
మాధవ్ శింగరాజు
డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం బాగుంది! ఓవల్ ఆఫీస్‌లోకి నేను అడుగు పెట్టగానే, సాదరంగా ఆయన నాకు పలికిన అపూర్వ ఆహ్వానం... ఆ గదిలోని లైట్స్ అన్నీ డిమ్ చేయించటం!!
రెస్టారెంట్‌లలో, ఇలాగే డిమ్ లైట్‌ల కాంతిలో రాచమర్యాదలు ఉంటాయి. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ నాకోసం ఏర్పాటు చేయించిన డిష్‌లూ లేవు, చేసిన మర్యాదలూ లేవు. ఆయన ఆతిథ్యం నాకు బాగుండటానికి ఆ ‘లేకపోవటం’ తప్ప, వేరే కారణాల్లేవు.
మర్యాద తెలియని మనిషి నుంచి మర్యాదను పొందటం అవమానం. అది నాకు జరగలేదు. తింటున్నప్పుడైనా ఏం మాట్లాడకూడదో తెలియని మనిషితో కలిసి తినటానికి కూర్చోవలసి రావటం మర్యాదను పోగొట్టుకోవటం. అదీ నాకు జరగలేదు. కనుక ట్రంప్ నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లే!
లైట్స్ డిమ్ చేయించాక, స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్ వేయించి, ‘‘చూడండి, మిస్టర్ రామఫోసా... అక్కడ మీ వాళ్లు మా వాళ్లను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో’’ అన్నారు ట్రంప్. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలైంది. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలు కాకుండానూ అయింది.
స్క్రీన్ మీద ట్రంప్ వేయించిన ఆ క్లిప్ నిజమైనది కాదు. నిజమని ట్రంప్ అనుకుంటున్నా... దాని గురించి మాట్లాడే సందర్భం అది కాదు. ట్రేడ్ డీల్ కోసం పిలిపించుకున్నప్పుడు ట్రేడ్ డీల్ గురించే మాట్లాడాలి.
ఓవల్ ఆఫీస్‌ను స్కూల్ హెడ్ మాస్టర్ రూమ్‌గా మార్చేశారు ట్రంప్. రూమ్‌కి పిలిపించి, ‘‘రష్యా అడిగింది ఇచ్చేయ్’’ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని గద్దిస్తారు!
‘‘గాజా నుండి మీ దేశానికి వచ్చే శరణార్థుల్ని అడ్డుకోవద్దు...’’ అని జోర్డాన్ రాజు అబ్దుల్లా హుస్సేన్ కు చెబుతారు! ‘‘ఉక్రెయిన్ కి సహాయం ఆపేయాలని ఐరోపాకంతటికీ మీరే చెప్పాలి...’’ అని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ ను బలవంత పెడతారు!
‘‘కెనడాను సైనికంగా రక్షించటానికి అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని అమెరికానే భరిస్తోంది కనుక, కెనడాను అమెరికాలో ఎందుకు విలీనం చేయకూడదు?’’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశ్నిస్తారు.
‘‘జెలెన్ స్కీకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది కాదు కదా...’’ అని ఇటలీ ప్రధాని మిస్ మెలనీతో అంటారు. ఇప్పుడు నన్ను పిలిపించుకుని, ‘‘దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న ఊచకోతకు వివరణ ఇవ్వండి’’ అంటున్నారు.
జెలెన్ స్కీలా కోపగించుకొని మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోవటం నా వయసుకి బాగుండదు కనుక, మండే అగ్నిగోళం నెల్సన్ మండేలాను మనసులోకి తెచ్చిపెట్టుకుని ప్రశాంతంగా కూర్చున్నాను.
అమెరికా గురించి మండేలా గొప్పగా చెబుతుండేవారు. ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’ పార్టీకి మండేలా ప్రెసిడెంట్‌గా, నేను పార్టీ సెక్రెటరీ జనరల్‌గా ఉన్నప్పుడు మండేలా తరచూ అమెరికన్ డెమోక్రసీ మీద,అమెరికన్ లీడర్‌షిప్ మీద ప్రశంసా పూర్వకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండేవారు.
27 ఏళ్ల కారాగార వాసం నుండి విడుదలయ్యాక, మండేలా తొలిసారి సందర్శించిన దేశాల్లో అమెరికా కూడా ఉంది. పన్నెండు రోజుల టూర్‌లో ఆయన ఎనిమిది అమెరికన్ సిటీలలో పర్యటించారు.
అనేకమంది నాయకులను కలుసుకున్నారు. ప్రెసిడెంట్ జార్జిబుష్‌తో ఇదే ఓవల్ ఆఫీస్‌లో సమావేశం అయ్యారు. ఇదే ఆఫీస్‌లో నేను,జో బైడెన్ కూడా కలిసి కూర్చున్నాం.
ట్రంప్... బైడెన్ లా లేరు. జార్జి బుష్‌లా లేరు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్‌లానూ లేరు. అందరికన్నా భిన్నంగా ఉన్నారు!
ఆయన ఎలా ఉన్నా, ఎలా లేకున్నా...మండేలా అన్నట్లు అమెరికా గొప్ప దేశమే! కానీ కొన్నిసార్లు బ్రైట్‌నెస్ తగ్గి బాగా డిమ్ అయిపోతుంటుంది!