రెండు దేశాల భారత్‌.. ప్రమాద ఘంటికలు

Senior Journalist Karan Thapar Opinion On CSDS Survey - Sakshi

అభిప్రాయం

భారత్‌ చాలా అంశాల్లో రెండు దేశాలుగా వేరుపడిపోయిందా? దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాలు అనేక విషయాల్లో తీవ్ర వ్యత్యాసాలను కలిగి ఉన్నాయన్నది తెలిసిందే. కానీ దేశాభివృద్ధి, దేశ గమనం విషయంలో కూడా వీటి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలున్నట్లు బయటపడింది. ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం’ తాజా సర్వే ప్రకారం భారత్‌ రెండు దేశాలుగా విడిపోయిందనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో దక్షిణ భారత్‌కు చెందిన 45 శాతం మంది మన దేశం తప్పుదిశలో పయనిస్తోందని చెప్పడం గమనార్హం. మోదీ ప్రభుత్వం పట్ల దక్షిణాది అభిప్రాయాలను ఇది ప్రతిబింబిస్తోంది. హిందువుల్లో మెజారిటీ ప్రజలు మోదీని బలపరుస్తుండగా, మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారని సర్వే తెలిపింది. ఏడాదిలోపే మోదీని బలపరుస్తున్న భారత యువఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని సర్వే సూచించింది. దేశంలో ప్రాంతీయ, మతపర విభజనలు ఏర్పడినట్లు సర్వే సూచించిన విషయాన్ని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి.

అధికార పార్టీని తీవ్ర ఉద్వేగంతో బలపర్చేవారికి, ప్రతి పక్షాన్ని ప్రగాఢంగా నమ్మే వారికి మధ్యన దేశం దేశమే చీలిపోవడం అనేది ప్రజాస్వామ్యంలోనే సాధ్యమని భావిస్తుంటారు. అయితే, ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం’ (సీఎస్‌డీఎస్‌) ఇటీవల జరిపిన సర్వే సూచి స్తున్న మేరకు, భారతదేశంలో మరొక రెండు విభజనలు తీవ్రంగా కలవరం కలిగిస్తున్నాయి. గత అయిదేళ్లుగా ఈ విభజనలు మన దేశంపై కలిగిస్తున్న ప్రభావం గురించి ఇవి చాలా వివరంగా స్పష్టం చేస్తున్నాయి. 

మొదటగా సీఎస్‌డీఎస్‌ సర్వే గురించి కొన్ని వివరాలు చెబుతాను. ఈ సర్వే ఈ మార్చినెల చివరి వారంలో జరిగింది. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 101 నియోజకవర్గాల్లోని పదివేల మందిని ఈ సర్వేలో భాగం చేశారు. కాబట్టి దీన్ని దేశ పరిస్థితిపై సమగ్రమైన అంచనా అని చెప్పవచ్చు. రెండోది ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం’ నిష్కళంకమైన, నిరాక్షేపణీయమైన ప్రమాణాలకు చాలాకాలంగా మారుపేరుగా నిలుస్తున్న సంస్థ.

మన దేశం సరైన దిశలో సాగుతోందని నమ్ముతున్నారా లేక తప్పుదిశలో సాగుతోందని భావిస్తున్నారా? అనేది ఈ సర్వేలో అడిగిన ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటి. సర్వేలో పాల్గొన్నవారిలో దక్షిణభారత దేశానికి చెందిన 45 శాతం మంది మన దేశం తప్పుదిశలో పయనిస్తోందని చెప్పడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దక్షిణాదితో పోలిస్తే.. తూర్పు, పశ్చిమ/మధ్య భారత్,  ఉత్తర భారతదేశానికి చెందిన వారు కూడా వరుసగా 21, 23, 22 శాతం మంది ఇలాగే సమాధానమిచ్చారు. శాతాల వారీగా చూస్తే మిగతా దేశంతో పోలిస్తే దక్షిణ భారత ప్రజలు రెట్టింపు సంఖ్యలో దేశం తప్పు ధోరణిలో పయనిస్తోందని నమ్ముతున్నారు.

దక్షిణ భారత రాష్ట్రాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు మధ్య అభిప్రాయాల్లో కూడా తీవ్రమైన వ్యత్యాసం ఉందని ఈ సర్వే బట్టి నేను అనుకుంటున్నాను. నిస్సందేహంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల, దేశంపై దాని ప్రభావం పట్ల దక్షిణ భారతీయుల అభిప్రాయాలను ఈ వ్యత్యాసం ప్రతిబింబిస్తోంది. అలాగే వారి రాజకీయ ప్రాధాన్యతలను కూడా ఇది వ్యక్తపరుస్తోందనటంలో సందేహమే లేదు. కానీ నర్మదకు దక్షిణంగా, ఉత్తరదిశలో ఉన్న రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర వ్యత్యాసం ఉండడం ఆశ్చర్యకరం. మనం నిజంగానే రెండు దేశాలుగా మారిపోయామని ఇది సూచిస్తోంది. 

సీఎస్‌డీఎస్‌ సర్వేలో అడిగిన రెండో ప్రశ్న మరింత కలవర పెట్టే చిత్రాన్ని వ్యక్తపరుస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ దఫా ఎన్నికల్లో మరొక అవకాశం ఇవ్వాలా లేక తిరస్కరించాలా అని సర్వేలో భాగంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులను ప్రశ్నించారు. హిందువులలో 51 శాతం మంది నరేంద్ర మోదీకి రెండో అవకాశం ఇవ్వడానికి అనుకూలత వ్యక్తం చేశారు. కానీ ముస్లిం లలో 56 శాతం, క్రైస్తవులలో 62 శాతం, సిక్కుల్లో 68 శాతం మోదీకి, బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వడాన్ని తిరస్కరించారు.

ఈ వ్యత్యాసాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ సారి ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో మతపరమైన విభజనలను సృష్టించినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. అదేసమయంలో కనీస మెజారిటీలో అయినా సరే.. భారతీయ హిందువులు మోదీ మద్దతుదారులుగా ఉంటున్నారు. మరింత స్పష్టమైన విషయం ఏమిటంటే.. భారతీయ మైనారిటీ మతస్థులు మోదీ, బీజేపీ మద్దతుదారులు కారు. సర్వేలో బయటపడిన ఈ వాస్తవం కూడా భారత్‌ రెండు దేశాలుగా మారిపోయిందని మరోసారి సూచిస్తోంది.

సీఎస్‌డీఎస్‌ సర్వేలో మరొక అంశం కూడా నాలో ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇది సర్వే పేర్కొన్న ఇతర విషయాల్లాగా  పెద్దగా కలవరపర్చే అంశం కాదనుకోండి. అయినప్పటికీ ఈ అంశాన్ని తప్పక ప్రస్తావించాల్సిందే. 2018 మే నెల నుంచి 2019 మార్చి నెల చివరివరకు భారతీయ జనతాపార్టీకి గట్టి మద్దతు నిచ్చినవారిలో దేశంలోని 18 నుంచి 25 సంవత్సరాలలోపు వయసున్న యువ ఓటర్లే ఎక్కువ మంది కావటం గమనించదగిన విషయం. గత సంవత్సరం మే నెలలో సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వే ప్రకారం భారతీయ యువతలో 33 శాతం మంది ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలంగా బీజేపీకి ఓటేయనున్నట్లు తెలిసింది.

కానీ 2019 మార్చి చివరినాటికి బీజేపీకి మద్దతిచ్చే యువతీయువకుల సంఖ్య అమాంతంగా 40 శాతానికి పెరి గింది. ఇతర వయోబృందాల్లో  మోదీకి మద్దతు పలి కిన వారి సంఖ్యలోనూ కాస్త పెరుగుదల కన్పించింది కానీ యువ ఓటర్లలాగా ఇతరులు ఇంత అధిక స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు పలకలేదన్నది గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ యువ ఓటర్లు అత్యంత స్పష్టంగా మోదీ పట్ల బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ప్రత్యేకించి నరేంద్రమోదీని వారు మరింతగా ఇష్టపడుతున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

మరి ఈ యువత పెరిగి పెద్దదయ్యే క్రమంలో కూడా బీజేపీ పట్ల వారు చూపే అభిమానం అదేస్థాయిలో పెరుగుతూ వస్తుందా? ఈ సర్వే ఫలితాలను చూసిన తర్వాత బీజేపీ మద్దతు పునాది.. కాలం గడిచేకొద్దీ మరింత పెరుగుతూ పోతుందా? మనం ఇప్పటికే చర్చించినట్లుగా దేశంలో ప్రాంతీయ, మతపరమైన విభజనలు ఏర్పడిపోయాయనడం వాస్తవమా లేక అతిశయోక్తి మాత్రమేనా? ఇవన్నీ ఆసక్తి కలిగించే ప్రశ్నలే కానీ, వీటికి సమాధానాలను మనం  ప్రస్తుతానికి కేవలం అంచనా వేయగలమంతే. 

అయితే, వచ్చే ఆరువారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటున్నం దున, సీఎస్‌డీఎస్‌ సర్వే బయటపెట్టిన విషయాల పట్ల మనలో రేగుతున్న ఆందోళనలను నిశితంగా పరిశీలించగలిగినట్లయితే, మనదేశంలో ఏం జరుగుతోందనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో అవి మనకు తోడ్పడవచ్చు. అలాగే మన దేశం ఎలా మారుతోందో అర్థం చేసుకోవడంలో కూడా అవి మనకు తోడ్పడవచ్చు.


వ్యాసకర్త : కరణ్‌ థాపర్‌ సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top