్లీ అంటున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వటానికి వారి దగ్గరేమీ లేవు. వారి ఊహలకు కూడా అందని పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదీ రాష్ట్ర ప్రభుత్వం.

అదొక మహాయజ్ఞం
తిండి పెట్టే రైతాంగానిది ఇప్పటికీ అసంఘటిత రంగమే. రైతుకు సంబందించిన ఏ కార్యక్రమం చేద్దామన్నా గ్రామస్థాయిలో ఒక వ్యవస్థ లేదు. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామ స్థాయిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయ తలపెట్టారు. ఇంకో వైపు రాష్ట్రంలోని 568 మండలాలలోని 10,875 రెవిన్యూ గ్రామాల్లో భూ సర్వే జరుగుతున్నది. అధికారులు మొత్తం 1,468 బృందాలుగా ఏర్పడి మొత్తం 75.54 లక్షల ఖాతాల్లోని 1.78 కోట్ల సర్వే నంబర్ల ప్రక్షాళన చేస్తున్నారు. ఇదొక మహాయజ్ఞం. ఈ ప్రక్రియ తర్వాత రైతులకు మే నెల 2018 నుంచి వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరాకు రూ. 8,000 ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. రైతు సంఘంలోని ప్రతి సభ్యుని ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తామని ప్రకటించిందీ ప్రభుత్వం. ఇలాంటి ఆలోచన దేశంలోని ఏ ప్రభుత్వానికైనా వచ్చిందా? రైతుల ఆత్మహత్యలంటూ గగ్గోలు పెట్టె ఈ ప్రతిపక్షాలు అవి వారి పాపపు పాలన ఆనవాళ్లేనని గుర్తుంచుకోవాలి. దురదృష్టవశాత్తూ బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం లక్షన్నర నుంచి ఆరు లక్షల వరకు పెంచిందీ ప్రభుత్వం.

60 ఏళ్లు పాలించిన ఈ ప్రతిపక్షాల పాలనలో జరగని ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే జరుగుతుంటే వారికి ఊపిరి ఆడటం లేదు. ఏదో ఒక సమస్యపై గగ్గోలు పెట్టి పత్రికల్లో కనపడకపోతే ప్రజలలో వారి ఉనికి ప్రశ్నార్థకం అవుతుందేమో ననే తప్పుడు భావంతో ఉన్నారు. ప్రజల సంక్షేమమే ప్రతిపక్షాలకూ ప్రాధాన్యతాం శంగా మారాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను విడనాడి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వంతో కలసి నడవాల్సిన చారిత్రక సందర్భంలో ప్రతిపక్షాలున్నాయనే విషయాన్ని వారు మరువరాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలకు వేదిక చట్టసభలేనని వారికి తెలియనిది కాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకుంటూ మన వ్యవస్థలు పనిచేయాలి. అంతేకాని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజుననే చలో అసెంబ్లీ పిలుపునివ్వటం మనం ఏర్పరుచుకున్న చట్టసభలను అగౌరవ పరచడమే. చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉండీ, సమస్యల పరిష్కారానికి వేదికయిన అసెంబ్లీని విడిచి వీధి పోరాటాలకు పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ధర్ణాలు, రాస్తారో కోలు, చలో అసెంబ్లీలు నిర్వహించినంత మాత్రాన రైతు సంక్షేమం పట్ల కేసీఆర్‌ దృఢ సంకల్పం చెక్కు చెదరదు. మరింత బలోపేతమవుతుంది.


డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
వ్యాసకర్త ప్రభుత్వ విప్, శాసనమండలి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top