మనమంతా బాధపడవలసిన మరో సంగతి.. | Sakshi
Sakshi News home page

మనమంతా బాధపడవలసిన మరో సంగతి..

Published Sun, Feb 11 2018 4:27 AM

In Kashmir, whose rights are lost writes Aakar Patel - Sakshi

కల్లోల కశ్మీర్‌లో ఎవరి హక్కులు గల్లంతవుతున్నాయి?

మనమంతా బాధపడవలసిన సంగతి మరొకటుంది– మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్‌ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం.

ఈసారి నేను కశ్మీర్‌ హింసపై రాస్తున్నాను. ఆ హింస గురించి కేవలం ఒక కోణంలో మాత్రమే తెలిసిన పిల్లలనుద్దేశించి దీన్ని రాస్తున్నాను. కశ్మీర్‌లో ముగ్గురు పౌరులను కాల్చి చంపిన సైనికులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కావడంపై ఆగ్రహావే శాలు పెల్లుబుకుతున్నాయి. ఆ సైనికుల పిల్లలు కూడా కొన్ని చర్యలు తీసుకు న్నారు. ఇందుకు సంబంధించి వెలువడిన కథనం వివరాలివి: సైనికులపై ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలైన సమయంలో రాళ్లు విసిరిన ఆందోళనకారులపై కేసులు ఉపసంహ రించుకోవడంపై జమ్మూ–కశ్మీర్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సైనికుల పిల్లలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆందోళన కారులవల్ల సైనికులు కోల్పోతున్న మానవ హక్కుల్ని కాపాడాలని కోరారు. ఇద్దరు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా అధికారుల పిల్లలు ప్రీతి, కాజల్, ప్రభవ్, రిటైర్డ్‌ నాయబ్‌ సుబేదార్‌ హక్కుల సంఘం చైర్మన్‌ హెచ్‌ఎల్‌ దత్తుకు ఈ ఫిర్యాదు ఇచ్చారు. కల్లోలిత ప్రాంతాల్లో స్థానికుల హక్కుల కోసం ‘అలుపెరుగక శ్రమిస్తున్నందుకు’ సంఘాన్ని, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను అందులో ప్రశంసించారు. కానీ రాళ్లు విసిరే గుంపు వల్ల హక్కులు కోల్పోతున్న సైన్యం దీన స్థితి గురించి కళ్లు మూసుకుం టున్నాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి అక్కడ చిన్నపాటి యుద్ధం జరుగుతున్నదని, ప్రభుత్వ యంత్రాంగానికి సాయపడేందుకు సైన్యాన్ని రప్పించి వారి కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని ఆ ఫిర్యాదులో వారు వివరించారు.

వీటిని ఇంతకుమించి వివరించనవసరం లేదు. ఈ సందర్భంగా మరికొన్ని సంగతులు తెలుసుకోవాలని కోరుతున్నాను. గత నెలలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న వివరాలు చూద్దాం. ఏ) ఏఎఫ్‌ఎస్‌పీఏ కింద సాయుధ దళాలను ప్రాసి క్యూట్‌ చేయాలంటూ కేంద్రానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? బి) ఎన్నిటికి అను మతి మంజూరు చేశారు, ఎన్నిటిని తిరస్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? సి) ప్రతి ఒక్క ఫిర్యాదు విషయంలోనూ విడివిడిగా– ఫిర్యాదు వచ్చిన సంవ త్సరం, ఆరోపించిన నేరాలు, వాటిపై జరిగిన దర్యాప్తు ఫలితాలు, అనుమతి మంజూరుపై ప్రస్తుత స్థితి. డి) ప్రాసిక్యూషన్‌కు నిరాకరించిన లేదా పెండింగ్‌లో ఉంచిన పక్షంలో అందుకు గల కారణాలు. ఈ ప్రశ్నకు రక్షణ శాఖ సహాయమంత్రి ఇచ్చిన జవాబు ఇలా ఉంది: ఏ) సైనికులపై మొత్తం 50 కేసుల విషయంలో ఏఎఫ్‌ ఎస్‌పీఏకింద ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయి. బి,సి) సంవత్సరాలవారీగా కేసుల సంఖ్య, వాటిలో పేర్కొన్న ఆరోపణలు, ఆ కేసుల ప్రస్తుత స్థితిగతులు–అవి పెండింగ్‌లో ఉన్నాయా, అనుమతి మంజూరైందా, తిరస్కరించారా అన్న వివరాలు ఈ జవాబుతో జత చేశాం. డి) ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించడం లేదా పెండింగ్‌లో ఉంచడానికి వాటిల్లో తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోవడమే కారణం.

జవాన్లపై వచ్చిన కేసుల వివరాలివి: 2001–కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్‌ఐఆర్‌(ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరణ). 2005– కాల్చిచంపిన ఘటనల్లో 2 ఎఫ్‌ఐఆర్‌లు(అనుమతి నిరాకరణ). 2006–మొత్తం 17 ఎఫ్‌ఐఆర్‌లు. ఒక అత్యాచారం, మహిళలతో అసభ్య ప్రవర్తన కేసు, ఆరుగురి అపహరణ, హత్య ఘటన, మిగిలినవన్నీ కాల్చిచంపిన కేసులు(ఒక అపహరణ కేసు మినహా మిగిలిన వాటికి అనుమతి నిరాకరణ. ఆ ఒక్క కేసు పెండింగ్‌లో ఉంది). 2007–మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌లు. ఒక అత్యాచారం, చిత్రహింసలతో ఒకరి హత్య, మిగిలినవన్నీ కాల్చి చంపిన ఘటనలు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2008– 3 ఎఫ్‌ఐఆర్‌లు. ఒక అత్యాచారం, దొంగతనం, హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2009– 2 ఎఫ్‌ఐఆర్‌లు. ఒక హత్య కేసు, ఒక అపహరణ కేసు(రెండింటికీ అనుమతి నిరాకరణ). 2010– 4 ఎఫ్‌ఐఆర్‌లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరా కరణ). 2011– 2 ఎఫ్‌ఐఆర్‌లు. ఒకటి హత్య కేసు(అనుమతి నిరాకరణ), రెండోది అపహరణ కేసు(పెండింగ్‌). 2013– 3 ఎఫ్‌ఐఆర్‌లు. అన్నీ హత్య కేసులు(అన్నిటికీ అనుమతి నిరాకరణ). 2014– 2 ఎఫ్‌ఐఆర్‌లు. ఈ రెండూ కాల్చిచంపిన కేసులు (ఒక కేసులో అనుమతి నిరాకరణ, మరొకటి పెండింగ్‌). 2016– కాల్చి చంపిన కేసులో ఒక ఎఫ్‌ఐఆర్‌ (అనుమతి నిరాకరణ).

ఏతావాతా కశ్మీర్‌లో జరిగిన నేరాలకు విచారణను ఎదుర్కొన్న సైనికుల సంఖ్య–సున్నా. జవాన్లపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడం వల్ల వారి పిల్లల మనో భావాలు దెబ్బతిని ఉండొచ్చు. కేవలం వాటివల్ల అయ్యేదేమీ లేదని, కశ్మీర్‌ పౌరు లకు న్యాయం లభించడంలేదని పై వివరాలు గమనిస్తే అర్థమవుతుంది. ఇందుకు మనమంతా బాధపడాలి. తన సైనిక న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం చేస్తు న్నట్టు సైన్యం వాదించవచ్చు. కానీ వాటిల్లో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రవేశం ఉండదు. ఈ మార్గంలో జవాన్లు ఎలా నిర్దోషులవుతున్నారో తెలుసుకోవా లన్న ఆసక్తి ఉంటే పత్రిబల్, మాఛిల్‌ కేసుల్లో ఏమైందో తెలుసుకోండి.

మనమంతా బాధపడవలసిన విషయం మరొకటుంది. మన సైన్యం ఇతర భారతీయుల నుంచి తనకు రక్షణ కల్పించమని పిల్లలను ఉపయోగించుకుని డిమాండ్‌ చేస్తోంది. ఈ దేశ పౌరులు ఈ దేశ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే, ఇక్కడి పోలీసులే కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తే, ఈ దేశ న్యాయస్థానాల్లో, ఇక్కడి న్యాయమూర్తులే విచారణ జరుపుతుంటే మన సైన్యం భయసందేహాలు వ్యక్తం చేస్తోంది. నిజానికిది బాధపడాల్సిన విషయం కాదు... కలవరపడాల్సిన విషయం. ఎలాంటి నేరారోపణలొచ్చినా, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మన సైన్యం విచారణ నుంచి తప్పించుకుంటోంది. జవాన్లు అత్యాచారం చేసినా, హత్యలు చేసినా, కిడ్నాప్‌లకు పాల్పడినా, పౌరుల్ని చిత్రహింసలకు గురిచేసినా, వాటిపై ఫిర్యాదులొచ్చినా ప్రభుత్వాలు ‘నిరాకరణ’ లేదా ‘పెండింగ్‌’లో ఉంచుతాయి తప్ప ‘అనుమతి’ మంజూరు చేయవు. ఆ పిల్లలు, వారితోపాటు మనమంతా అసలు వేలాదిమంది కశ్మీర్‌ పౌరులు రాళ్లెందుకు విసురుతున్నారో అప్పుడప్పుడైనా ఆలోచించకతప్పదు.


- ఆకార్‌ పటేల్‌

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘aakar.patel@icloud.com

Advertisement
Advertisement