ఒక మహా యజ్ఞం

Gollapudi Maruti Rao Writes About FIFA Worldcup 2018 - Sakshi

♦ జీవన కాలమ్‌
ఇదేమిటి! ఓ చిన్న ఆటకి ఇంత పెద్ద పేరు వాడుతున్నాడేమిటి ఈ పిచ్చి రచయిత అని చాలామంది ముక్కుమీద వేలు వేసుకోవచ్చు. చెప్పడానికి నాకు నిడివి చాలదు. కొన్నే సరదాగా చెప్తాను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలోనూ ఫుట్‌బాల్‌ మీద రాయకూడదని నాకు నేనే శపథం చేసుకున్నాను. ఎందుకంటే అది మహా కావ్యం. ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. ఎందుకో తెలీదు. ఎలాగో తెలీదు. ఒక పద్ధతీ, ఒక లాజిక్, ఒక ఎమోషన్‌కి లొంగే ఆటకాదు– ఈ దుర్మార్గమైన ఆకర్షణ.

చాలా సంవత్సరాల కిందట నేనూ, మా రెండో అబ్బాయి, మా ఆవిడా ఇటలీ వెళ్లాం. నేపుల్స్‌ చూపే డ్రైవర్ని– ఉన్నట్టుండి– మా ఆవిడ అడిగింది. ‘‘నేపుల్స్‌ చూశాక చచ్చిపోయినా ఫరవాలేదు అంటారు కదా? ఎందుకని?’’ అని. డ్రైవర్‌ నవ్వాడు. కారు ఒకే ఒక్క తిప్పు తిప్పాడు– అంతే. మా గుండెలు ఆగిపోయాయి. ఆ సముద్ర సౌందర్యం, ఆ దృశ్యం వర్ణనాతీతం. కాదు. అక్కడ ఆగలేదు. వెనక్కి తిరిగి– ఎదురుగా ఉన్న ఓ బంగళాకి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే పెట్టినట్టు నమస్కారం చేశాడు. ఏమిటన్నాను? ఇటలీవారి గొంతులు పెద్దవి, శరీరం పెద్దది, గుండెకాయ పెద్దది. దైవభక్తి పెద్దది. అన్నిటికీ మించి సౌందర్యం ‘పెద్దది’. బంగళాని చూపుతూ ‘మారడోనా!’ అన్నాడు. అది మారడోనా నివాసమట. అంతే అర్థమయింది.

వివరాలు చెప్పకుండా ఒక జోక్‌ చెప్తాను. మరికొన్ని సంవత్సరాలకి పోప్‌ కావలసిన ఒక మత గురువు జోర్గే మారియో బెర్గోగ్లి అన్నాడు : ‘‘మారడోనా, మెస్సీ, పోప్‌ ఒకే దేశంలో ఉండటం ఆ దేశానికి చాలా అన్యాయం’’ అని. అయితే పోప్‌ అదృష్టవంతుడు– అతన్ని ఆ ముగ్గులోకి లాగితే!– ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆయనెక్కడ ఉంటాడో చెప్పడం కష్టం. గణపతి సచ్చిదానంద స్వామిని విరాట్‌ కోహ్లీ గురించి, ధోనీ మధ్యకి– అసలు ఈ మాట అనడానికి నోరొస్తుందా? వస్తే? స్వామి ఎక్కడ ఉంటారు? ఇది సరదా మాట. ఓ అభిమాని మైకం. అంతవరకే. నాకనిపిస్తుంది– ఇక్కడ చెప్పకపోతే నాకు చోటు లేదు. ‘సెర్బియా’ వంటి అతి చిన్న దేశం– కేవలం మన హైదరాబాదు జనాభా– నుంచి వచ్చి ప్రపంచాన్ని కొల్లగొట్టే 80 పౌన్ల శరీరంలో – డోకోవిచ్లో– ఎక్కడ ఆ ‘వేడి’ని భగవంతుడు అమర్చాడా అని చూస్తూ మూర్ఛపోతాను.

ఈ బంతి ఆట కథలు అపూర్వం. అనితర సాధ్యం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ ఆటలు జరిగే మాస్కోలో కనీస ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీలు. ప్రస్తుతం పది. చూస్తున్న ప్రేక్షకులలో, ఆడే ఆటగాళ్లలో వాళ్ల శరీరాలు కాగే పెనాలు. ఏమి ఈ క్రీడ. ప్రపంచాన్ని ఊపి ఉర్రూతలూగించే ఈ ఆటలో పాల్గొన్న దేశాలు– కొన్ని మన టి.నగర్, బీబీ నగర్, వెలంపేట దాటవు– అనూహ్యం. ఒక్కరూ మన సినీమా ఎక్స్‌ట్రాల కాలి గోటికి పోలరు. వారిలో చాలామంది నల్లవారు. కానీ బంతి ఆట అభిమానులకి వారు గంధర్వులు, దేవతలు, కొందరికి పోప్లు (క్షమించాలి– ఇది నామాట కాదు). ఇంకా పీలేని, జిదానే, రొనాల్డో, రొనాల్డినోని తలుచుకోలేదు. అదృష్టం. ఇక దురదృష్టం ఏదంటే– నిన్ననే పోటీలో అర్జెంటీనా ఓడిపోయిందని మన దేశంలో కొట్టాయం అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఓ చిన్న ఉదాహరణ చెప్పాలని మనస్సు పీకుతోంది. 1994 సెప్టెంబరు 19న రాత్రి 12 గంటలకి– బంతి ఆటలో పాల్గొనడానికి వస్తున్న చిన్న విమానం సహారా ఎడారిలో కూలిపోయింది. అందులో పోటీలో పాల్గొనవలసిన నైజీరియా పోటీ ఆటగాళ్లున్నారు. విమానంలో ఉన్న 39 మందీ చచ్చిపోయారు. ఓ శరీరం గుర్తుపట్టలేనంత కాలిపోయింది. బంతి ఆటలో పాల్గొనవలసిన 13 మంది అంతా చచ్చిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. అప్పుడేమవుతుంది? మరో దేశంలో అయితే సంతాప సభలు జరుగుతాయి. ప్రధాని, అధ్యక్షుడు సంతాప ప్రకటనలిస్తారు. ఆ ఆటగాళ్ల మీద జాతీయ జెండాలని కప్పి అంత్యక్రియలు చేస్తారు. పత్రికలు వారి ఫొటోలు ప్రకటిస్తాయి. అందులో 32 మంది టీం సభ్యులు, ఏడుగురు ఆటగాళ్లున్నారు.

అయ్యా, ఆట ఆగలేదు. మరో నైజీరియా టీం పాల్గొంది. దేశం ఆనాడు ‘ఆట’ని ఓడిపోయింది. కానీ ‘ఆత్మవిశ్వాసాన్ని’ ‘పట్టుదల’ని నష్టపోలేదు. ఇంతకన్న ఈ దేశాల ఆట అంతకంటే వారు చూపే అభిమానం, అంతకంటే వారు ఆ ఆటగాళ్లకిచ్చే గౌరవాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఇది బంతి ఆట మైకానికి నివాళి. అంతవరకే. ఇది నా నమూనా పాఠకులకి చిన్న రసగుళిక.


గొల్లపూడి మారుతీరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top