పెట్టుబడిదారుల ఉచ్చులో కేజీ టు పీజీ?

Chukka Ramaiah Article On Education System In Telangana - Sakshi

విశ్లేషణ

మార్కెట్‌ యుగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో సామాజిక సంఘర్షణ సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతిక ఫలితాలు సామాన్యుడి దరికి చేరడం లేదు. టెక్నాలజీతో పెరిగిన సంపద సైతం వారికి అందుబాటులోకి రావడం లేదు. ఈ పరిజ్ఞానం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది అంటే అధికాదాయ వర్గాలకు చేరు తోంది. మురికివాడల్లోనూ, పూరి గుడిసెల్లోనూ ఉండే సామాన్యుడికి అందాలంటే ఇంకా విద్యకి ఆమడదూరంలో ఉన్న ఆయా వర్గాల ప్రజలు అత్యధికస్థాయిలో ఆధునిక విద్యాపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే స్థితికి చేరాలి.

సంపద లాగే జ్ఞానం కూడా అందరికీ సమంగా అందు బాటులోకి రావాలి. అది జరగాలంటే ఏ వర్గాలైతే అణచివే తకు గురౌతున్నాయో, ఏ వర్గాలైతే విద్యకీ, సమాజంలోని సకల సౌకర్యా లకీ దూరమౌతున్నాయో వారే జ్ఞానసంప న్నులు కావాలి. అప్పుడే ఇన్నాళ్ళూ ఒక వర్గ ప్రజలకే అందు తోన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నూటికి తొంభైశాతంగా ఉన్న పేదలకూ, అట్టడుగు వర్గాలకూ అందుబాటులోకి వస్తుంది. వారే ఈ పేదరికానికీ, అసమానతలకూ, అణచివే తకూ భిన్నమైన సమాజాన్ని సృష్టించగలుగుతారు. సమాన తను అందరికీ పంచగలుగుతారు.

సమాజ పరివర్తనకు మార్గనిర్దేశనం చేయగలుగుతారు. సరిగ్గా ఇదే విషయాన్ని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కూడా అంటారు. ఆయన అభి ప్రాయంలో సామాజిక విప్లవం పాఠశాలల్లోనే ప్రారంభం కావాలి. అదే స్ఫూర్తిని గ్రామాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం అని భావించారు విద్యాపరిరక్షకులు. అది జరగా లంటే కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ ఒక ఉన్నతమైన పరిష్కార మార్గమని భావించి దేశవ్యాప్తంగా ఉద్యమించారు. దానికి మన రాష్ట్రం నుంచి ప్రముఖ మేధావి, విద్యావేత్త హరగోపాల్‌ లాంటి విద్యాపరిరక్షకులు పోరాడుతున్నారు. కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ కోసమే ఉపాధ్యాయ ఉద్యమం నడుంబిగించింది. దానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్‌ ద్వారా ఆ ఉద్య మానికి అంకురార్పణ చేసే అవకాశం నాకు దొరికింది. అది కూడా ఒక పవిత్రమైన స్థలంలో, ఎందరో వీరులు అమరు   లైన ఉద్యమ ప్రాంగణంలో, తెలంగాణ పోరాటపతాకగా భావించే గన్‌పార్క్‌లో ఈ ఉద్యమాన్ని నాతో ప్రారంభిం పజేశారు.

కేజీ టు పీజీ విద్య చింకిపాతల జీవితాలను బాగు చేస్తుందా?
టెక్నాలజీ విద్యావ్యాప్తికి కారణం అయ్యింది. నిజమే. కేజీ నుంచి పీజీ స్కూళ్ళు వచ్చాయి. కానీ ఎవరి లాభం కోసం? లేక చింకిపాతల జీవితాలను బాగుచేయడానికా? కొన్ని రాజకీయ పార్టీల నినాదాల్లో ఇవి భాగం అయ్యాయి. కేజీ టు పీజీ వెనుక సైతం ఒక పెట్టుబడిదారీ వర్గం కూడా వచ్చింది. స్కూల్స్‌ పైన పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించడమే కాకుండా పసిపిల్లల మనసుల్లో కూడా చిన్నప్పటి నుంచే విద్యని ఒక క్యాపిటల్‌గా భావించే ఆలోచనలను చొప్పిస్తున్నారు. త్రీడీ టెక్నాలజీని విద్యావిషయాల్లో ఉపయోగించుకోవడం కూడా హర్షించాల్సిందే కానీ ఆ త్రీడీ స్కూల్స్‌లో చదువుకోవాలను కునే విద్యార్థులు ఎన్ని లక్షలు వెచ్చించాల్సి వస్తోంది? సామా న్యుడికి ఈ విధానం అందుబాటులో ఉందా? కేజీ టు పీజీ కూడా క్యాపిటల్‌ సమాజంలో ఒక గొలుసు వ్యవస్థగా మారింది.

లక్షలు ఖర్చు చేసి విజ్ఞానాన్ని కొనుక్కోవాలి. ఉన్నత విద్యలో సీటు సంపాదించాలి. ఉద్యోగాలకోసం ఎంతో ప్రయాసపడాలి. చివరకు చదువుకి వెచ్చించిన దాన్ని మొత్తం ఉద్యోగం సంపాదించాక రాబట్టుకోవాలి. దానితో మరో క్యాపిటల్‌ సమాజానికి అంకురార్పణ చేయాలి. ఇదే వ్యవస్థ ప్రతిసారీ పునరావృతం అవుతోంది. కేజీ టు పీజీ విద్య నిర్వ హణ ఎవరి చేతిలో ఉండాలి? ఎవరికి సీట్లివ్వాలి? ఎవరిని యోగ్యులుగా మార్చాలి. నైపుణ్యాలను వెలికితీయాల్సింది ఎవరిలో? అంటే కచ్చితంగా పేదరికంలో మగ్గుతున్న వారికి క్వాలిటీ చదువు అందించాలి. ఎక్స్‌లెన్సీ సమత్వంపై ఆధార పడి ఉంటుంది. ఏ కొందరికో ఎక్స్‌లెన్సీ వస్తే సరిపోదు. కుగ్రామాల్లో నివసిస్తున్న నిరుపేదకు సైతం ఇది అందాలి. అప్పుడే శ్రీమంతుడికీ, సామాన్యుడికీ ఒకేరకమైన చదువు అందుబాటులోకి వస్తుంది. సరిగ్గా ఇవే విషయాలపై గళ మెత్తారు హరగోపాల్‌. విద్యావ్యవస్థలో ఉన్న అంతరాలే సమాజంలోని అంతరాలకు మూలమని గ్రహించారు. తెలంగాణ ఈ ఆకాంక్షలకోసమే ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినవాడు గనక తెలం గాణ రాష్ట్రం ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌పై ఉద్యమిస్తున్నాడు.

ఇప్పుడే ఎందుకీ ఉద్యమం?
అయితే ఇప్పుడే ఎందుకు ఉద్యమిస్తున్నారు అనే ప్రశ్న ఉద్భ విస్తోంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. సామాన్యుడి సమస్యలన్నీ రాజకీయ పార్టీలు వినేది ఒక్క ఎన్నికల సమయంలోనే. అంతేకాకుండా పేద, అణగారిన వర్గాలకు అందని పండుగా తయారౌతోన్న విద్య, ప్రత్యేకించి కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌ రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోకి చేరాలంటే ఉద్యమం ఒక్కటే మార్గం. అందుకే ఈ ఉద్యమం ఇప్పుడే ప్రస్తుతమని భావించారు. చైతన్యవంతమైన వారు ఈ ఉద్య మాలకు స్పందిస్తారనీ, అభ్యుదయ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారనీ, దీక్షాపరులైన శాసనసభ్యులు ఎన్నికవుతా రనీ ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్‌ అభిప్రాయం. కానీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అందుకోవడం కోసమే డబ్బు వెదజల్లుతూ, దానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ ప్రచారానికి అడ్డంకిగా తమ పవర్‌ను ప్రయోగించారు. పోలీసు బలగాలను ఉపయోగిం చారు.

ఈ ఉద్యమం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆటంకం కాబోతున్నది కాబట్టి ప్రజల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేశారు. అధికారంతో ఉద్యమం నోరునొక్కే యాలనుకున్నారు. ఇదే నిన్నటి బలప్రయోగం యొక్క లక్ష్యం. కానీ తెలంగాణలో సామాజిక ఉద్యమం చాలా బలంగా ఉంది కాబట్టి దెబ్బలైనా తింటాం, కష్టాలైనా భరిస్తాం, కానీ మా గొంతులు మూగబోవని తేల్చి చెప్పారు ఉద్యమకారులు. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఈ పోరాటం బలప్రయోగాలకు తలవంచదు. ఇదే విషయం హరగోపాల్‌ అరెస్టుతో తేలిపోయింది.

ఈ ఉద్యమం రాబోయే ప్రజా ఉద్యమాలకు సంకేతం. నిన్నటి అఘాయిత్యం ప్రజల ఆశలను తుంచివేయడానికే. ప్రజాఉద్యమాల గొంతు నులిమి వేయడానికే తప్ప మరొకందుకు కాదు. అన్ని అభిప్రాయాలనూ స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామిక వ్యవస్థకు ఈ ఎన్నికలు అంకు రార్పణ చేయాలి. అధికారం ప్రజా సేవకోసం కానీ, అధి కారం ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో కారాదు. ప్రజలు బాగుపడాలంటే విద్యారంగంలో ప్రక్షాళన జరగాలి.  ఎన్ని కలు అధికార సోపానానికి మార్గం కాకూడదు. అసమానత లను కూకటివేళ్ళతో పెకిలించగలిగే శక్తివంతమైన ఆయు ధంగా మారాలి.

వ్యాసకర్త: చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top