పేదరికం మీద సవాలు

Gollapudi Maruthi Rao write article on Poverty in India - Sakshi

జీవన కాలమ్‌

పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క– మహావృక్షమై నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. భూమిని చీల్చుకుని వెలుగుని చూపుతుంది.

సద్గురువులు శివానంద మూర్తిగారు ‘‘పేదరికం అంటే విదేశాలలో కేవలం దరిద్రం అన్నారు. కానీ ఒక్క భారతదేశంలో పేదరికం సంపద, వైభవం. ఒకే ఒక్క ఉదాహరణ: భగవాన్‌ రమణ మహర్షి. కౌపీనం కేవలం పశువుకీ మనిషి సంస్కారానికీ చెలియలికట్ట. అదే, అంతే కౌపీనం ఆవశ్యకత’’. మన దేశంలో కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని చట్టం వలలోంచి జారిపోయినవారు– లలిత్‌మోదీలు, విజయ్‌ మాల్యాలు, నీరవ్‌ మోదీలు, నేహుల్‌ చోక్సీ– మరెందరో ఉన్నారు. తెల్లారి లేస్తే ఈ పనులు చేసే మంత్రులు, వారి తనయులు, రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, దేవుని ఆస్తులు పరిరక్షించాల్సిన అతి ‘నీచ’ అధికారులు– వీరిని సాధించలేదని సాధించే మేధావులూ, పార్టీలూ ఉన్నాయి.

ఈ సంస్కృతిలో ఏనుగు తలల దేవుళ్లు, గుర్రపు తలల దేవుళ్లు, సింహపు తలల దేవుళ్లు, సగం మగా సగం ఆడా దేవుళ్లూ చాలామంది ఉన్నారు. వీటిని నెత్తిన పెట్టుకుని కిసుక్కున నవ్వుకునే తెలివైన మేధావులూ ఉన్నారు. అది వారి అదృష్టం. వారివల్ల ఈ జాతికి నష్టం లేదు. అలనాడూ ఈ ప్రబుద్ధులు ఉన్నారు. ‘నేనే దేవుణ్ణి’ అన్న నేటి తరం నాయకుల ప్రాక్సీలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారి మెజారిటీ పెరిగింది. పెరిగినప్పుడల్లా ‘నేనున్నాన’ని దేవుడు వస్తాడని కథ. ఇది పుక్కిట పురాణం కావచ్చు. మనమూ కాస్సేపు నవ్వుకుందాం.

కాలడి (కేరళ)లో ఓ చిన్న కుర్రాడు శంకరుడు. పుట్టుకతోనే ‘విద్య’ని దర్శించుకున్న– మన చీభాషలో ‘ప్రాడిజీ’. శాస్త్రాల ప్రకారం– ప్రజ్ఞ కలవానికి మూడవ యేటనే ఉపనయనం చేయవచ్చు. తండ్రి చేయాలని సంకల్పించారు. కానీ కాలం చేశాడు. ఐదవయేట గురువు విద్యారణ్యులు గాయత్రిని ఉపదేశించారు. ఏడవ యేట ఉంఛవృత్తికి బయలుదేరాడు. ఓ ఇంటిముందు నిలిచాడు జోలెతో. ఆ పేదరాలికి తినడానికి తిండిలేని స్థితి. కానీ ఏదో వటువుకి ఇవ్వాలనే తపన. ఇల్లంతా వెదికింది. ఓ మూల సగం కుళ్లిన ఉసిరికాయ దొరికింది. కంటతడితోనే, సిగ్గుగానే, నిస్సహాయంగా శంకరుని జోలెలోనే ఉంచింది. ఇక్కడ ఇద్దరు పేదలు. పేదరికాన్ని స్వచ్ఛందంగా వరించిన ప్రతిభామూర్తి. అటుపక్క నిస్సహాయమైన పేదరాలు. ఇదీ భారతీయ ‘పేదరికానికి’ బంగారు ఉదాహరణ. అటు పేదరాలు నిస్సహాయతతో చలించిపోయింది. ఇటు ఓ ‘ప్రజ్ఞా బిందువు’ ప్రజ్ఞాసింధువైపోయాడు. ఏడేళ్ల వటువు నోటివెంట ఆర్ద్రత అమృతమైంది. ‘కనకధారా స్తోత్రం’ వర్షించింది.

‘‘అమ్మా, ఈ తల్లి ఎన్ని జన్మల్లోనో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో ‘ఇవ్వాలన్న’ ఒక్క సంస్కారాన్ని మిగుల్చుకున్నందుకు ఆమెని కరుణించు’’ అన్లేదు శంకరులు. కోరికలే లేని మహా పురుషుడాయన. కేవలం ఈ మాటలే అన్నారు: ‘‘బంగారువంటి నీ కరచరణాలతో, పద్మాలవంటి నీ నేత్ర ద్వయంతో కరుణించు తల్లీ. నా హృదయమంతా పేదరికంతో భయకంపిత మౌతోంది. నీ సమక్షంలో నేను శరణాగతిని కోరుకుంటున్నాను. ప్రతి దినం నన్ను దాటి నీ కరుణా కటాక్షాలను ప్రసరించు’’.

ఈ ఏడేళ్ల మహా పురుషుడు తనని కాదు– తనని దాటి అనునిత్య పేదరికాన్ని అనుభవించే కోటానుకోట్ల దీనులని కరుణించ మంటున్నారు.
వెనువెంటనే మరొక తల్లి ఆర్ద్రమై కనకధారను వర్షించింది. నాకు తెలుసు– కొందరు మిత్రులు కిసుక్కుమంటున్నారు. ఈ జాతి కొన్ని యుగాలుగా వారినీ ఉద్ధరిస్తోంది. పరమ స్త్రీ లోలుడు అజామీలుడిని తరింపజేసింది. పరమ జారుడు నిగమ శర్మ తరిం చాడు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ చిన్న సత్కార్యమైనా ఒక జీవితకాలపు పాపానికి ప్రాయశ్చిత్తం కాగలదని– దారి తప్పిన వారిని చేరదీసి అక్కున చేర్చుకునే అరుదైన సంస్కృతీ వైభవమిది.

ఈ దేశంలో భక్తికి కాదు పెద్ద పీట. తపస్సుకి కాదు. గెడ్డాలకి కాదు. రుద్రాక్షలకి కాదు. విభూతికి కాదు. మీరు క్షమిస్తే వేంకటేశ్వర స్వామికి కాదు. బాబాకి కాదు. మాతకి కాదు. పీతకి కాదు. సంస్కారానికి పెద్ద పీట. ఇష్టం లేకపోతే గుడికి వెళ్లకు. గోపురాలు కట్టించకు. భజనలు చేయకు. బంగారు పాదుకలు వేంకటేశ్వరస్వామికిచ్చి ఇంగ్లండులో మాయమవకు. పక్కవాడికి నిలవున్న ఉసిరికాయని ఇవ్వాలన్న మనసుని పెంచుకో. కళ్లు లేని గుడ్డివాడిని రోడ్డు దాటించు.

పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క–మహా వృక్షమయి నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. కొన్నాళ్లకి భూమిని చీల్చుకుని వెలుగుని నీకు చూపుతుంది. పెరిగి నువ్వు బతికినన్నాళ్లూ నిన్ను పోషిస్తుంది. తరతరాలూ నీ వారసులకి పెద్ద దిక్కవుతుంది. ‘మా తాత చేసిన పుణ్యం’ అని నువ్వు చచ్చిపోయినా నీ మంచితనానికి సదా ‘చెమ్మ’ని ఇస్తూనే ఉంటుంది.
‘వీడెవడయ్యా దేవుడు!’ అని ఇప్పుడే అతడిని అటకెక్కించెయ్‌. చెడిపోయిన ఉసిరికాయని ఇచ్చే మనస్సుని పెంచుకో. అమ్మ వచ్చి నీ తలుపు తడుతుంది.

- గొల్లపూడి మారుతీరావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top