Travel కశ్మీర్‌ లోయలో సూర్యోదయం | Leh Tour Better Kashmir Tour Package, Check Out Best Places And Travel Details Inside | Sakshi
Sakshi News home page

Leh Tour Package: కశ్మీర్‌ లోయలో సూర్యోదయం

Jul 7 2025 10:30 AM | Updated on Jul 7 2025 11:23 AM

lay tour chech this better Kashmir touring package

14 వేల అడుగుల ఎత్తులో   ప్యాంగాంగ్‌ ఉప్పు నీటి సరస్సు. సరస్సు నీటి మీద సూర్యోదయం సూర్యాస్తమాల వీక్షణం. పాకిస్థాన్‌ సరిహద్దులో భారతదేశ తొలి గ్రామం టర్‌టక్‌. బుద్ధుని అవశిష్ట స్థాపితమైన ధవళకాంతుల శాంతి స్థూపం.

తొమ్మిది అంతస్థుల నిర్మాణం లాంచెన్‌ పాల్కర్‌ ప్యాలెస్‌. సియాచిన్‌ వార్‌ మెమోరియల్‌... హండర్‌ సాండ్‌ డ్యూన్స్‌. ఇవన్నీ లధాక్, లే పట్టణం... ఆ పరిసరాల్లోనే ఉన్నాయి.

హైదరాబాద్‌ నుంచి లే పట్టణానికి ప్రయాణం. రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి 6ఉ 2056/6821 విమానం ఉదయం 7.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.50 గంటలకు లేకు చేరుతుంది. ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వచ్చి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌. లే సముద్రమట్టం కంటే 11,500 అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి మారిన వాతావరణానికి అనుగుణంగా దేహం తనను తాను సరిచేసుకోవడం కోసం ఆ రోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆక్సిజెన్‌ స్థాయులకు తగినట్లు దేహం సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుంది. వయసులో ఉన్న వాళ్లు త్వరగా అడ్జస్ట్‌ అవుతారు. వీలయితే మార్కెట్, బజారులో ప్రశాంతవిహారాన్ని ఆస్వాదించవచ్చు.

రాత్రి బస లేహ్‌లోనే.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత సైట్‌సీయింగ్‌కి బయలుదేరాలి. లేæ పట్టణంలోని శాంతిస్థూప, లేక్‌ ప్యాలెస్‌ల సందర్శనం. ఆ తర్వాత ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’, గురుద్వారా పథేర్‌ సాహిబ్, మాగ్నటిక్‌ హిల్, సింధు నది– జన్సార్‌ నదుల సంగమ స్థలి, ఆల్చి మోనాస్ట్రీ దర్శనం తర్వాత తిరిగి లేహ్‌ పట్టణానికి వచ్చి రాత్రి బస చేయాలి.

శాంతికి ఇందిరా గాంధీ చేయూత
బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్టించి నిర్మించిన స్థూపం ఇది. బౌద్ధం ప్రపంచ శాంతిని కోరుతుంది. లధాక్‌ కేంద్రపాలిత ప్రాంతం(ఉమ్మడి కశ్మీర్‌), లే పట్టణంలో బౌద్ధులు శాంతికి చిహ్నమైన ధవళ స్థూపాన్ని నిర్మించాలని తలపెట్టారు. వారికి జపాన్‌లోని బౌద్ధులు ఆర్థిక సహాయం చేశారు. మనదేశంలోని ఇతర రాష్ట్రాల బౌద్ధులు కూడా తమవంతు సహాయం చేశారు. ఈ నిర్మాణాన్ని 1983లో తలపెట్టారు. దారి తోవ లేని ఈ ప్రదేశానికి వాహనాలు వెళ్లడం కోసం రోడ్డు నిర్మాణానికి నిధులను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శాంక్షన్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి మెటీరియల్‌ సమకూర్చింది. బౌద్ధావలంబకులతోపాటు భారత ఆర్మీ జవానులు కూడా ఈ నిర్మాణం కోసం శ్రమదానం చేశారు. ఈ స్థూపం లే పర్యాటకానికి కేంద్రబిందువైంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం అందంగా ఉంటాయి. సూర్యకిరణాలు చుట్టూ ఉన్న మంచు పర్వతాల మీద ప్రతిబింబిస్తూ కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి.

లే రాజమందిరం
లే పట్టణంలో ఉంది కాబట్టి లే  ప్యాలెస్‌ అంటారు, కానీ దీని అసలు పేరు లాంచెన్‌పాల్కర్‌ ప్యాలెస్‌. క్రీ.శ 1600 నాటి నిర్మాణం. బయటి నుంచి చూస్తే రాయి మీ రాయి పెట్టి నిటారుగా ఎటువంటి సృజనాత్మకత లేని నిర్మాణం అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న పెయింటింగ్స్‌ చూస్తే ప్రపంచంలోని క్రియేటివిటీని రాశిపొఓసినట్లు అనిపిస్తుంది. పెయింటింగ్స్‌లో రంగుల కోసం జాతిరాళ్ల చూర్ణాన్ని అద్దారు. ఇది తొమ్మిది అంతస్థుల రాజమందిరం. కింది అంతస్థుల్లో గుర్రపుశాలలు, ధాన్యం నిల్వ చేసే గదులు. పై అంతస్థుల్లో సెంగె నమ్‌గ్యాల్‌ రాజ కుటుంబం నివసించేది. డోంగ్రా జాతి ఉద్యమకారులు ప్యాలెస్‌ను ఆక్రమించుకోవడంతో రాజకుటుంబీకులు ఈ ప్రదేశానికి 15 కిలోమీటర్ల దూరాన స్టోక్‌ అనే ప్రదేశంలో ఉన్న రాజమందిరానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ ప్యాలెస్‌ పాడుపడింది. ఇప్పుడు నిర్వహణ బాధ్యతను ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తీసుకుని పునరుద్ధరిస్తోంది. ఈ ప్యాలెస్‌ నుంచి కశ్మీర్‌ మంచుకొండలు కనువిందు చేస్తాయి. 

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత టర్‌టక్‌ గ్రామానికి ప్రయాణం. దారిలో సియాచిన్‌ వార్‌ మెమోరియల్‌ దర్శనం, థాంగ్‌ జీరో పాయింట్‌ వీక్షణం. మధ్యాహ్న భోజనం టర్‌టక్‌ గ్రామంలో. బాల్టీ హెరిటేజ్‌ హౌస్, మ్యూజియం, నాచురల్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లేస్‌ (ఫ్రీజింగ్‌ పాయింట్‌), సాయంత్రం కల్చరల్‌ షో తర్వాత రాత్రి బస నుబ్రా వ్యాలీలో. 

తెల్లవారు జామునే నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి లేహ్‌లో గది చెక్‌ అవుట్‌ చేసి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాలి. 6ఉ 6822/6217 విమానం మధ్యాహ్నం 13.30 గంటలకు లేహ్‌లో బయలుదేరి 19.15 గంటలకు హైదరాబాద్‌కి చేరుతుంది. 

యుద్ధం... మరపురాని జ్ఞాపకం!
సియాచిన్‌ వార్‌ మెమోరియల్‌ సియాచిన్‌ బేస్‌ క్యాంపు దగ్గర ఉంది. ఇది దేశం కోసం అసువులు బాసిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడం. సియాచిన్‌ గ్లేసియర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం.

ఈ నేల మనదే!
టర్‌టక్‌ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనదేశపు చివరి గ్రామంగా గుర్తిస్తారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో టిబెట్‌ సరిహద్దులో ఉన్న మాణా గ్రామాన్ని కూడా దేశపు చివరి గ్రామంగా గుర్తించేవారు. ఇప్పుడు మాణా గ్రామానికి తొలి గ్రామం హోదా దక్కింది. పాకిస్థాన్‌ సరిహద్దును తాకుతున్న టర్‌టక్‌ గ్రామం 1971 యుద్ధంలో భారత్‌ సొంతమైంది. బాల్టిస్థాన్‌ రీజియన్‌కు చెందిన ప్రదేశం. టర్‌టక్‌లో నివసించే ప్రజలు కూడా బాల్టి తెగకు చెందిన వారే. షియోక్‌ నది తీరాన, సియాచిన్‌ గ్లేసియర్‌కు ముఖద్వారం ఈ గ్రామం. ఒకసారిపాక్‌ పాలనలోకి వెళ్లి తిరిగి భారత్‌ సొంతమైన ప్రదేశంగా ఈ మట్టి మీద నడవడం గొప్ప థ్రిల్‌.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ త్వరగా ముగించుకుని హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి  పాంగాంగ్‌ కి బయలుదేరాలి. ఆ రోజు పాంగాంగ్‌ లేక్, పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ విశ్రాంతి విహారమే. రాత్రి బస కూడా అక్కడే.

యుద్ధక్షేత్రాల సరస్సు
పాంగాంగ్‌ త్సో అత్యంత విశాలమైన సరస్సు. ఉప్పునీటి సరస్సు. ఏడువందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే దాదాపు హైదరాబాద్‌ నగరమంత. ఈ సరస్సు యాభై శాతం టిబెట్‌ పరిధిలో చైనా పాలనలో ఉంది. నలభై శాతం లధాక్‌ పరిధిలో భారత్‌ పాలనలో ఉంది. మిగిలిన పదిశాతం మాత్రం భారత్‌– చైనాల మధ్య వివాదాస్పద ప్రదేశంగా ఉంది. ఈ నీటి స్వచ్ఛతను నీటి అడుగున ఉన్న రాళ్లు చె΄్తాయి. నీరు శీతాకాలంలో గడ్డకట్టుకుపోతుంది. బోర్డర్‌ టూరిజమ్‌ పేరుతో ఈ ప్రదేశం ఇప్పుడు పెద్ద టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చెందింది. భారత్‌ రణ్‌భూమి దర్శన్‌లో భాగంగా మిలిటరీ విభాగం యుద్ధక్షేత్రాలు, వార్‌ మెమోరియల్‌లలోకి పర్యాటకులకు అనుమతిస్తోంది.సూర్యోదయానికి ముందే నిద్రలేచిపాంగాంగ్‌ సరస్సు మీద సూర్యోదయాన్ని వీక్షించాలి. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి లేహ్‌కు ప్రయాణం. దారిలో థిక్‌సీ మోనాస్ట్రీ, షే  ప్యాలెస్, రాంచోస్‌ స్కూల్‌ చూసుకుని లేహ్‌కు చేరి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ అవ్వాలి. ఆ రోజు సాయంత్రం సరదాగా మార్కెట్‌ విహారం, షాపింగ్‌లో గడపడమే.

ఈశాన్యంలో సూర్యోదయం
పాంగాంగ్‌ సరస్సు దాదాపుగా 14 వేల అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో ఎత్తైన ఉప్పు నీటి సరస్సు ఇదే. ఈ సరస్సు తీరాన్నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం అద్భుతమైన అనుభవం. అయితే సూర్యోదయాన్ని వీక్షించాలంటే ఉదయం ఐదింటికే అక్కడ ఉండాలి. అలాగే సూర్యాస్తమయం కోసం రాత్రి ఏడున్నర వరకు వేచి చూడాలి. మనకు ఉత్తరాయనం, దక్షిణాయనం ఉన్నట్లే ఈ రోజుల్లో సూర్యోదయం ఈశాన్య దిక్కులోనూ, సూర్యాస్తమయం వాయువ్య దిక్కులోనూ జరుగుతుంది. 

నుబ్రా మంచు పూల పరిమళం
నుబ్రా అంటే పూల లోయ అని అర్థం. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌. ఇలాంటి పూలలోయ ఉత్తరాఖండ్‌లో కూడా ఉంది. ఇది కశ్మీర్‌లోయలోని పూల లోయ. షియోక్‌ నది– సియాచిన్‌ ( నుబ్రాదగ్గర ఈ నదిని కూడా నుబ్రా నది అనే పిలుస్తారు, ఇదే నదిని టిబెట్లో యర్మా నదిగా పిలుస్తారు) నది కలిసే ప్రదేశంలో విస్తారమైన లోయ ఉంది. మనుష్యసంచారం ఉండని ఆ లోయ రకరకాల పూల చెట్లకు ఆలవాలమైంది. పదివేల అడుగుల ఎత్తులో ఒక లోయ, ఆ లోయలో పూలు... ఆ ఊహ కూడా అందంగా ఉంటుంది. ఈ లోయకు ఒక వైపు పాంగాంగ్‌ లేక్‌ ఉంది. ఒంటె మీద సాగే నుబ్రా పూలతోటలు, హండర్‌ గ్రామంలోని ఇసుక తిన్నెల విహారం జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం. 

 ప్యాకేజ్‌ ఇలా ఉంటుంది!

లే విత్‌ టర్‌టక్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌హెచ్‌ఏ41)’ ఏడు రోజుల టూర్‌.
ఆగస్టు 20వ తేదీ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది.
సింగిల్‌ ఆక్యుపెన్సీలో 47 వేలవుతుంది. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 42 వేలు
ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో 41,600 రూపాయలవుతుంది. 

టూర్‌ కోడ్‌: LEH WI-TH TURTUK EX HYDERABAD (SHA41) ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి!

హైదరాబాద్‌ నుంచి లేహ్, లేహ్‌ నుంచి హైదరాబాద్‌కి విమానం టికెట్‌లు.
లేహ్‌లో 3 రాత్రులు, నుబ్రాలో 2 రాత్రులు, పాంగాంగ్‌లో ఒక రాత్రి హోటల్‌ గదుల బస.
సైట్‌ సీయింగ్‌ ప్రయాణానికి నాన్‌ ఏసీ వాహనాలు, షేరింగ్‌ పద్ధతిలో. ఆరు రోజులు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, రాత్రి భోజనం
∙ట్రావెల్‌ ఇన్సూరెన్స్, గైడ్, కల్చరల్‌ షో, 
రోజుకో వాటర్‌ బాటిల్, ఐటెనరీలో సూచించిన ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు  ప్యాకేజ్‌ ధరలోనే. టూర్‌ మేనేజర్‌ ఉంటారు, అత్యవసరానికి ఆక్సిజెన్‌ సిలిండర్‌ సిద్ధంగా ఉంటుంది.ఇవేవీ ప్యాకేజ్‌లో వర్తించవు!

ఇంటి నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి రవాణా
హోటళ్లలో లాండ్రీ, టెలిఫోన్, ఎక్స్‌ట్రా వాటర్‌ బాటిళ్లు.
పర్యాటక ప్రదేశాల్లోకి వీడియో కెమెరాకు ఎంట్రీ ఫీజ్, క్యామెల్‌ రైడ్‌తోపాటు ఇతర వినోద కార్యక్రమాలు, ఐటెనరీలో లేని ఆహారం ఆర్డర్‌ చేసుకుంటే విడిగా డబ్బు చెల్లించాలి.
వాతావరణం అనుకూలతలను బట్టి అవసరమైతే టూర్‌ ఐటెనరీలో స్వల్పమార్పులు ఉంటాయి. వాటికి సహకరించాలి.  

లే నుంచి నుబ్రాకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి ఖర్‌దూంగ్‌లా పాస్‌ మీదుగా నుబ్రా వ్యాలీ చేరడం. నుబ్రాలో గదిలో చెక్‌ ఇన్‌. దీక్షిత్, హండర్‌ గ్రామాలు, మోనాస్ట్రీల పర్యటన. సాయంత్రం కామెల్‌ సఫారీని ఆస్వాదించి రాత్రి నుబ్రా వ్యాలీలో బస.

– వాకా మంజులారెడ్డి,
సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement