రాయని డైరీ : జైరామ్‌ రమేశ్‌ (కాంగ్రెస్‌)

Madhav Singaraju Article On Jairam Ramesh - Sakshi

మాధవ్‌ శింగరాజు

‘‘పీ చిదంబరం, రాహుల్‌ గాంధీ కూడా మన మధ్య ఉంటే బాగుండేది’’ అన్నారు అభిషేక్‌ సింఘ్వీ! ఆయన అలా ఎందుకన్నారో అర్థం కాలేదు. చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. రాహుల్‌ శ్రీనగర్‌ పర్యటనలో ఉన్నారు. 

సింఘ్వీ, శశి థరూర్, శర్మిష్ట ముఖర్జీ, నేను.. అనుకోకుండా ఒకచోట కలుసుకున్నాం. అనుకోకుండా కలుసుకున్నాం కాబట్టి మంచి విషయాలేవైనా మాట్లాడుకుందామని నలుగురం అనుకున్నాం. నాకైతే మోదీజీ తప్ప మరే మంచి విషయమూ కనిపించడం లేదు ప్రస్తుతం దేశంలో. వెంటనే ఆ మాట అంటే బాగుండదని ముందు మంచిచెడుల గురించి మాట్లాడ్డం మొదలు పెట్టాను. 

‘‘చెడ్డవాడు మంచి చేసినా మంచి అనాలి. మంచివాడు చెడు చేసినా చెడు అనాలి.  మంచిని కూడా మనం చెడు అంటుంటే, రేపు మనం మంచి చెప్పినా అది చెడే అవుతుంది’’ అన్నాను. 

ఆ మాట అంటున్నప్పుడే సింఘ్వీ ఈ మాట అన్నారు.. ‘పీ చిదంబరం, రాహుల్‌ గాంధీ కూడా మన మధ్య ఉంటే బాగుండేది’ అని! 
వెంటనే శర్మిష్ట ‘వహ్వా.. వహ్వా’ అన్నారు.

‘‘శర్మిష్టాజీ మీరెందుకు వహ్వా వహ్వా అని అన్నారు? చిదంబరం, రాహుల్‌  కూడా మనతో ఉంటే బాగుండేదని సింఘ్వీ అన్నందుకా?!’’ అని అడిగాను.
‘‘కాదు జైరామ్‌జీ, మంచిచెడులపై మీ అబ్జర్వేషన్‌ బాగుంది. విమర్శ.. విధానాల మీద ఉండాలి కానీ, వ్యక్తుల మీద ఉండకూడదని చక్కగా చెప్పారు. మోదీ గురించే కదా’’ అని నవ్వారు ఆవిడ.
‘‘మీరూ చక్కగానే అర్థం చేసుకున్నారు శర్మిష్టాజీ. మోదీని అదేపనిగా దెయ్యం దెయ్యం అంటుంటే మోదీ దేవుడైపోయి మనం దెయ్యాలమైపోతాం. ఇంట్లో ఎవరైనా దేవుడి పటం పెట్టుకుంటారు కానీ, దెయ్యం పటం పెట్టుకుంటారా?!’’ అన్నాను. 

థరూర్‌ నవ్వుతూ నా వైపు చూశారు. కాంగ్రెస్‌లో నాకు నచ్చే నవ్వు అది. 

‘‘నేనూ ఆరేళ్లుగా ఇదే చెబుతున్నాను జైరామ్‌జీ. మంచి చేసినప్పుడు మోదీని మనం మంచివాడు అనకపోతే, చెడు చేసినప్పుడు మోదీని మనం చెడ్డవాడు అనలేం. మన చెడు నుంచి మనం తప్పించుకోగలం కానీ, అవతలి వ్యక్తి మంచి నుంచి మనం తప్పించుకోలేం’’ అన్నారు థరూర్‌. 

బాగా చెప్పాడనిపించింది. శర్మిష్ట కూడా ‘బాగా చెప్పారు’ అన్నట్లు థరూర్‌ వైపు మెచ్చుకోలుగా చూశారు. ‘‘నేనూ అదే చెప్పబోతున్నా’’ అన్నారు సింఘ్వీ. 
‘‘మీరేం చెప్పబోతున్నారు సింఘ్వీ?’’ అని అడిగాను. 

‘‘మోదీ ఏం చేసినా మనం విమర్శిస్తూ ఉంటే మనం ఏం విమర్శించినా మోదీ ఏదో చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఉజ్వల స్కీమ్‌ని మనం గ్యాస్‌ అన్నాం. ‘అవును గ్యాసే. కాంగ్రెస్‌ గ్యాస్‌ కొట్టింది. మోదీ గ్యాస్‌ ఇచ్చాడు’ అన్నారు జనం. చేస్తున్న వంటను ఆపేసి మరీ మోదీకి ఓటేసి వచ్చారు. నా అనుమానం చిదంబరం ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా మోదీకే ఓటు వేసుంటుందని..’’ అన్నారు సింఘ్వీ. 

చిదంబరం మాట రాగానే సింఘ్వీ అన్నమాట గుర్తొచ్చింది. ‘‘చిదంబరం, రాహుల్‌ కూడా మన మధ్య ఉంటే బాగుండేదని అన్నారు కదా! మీకెందుకలా అనిపించింది సింఘ్వీ?’’ అని అడిగాను. 

‘‘చిదంబరం కూడా మోదీలో మంచిని చూశారు జైరామ్‌జీ. మోదీ పాలసీలు బాగున్నాయని ఈమధ్యనే కదా అన్నారు.. అరెస్ట్‌ అవడానికి ముందు..’’ అన్నారు సింఘ్వీ. 
‘‘మరి రాహుల్‌గాంధీ ఏం మంచి చూశారు మోదీలో?’’ అన్నాను. 

‘‘చూడలేదు.. మన మధ్య ఉంటే, శ్రీనగర్‌ పర్యటనలో రాహుల్‌కి మంచేమైనా కనిపించేదేమోనని’’ అన్నారు సింఘ్వీ!  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top