ఓట్ల తక్కెడలో ట్రిపుల్‌ తలాక్‌

Mallepalli Laxmaiah Guest Columns On Triple Talaq Bill - Sakshi

కొత్త కోణం

మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావించి త్రిపుల్‌ తలాక్‌ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సమాధానంలేని ప్రశ్న. ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికే దాడులూ, హత్యలూ, చివరకు త్రిపుల్‌ తలాక్‌ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది.

తలాక్‌ తలాక్‌ తలాక్‌ ఒకే ఒక్క పదం. మూడు సార్లు ఉచ్చరిస్తే కడదాకా కలిసి నడుస్తానని మాట ఇచ్చిన సహచరిని నడిరోడ్డుమీదికి నెట్టేయొచ్చు. నలు గురు బిడ్డల తల్లినైనా నడిబజారులో నిలబెట్టొచ్చు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పటివరకూ తానే సర్వస్వం అని భావించిన ఓ స్త్రీ జీవితాన్ని నిలువునా కూల్చేసే మతపరమైన హక్కు ఇది.  జకియా సోమన్, సైరాబానూ, ఇష్రాత్‌ జహాన్, గుల్షన్‌ పర్వీన్, అఫ్రీన్‌ రెహమాన్, అతియా సాబ్రి ఈ ఐదుగురు మహిళలూ ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రతీక. ఇస్లాంని విశ్వసిస్తూనే ముస్లిం మహిళల హక్కులను గుర్తించాలంటూ, మతానికి లోబడి, రాజ్యాంగపరిధిలో ముస్లిం మహిళల హక్కులు కూడా మానవ హక్కుల్లో భాగమేనని ముస్లిం మహిళా ఆందోళన కారులు భావిస్తున్నారు.

భారతీయ ముస్లిం మహిళలు  స్త్రీపురుష అసమానతలను రూపుమాపేందుకు ట్రిపుల్‌ తలాక్‌  రద్దు కూడా మార్గమని భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ ని 2007, జనవరిలో ముంబాయి కేంద్రంగా స్థాపించారు. స్త్రీపురుష వ్యత్యాసాలుండకూడదని, మతంలోనూ స్త్రీపురుష సమానత్వాన్ని పాటించాలన్నది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ డిమాండ్‌. స్త్రీ స్వేచ్ఛ అంటే పురుష వ్యతిరేకత కాదు. స్త్రీపురుష సమానత్వం. అలాగే భారత రాజ్యాంగంపైనా మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని కూడా వారు ప్రకటించారు. నిజానికి ఖురాన్‌లో తొలిదశలో తలాక్‌ అనే భావనే లేదు. కాలక్రమంలో దాన్ని సృష్టించారు. అయితే దానికి కొన్ని నిబంధనలున్నాయి.

కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. అసలు ఖురాన్‌ లో స్త్రీలపై ఆధిపత్యానికి తావులేదు.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే పెద్దల సమక్షంలో చర్చించుకొని కలిసి ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పింది. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైతే మూడు పర్యాయాలుగా తలాక్‌ చెప్పా లని చెప్పింది. 90 రోజుల వ్యవధిలో మూడు సార్లు పెద్దల సమక్షంలోనే తలాక్‌ చెప్పాలి. అలాగే ఆ స్త్రీ ఋతుక్రమంలో ఉండగా,  గర్భవతిగా ఉన్నప్పుడు సైతం తలాక్‌ చెప్పకూడదు. కానీ ఆచరణలో అం దుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. స్త్రీలకు తెలియకుండా కూడా తలాక్‌ చెప్పేస్తున్నారు.  

హలాలా... 
తలాక్‌తో విడిపోయిన తరువాత ఆ స్త్రీకానీ, పురుషుడు కానీ మనసు మార్చుకొని ఆవేశంలో చెప్పిన తలాక్‌ని వెనక్కితీసుకునే అవకాశాన్ని  హలాలా నియంత్రిస్తోంది. భర్తతో విడిపోయిన తరువాత వాళ్ళిద్దరూ తిరిగికలుసుకోవాలంటే ఆ స్త్రీ మరో పురుషుడిని వివాహమాడిన తరువాతనే రీయూనియన్‌కి అవకాశం ఉంటుంది. అంతవరకు తలాక్‌ తీసుకున్న భార్యాభర్తలిద్దరూ ఇష్టపడినా తిరిగి కలిసి ఉండే అవకాశం లేదు. హలాలా ఖాజీలు కేవలం 15 రోజుల్లోనే వివాహం, తలాక్‌ రెండూ పూర్తి చేసి చిన్నారులను సైతం విదేశీయులకు కట్టబెడుతున్న దుర్మార్గాలు జరుగుతున్నాయన్నది వీరి ఆరోపణ. 

మెహర్‌.... 
ఖురాన్‌ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కు మెహర్‌. నిఖానామా(పెళ్ళి)సందర్భంగా స్త్రీలకి కొంత డబ్బో, వస్తువులో లేదా ఇళ్లో, వారి స్థాయిని బట్టి వరుడి తరఫున ఇస్తారు. దాన్ని రికార్డు కూడా చేయాలి. కానీ ఎక్కడా అది రికార్డు చేయడంలేదు. 786 రూపా యలు మాత్రమే స్త్రీల చేతిలో పెడుతున్నారు. దీంతో వీరికి నష్టం జరుగుతోంది. 

ఖులా... 
ముస్లిం స్త్రీలకి కూడా భర్త నుంచి విడిపోయే హక్కుంది దాని పేరే ఖులా. అయితే ముస్లిం స్త్రీలు విడిపోవాలనుకున్నప్పుడు కూడా భర్త అనుమతి కావాలంటున్నారు. కానీ ఖులా కోరుకున్న స్త్రీకి దానంతట అది దక్కే పరిస్థితి లేదు. అక్కడేమో స్త్రీల ప్రమేయం లేకుండానే తలాక్‌ చెప్పేస్తారు. ఇక్కడేమో భర్త అనుమతి లేనిదే ఖులా యివ్వరు.  ఇటువంటి ముస్లిం మహిళల ఉద్యమాలూ, ఆందోళనల నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ ఆచారాన్ని నిషేధించాలంటూ కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే చట్ట పరంగా ట్రిపుల్‌ తలాక్‌ని నిషేధించడం కోసం పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టి లోక్‌ సభలో ఆమోదింపజేసుకున్నది. అయితే బీజేపీ ట్రిపుల్‌ తలాక్‌పై అనుసరిస్తున్న వైఖరిపైనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ముస్లిం మహిళల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్న చర్యా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వేసిన ఎత్తుగడా? అనేది గమనించాల్సిన విషయం.  

మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావిస్తే ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది సమాధానంలేని ప్రశ్న. ఇప్పుడున్న లెక్కల ప్రకారం భారత దేశంలో ఇప్పటి వరకు  23 లక్షల మంది మహిళలను వారి భర్తలు ఎటువంటి చట్టపరమైన, న్యాయబద్దమైన విడాకులు లేకుండా వదిలి వెళ్లారు. ఇందులో ముస్లిం మహిళలు కేవలం రెండు లక్షలా 80 వేల మంది మాత్రమే.

క్రైస్తవులు 90 వేల మంది. కాగా మిగిలిన వాళ్ళంతా హిందూ మహిళలేనని ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈవిషయాన్ని ధృవపరుస్తూ తమిళనాడులో ధనుష్‌ కోటి ప్రాంతంలో మత్స్యకారుల మహిళల పరిస్థితిని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఎటువంటి సమా చారం లేకుండానే భర్తలు ఆ ప్రాంతంలోని మహిళలను సునాయాసంగా వదిలించుకుంటున్నారని ఈ సర్వే ఆధారాలతో సహా నిరూపించింది. అంతేకాకుం డా ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఉద్యోగాలు చేస్తోన్న భర్తలు తమ భార్యలను అవలీలగా భారతదేశంలో వదలిపెట్టి, విదేశాలకు పారిపోతున్నారని జాతీయ మహిళా కమిషన్‌కు 4000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఎన్‌ఆర్‌ఐ భర్తల చేతిలో మోసపోతోన్న మహిళలు తమకు న్యాయం చేయా లని కమిషన్‌ని కోరుతున్నారు.

అంతేకాకుండా గత కొన్ని వందల ఏళ్ళుగా హిందూ సాంప్రదాయం ప్రకారం జోగినీలుగా, దేవదాసీలుగా, మాతమ్మలుగా, దుర్భరమైన జీవితాలను గడుపుతోన్న లక్ష లాది మంది దళిత మహిళల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మనకు తెలియంది కాదు. అంతేకాకుండా హిందూ సమా జంలో మహిళలు ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణింపబడుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలూ, గృహహింస, పరువు హత్యలూ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ముస్లిం మతంలోని మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్న ప్రభుత్వాలు హిందూ మహిళల హక్కులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సి ఉంది.  

ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా ముస్లిం మహిళల మద్దతును, ఓట్లను బీజేపీ ఆశిస్తున్నదని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఇది పాక్షిక సత్యమే. ఓ పక్క బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, మరోపక్క ఈ ట్రిపుల్‌ తలాక్‌ చట్టం ద్వారా అదే ముస్లిం కుటుంబాల్లోని మహిళలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందని భావించడంలో పూర్తిగా నిజంలేదు. ఎందుకంటే ముస్లింల మీద గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న దాడులు, హింసా కాండ, అత్యాచారాలు ముస్లిం మహిళలను కూడా ఆలోచింపజేస్తాయి. తమ కన్నబిడ్డల పట్ల, కుటుంబా ల్లోని పురుషులపట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనుసరిస్తోన్న క్రూరమైన విధానాలు, దాడులు ఆ స్త్రీలకు మనశ్శాంతి లేని జీవితాలను ప్రసాదించాయి.

గుజరాత్‌లో జరిగిన మారణకాండను దీని నుంచి విడదీసి చూడలేం. మొత్తం భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలో గత నాలుగైదేండ్లుగా జరిగిన హత్యలను పరిశీలిస్తే 2013లో ముగ్గురు ముస్లింలు మతపరమైన దాడుల వల్ల చనిపోతే, 2018 కి వచ్చేసరికి అది 30 మందికి చేరింది. అంటే ఐదేళ్ళలో ఇది పదిరెట్లు పెరిగినట్టు లెక్క. ఇందులో గోసంరక్షణ నినాదం ఎంతోమంది ముస్లింలపై దాడులకు కారణమైంది. అందువల్ల ముస్లిం మహిళల ఓట్లు బీజేపీ లక్ష్యం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి.  

నిజానికి బీజేపీకి  అటువంటి ఉద్దేశం లేదు. ముస్లిం సమాజాన్ని భారతదేశంలోని హిందువుల ముందు దోషులుగా నిలబెట్టి, సహజంగా ముస్లింల పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకోవాలని మాత్రమే బీజేపీ భావిస్తోంది. అంతే తప్ప ముస్లింల పట్లగానీ, వారి స్త్రీలపట్లగానీ బీజేపీకి సాను కూలత ఉన్నదనుకోవడం పొరపాటు. ఉత్తరప్ర దేశ్‌లో 2017 ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన ముస్లిం వ్యతిరేకత హిందూ సెంటిమెంట్‌ సరిౖయెన ఫలితాలను ఇచ్చింది. భారతీయ జనతాపార్టీ ఆ రాష్ట్ర జనాభాలో 19 శాతానికి పైగా ఉన్న ముస్లిం లకు ఒక్క సీటుకూడా ఇవ్వకపోవడం గమనార్హం. అంటే ఉత్తర భారతంలో ముస్లింల పట్ల చారిత్రకంగా చిరకాలంగా ఉన్న సహజ వ్యతిరేకతను ఉపయోగించుకొని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్ల గొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో దాడులూ, హత్యలూ, చివరకు ట్రిపుల్‌ తలాక్‌ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. 


వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు
మొబైల్‌: 9705566213 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top