ఈ గిల్లికజ్జాలు బాల్య చేష్టలు కావా..?

karan Thapar write Article on India-Pakistan issues - Sakshi

ఆదిత్య హృదయం

భారత్, పాకిస్తాన్‌ దేశాలు పరస్పరం పోట్లాడుకుంటూ చిన్న పిల్లల్లాగా వ్యవహరించే సమయాలు ఉన్నాయి. మన రెండు దేశాల దౌత్యవేత్తల మధ్య కూడా ఎత్తుకు పైఎత్తు వేస్తూ ప్రయోజనం పొందే ఘటనలు తరచుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనను మరోసారి మనం చూస్తున్నాం. నిజాయితీగా చెప్పాలంటే, ఈ తగాదాలు ఎవరు ప్రారంభించారని ప్రశ్నించడం అసంబద్ధమైనది. అది ప్రస్తుతం విషయ విస్తరణగా మాత్రమే ఉంటుంది. వారికి అత్యుత్తమమైన దాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నప్పటికీ, తమను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా, గాయపరుస్తున్నట్లు ఫీలవుతుం టారు. వాస్తవానికి ఆ సందర్భంలో అలాంటిది ఏమీ జరిగి ఉండదు. అలాంటి అభిప్రాయం కలిగిందే తడవుగా చాలా వేగంగా స్పందించి తిరిగి దెబ్బ కొడుతుంటారు. కానీ నిజంగా గమనించాల్సింది ఏమిటంటే ఇలాంటి గొడవల్లో కనిపించే అల్పత్వాన్నే. 

ప్రస్తుత ఘటనలో దాగివున్న మూర్ఖత్వానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ. భారత్‌ నూతన హై కమిషనర్‌ అజయ్‌ బిసారియాకు ఇస్లామాబాద్‌ క్లబ్‌ సభ్యత్వం ఇవ్వడంలో పాకిస్తాన్‌ అలక్ష్యం వహిస్తున్నట్లు కనిపించింది. మన మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా తీవ్రమైన అంశమే. ఎందుకంటే ఒక గౌరవనీయమైన వ్యక్తికి క్లబ్‌ సభ్యత్వం ఎందుకు నిరాకరిస్తారు? అలాంటి ఆలోచనే పరమ హాస్యాస్పదమైనదిగా మధ్యతరగతి భావిస్తుంది. 

ఇక పాకిస్తానీయులు కూడా ఈ ఘటనపై తమ వంతు ఆరోపణలకు దిగారు. ఇస్లామాబాద్‌ క్లబ్‌లో కేవలం 1,500 డాలర్లు మాత్రమే చెల్లించి భారతీయ దౌత్యవేత్తలు అన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తుండగా, ఢిల్లీలోని గోల్ఫ్‌ క్లబ్‌లో మూడేళ్ల సభ్యత్వం తీసుకోవాలంటే పాక్‌ దౌత్యవేత్తలు 15,000 డాలర్లు చెల్లించాల్సి వస్తోం దన్నది వీరి అభియోగం. గోల్ఫ్‌ కోర్స్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సౌకర్యాలకోసం అంత భారీ సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేయ డం వింత గొలుపుతుందన్నది పాక్‌ వాదన. అదే ఇస్లామాబాద్‌ క్లబ్‌ని చూస్తే అక్కడ ఒక బార్‌ సౌకర్యం మాత్రమే ఉంటోంది.

ఈ సమస్య మరింత ముందుకెళుతోంది. పాక్‌లోని భారతీయ దౌత్యవేత్తలకు తరచుగా విద్యుత్తు, నీటి సౌకర్యాలను నిలిపివేస్తూ వారు బట్టలు శుభ్రం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తూ, చీకట్లో మునిగేలా చేస్తుంటారు. మనం కూడా భారత్‌లో పాక్‌ దౌత్యవేత్తల పిల్లలను స్కూలుకు వెళ్లకుండా అడ్డగిస్తూ, వారి వాహనాల డ్రైవర్లను వేధిస్తూ ఉంటాం. పైగా, ఇరు దేశాల్లోనూ, తెల్లవారి 3 గంటల సమయంలో దౌత్యవేత్తల ఇంటి గంటలను పని లేకున్నా మోగిస్తూ నిద్రాభంగం కలిగిస్తుంటారు.  

మనం పరస్పరం ఆడుతున్న ఆటలు ఇలాగే ఉన్నాయి. ఇది రెండు దేశాలకూ  తెలుసు. పైగా ఇతర దేశాలకు కూడా ఈ విషయం క్షుణ్ణంగా తెలిసేలా చేస్తుంటాం. రెండు దశాబ్దాల క్రితం, భారత్‌లో బెల్జియం మాజీ రాయబారి ఇలాంటి అవివేకపు చర్యల వెనుక ఏం దాగి ఉందన్నది బయటపెట్టారు. తన మాటల్లో చెప్పాలంటే, ‘భారత్, పాక్‌ల మధ్య అనూహ్య సంబంధాలు ఉంటున్నాయి. ఈ రెండు దేశాలు పరస్పరం చక్కగా అర్థం చేసుకుం టూనే అదే సమయంలో పరస్పరం ద్వేషించుకోవడాన్ని ప్రేమిస్తుంటాయి. ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టడంలో మహదానందపడుతుంటారు. ఇది మరీ అసంబద్ధంగా కనిపిస్తుంటుంది. 

‘ఇస్లామాబాద్‌లో పనిచేసిన ఏ భారతీయ దౌత్యవేత్త అయినా, ఢిల్లీలో పనిచేసిన ఏ పాక్‌ దౌత్యవేత్త అయినా బెల్జియం మాజీ రాయబారి అభిప్రాయంతో విభేదిస్తారంటే నాకు సందేహమే.
మీరు భారత్‌ లేక పాక్‌ దౌత్యవేత్తలను అడిగి చూడండి. ప్రత్యర్థి దేశపు ప్రవర్తనను పిల్లచేష్ట అని, అల్పమనస్తత్వం అని, అనుచితం అనీ వ్యాఖ్యానించే విషయంలో ఈ దౌత్యవేత్తలు ఏ ఒక్కరూ వెనక్కు తగ్గరు. కానీ మీ వ్యవహారం ఏమిటి అని అడిగి చూడండి. ఆ స్థాయిలో స్పందన రానే రాదు. తనను తాను కరెక్ట్‌ అని భావించుకునే వ్యక్తి తనను మాత్రమే పక్షపాతంతో చూస్తున్నారని నమ్మడమే కాకుండా దానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైందేనని సమర్థించుకుంటూ ఉంటాడు. 

అంటే, విడిపోయిన దాయాదులు ప్రవర్తించాల్సింది ఇలాగేనా? ఒకప్పుడు మనది ఒకే దేశ మని, మనం ఒకే ప్రజ అన్న సత్యానికి అనివార్య ఫలితం ఇదేనా? కావచ్చు. కానీ ఇది సముచితమైన సంజాయిషీ కాదని, చీదరపుట్టించే మన ప్రవర్తనకు ఇది తగిన వివరణ కాదనుకుంటాను. మనవైపు మాత్రమే మనం చూసుకుంటున్నట్లయితే, మనకు ఎదురయ్యే పరిహాసానికి, ఎగతాళికి మనమే కారణం అని మనం ఎన్నడైనా గుర్తించగలమా? మనం కాస్త ఎదగాల్సిన సమయం ఇది. 

వాస్తవం ఏమిటంటే, మనం నిజంగా పరస్పరం ఆందోళన చెందాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఇలాంటి మూర్ఖత్వపు చేష్టలు సమస్యను వైయక్తికంగా మారుస్తాయని, తద్వారా పరిష్కారం సాధ్యం కాదని మనకు తెలుసు. మన ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై మాట్లాడనప్పుడు దౌత్యవేత్తలు గిల్లికజ్జాలు పెట్టుకోవడం సమర్ధనీయం కాదు. వారు కనీసం తమ భావ వ్యక్తీకరణ మార్గాలను తెరిచి ఉంచుకోవాల్సి ఉంది. అప్పుడు మాత్రమే, మన ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైనప్పుడు ఆ చర్చా ప్రక్రియ కాస్త సాధ్యపడుతుంది.

- కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ :  karanthapar@itvindia.net

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top