ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఔట్‌

Chief Justice Eswaraiah Slams Cm Chandrababu Naidu - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య

♦ మనసులో మాట
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి పరాజయం తప్పదని మాజీ యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఈశ్వరయ్య తేల్చిచెప్పారు. ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ప్రభుత్వానికి దూరమయ్యారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన రహస్య సర్వే ప్రకారం, ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ సర్వే ప్రకారం ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవలేరంటున్న జస్టిస్‌ ఈశ్వరయ్య అభిప్రాయం ఆయన మాటల్లోనే...

న్యాయవాద వృత్తికి ఎలా వచ్చారు?
ఎలాంటి మౌలిక వసతులూ లేనటువంటి చిన్న కుగ్రామంలో పుట్టాను. అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అఆలూ, ఇఈలూ నేర్చుకున్నాను. నాన్న రైతు. పదోతరగతి వరకూ వలిగుండ మండలం నెమలికాలువ గ్రామంలోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో చదువుకున్నాను. పెద్దనాన్న చనిపోవడంతో బీఎస్సీ పరీక్ష రాయలేకపోయాను. తర్వాత లా పూర్తిచేసి ఆ వృత్తిలోనే కొనసాగాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో అబ్కారీ కేసులన్నీ నాకే వచ్చాయి. జడ్జీలు కూడా ఇతనయితే నిజం చెబుతాడు అనే నమ్మకంతో నాకే కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవారు. ఒక్క క్లయింట్‌ వద్ద కూడా ఫీజు అడిగేవాడిని కాదు. వాళ్లు ఇచ్చినంత తీసుకునేవాడిని.

న్యాయవ్యవస్థపై రాజకీయ బ్రోకరిజం పాత్ర ఎంత?
ఇప్పుడయితే పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది కానీ నిజంగానే లా అనేది ఒక విశిష్టమైన వృత్తి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చెన్నారెడ్డి హయాంలో ప్రభుత్వ ప్లీడర్‌ అయ్యాను. ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కాపాడాను. తర్వాత కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే జడ్జిగా అయ్యాను. బయట ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను జడ్జి కావడానికి చంద్రబాబు ప్రమేయం కానీ ఆయన సమ్మతి కానీ అణుమాత్రం లేదు. కానీ బాబు రాజకీయ బ్రోకర్‌గా అవతారమెత్తి ఏపీలో న్యాయమూర్తులు కానున్న వారికి వ్యతిరేకంగా అభిప్రాయం రాసి పంపిన చరిత్ర అయితే ఉంది. కానీ బాబు అభిప్రాయాన్ని కొలీజియం తోసిపుచ్చి వారినే న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ బ్రోకరిజం బలంగా ఉన్న ఏపీలో ఏం జరుగుతోందో కొలీజియంకు బాగా తెలుసు. 

బీసీల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది కదా?
ఎందుకంటే ఆనాటి టీడీపీ ఇప్పుడు చచ్చిపోయింది. ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ బీసీలకు నిజం గానే పట్టం కట్టింది. దేవేందర్‌ గౌడ్, తలసాని యాదవ్, యనమల రామకృష్ణుడు, నరసింహులు ఇలా ఇప్పుడున్న బీసీ ప్రముఖ నేతలందరూ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారే. ఎన్టీఆర్‌ వల్లే లక్షలాది మంది బీసీలు టీడీపీ కార్యకర్తలుగా ఎదిగారు.

న్యాయవ్యవస్థపై బాబుకు అంత పట్టు ఉందా?
బాబుపై ఉన్న కేసులన్నీ మరుగున ఉన్నాయంటే కారణం ఉండాలి కదా. బాబు అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసును కూడా హైకోర్టు విచారణ జరగకుండా కొట్టివేసిందంటే జనం అనుకుం టారా లేదా? పైగా ఏసీబీచే విచారణ చేయించమని అడిగితే దీంట్లో విచారించడానికి ఏముంది అని అడ్డుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశంపై స్టే విధించాల్సి వచ్చింది. బాబు అక్రమాస్తుల కేసుపై కూడా విచారణ దీర్ఘకాలంగా పెండింగులో ఉంది. 

ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం?
ఆ కేసును విచారించిన సిట్టింగ్‌ జడ్జిలలో నేనూ ఒకరిని. కానీ సంచలనం కలిగించిన ఈ కేసులో కూడా విచారణ ఇంత పెండింగ్‌ జరుగుతోందంటే ప్రశ్నించాల్సిందే. కేసుల విచారణ నంబర్ల వారీగా సీరి
యల్‌ పద్ధతిలో జరిగితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. న్యాయాన్ని కొంటుంటే, విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంటే న్యాయవ్యవస్థను ఎలా నమ్ముతారు? 

విచారణకు సిబ్బంది లేదంటే నమ్మేయడమేనా?
అమెరికా తదితర దేశాల్లో చూస్తే అక్కడ న్యాయవ్యవస్థల్లో ఏరకమైన మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలకూ తావుండదు. జస్టిస్‌ చలమేశ్వర్‌తోపాటు నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కేసులు విచారణ సూత్రబద్ధంగా, సహజ రీతిలో జరగటం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీనియర్‌ న్యాయమూర్తుల విషయంలోనే పక్షపాతం ప్రదర్శిస్తున్నారని వారన్నారు. సుప్రీంకోర్టులో అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన న్యాయమూర్తులు ఆ నలుగురూ. వారే ముందుకొచ్చి తమ బాధ వ్యక్తం చేశారంటే మన న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం ఎంత అవసరమో అర్థమవుతుంది. అందుకే న్యాయవ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరగాలి.
బాబు కేసుపై విచారణ చేయాలని హైకోర్టు జడ్జి తీర్పు చెబితే, సుప్రీంకోర్టులో మరోరకంగా వచ్చింది కదా?
కోర్టుల్లో తీర్పులు, ఆదేశాలు అనేవి న్యాయమూర్తుల అంతర్గత నాణ్యత, స్వచ్ఛత ప్రాతిపదికనే వస్తుం టాయి. అందుకే జడ్జీలకు స్వచ్ఛమైన హృదయం, మనస్సు ఉండాలి. కలుషిత మనస్సు ఉండరాదు. కానీ వాళ్లూ ఈ సమాజం నుంచే వచ్చారు కదా. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. తప్పుడు ఆదేశాలు, తీర్పులు ఇస్తున్నారంటే అది ఆ జడ్జీల్లోని లోపమే కాని మొత్తం వ్యవస్థ లోపం కాదు కదా. జడ్జీల్లో ఆ అంతర్గత స్వచ్ఛత, పవిత్రత లేనందువల్లే న్యాయస్థానంలో కులం, మతం, పార్టీలు అన్నీ దూరిపోయాయి. అందుకే జడ్జీలకు కూడా అంతరాత్మను ప్రశ్నించే ఆధ్యాత్మిక విద్య అవసరమని నా ఉద్దేశం. ఏ కర్మ మనం చేస్తే ఆ కర్మను మనం తప్పించుకోలేం అనే భయం ఉంటే ఎవరూ తప్పు చేయరు, సాహసించరు కూడా. 

చంద్రబాబు, కేసీఆర్‌ పాలనపై మీ అభిప్రాయం?
ఎన్ని లోపాలున్నా, కేసీఆర్‌ పాలనలో గొప్పగా చెప్పుకోవలసింది మిషన్‌ భగీరథ, విద్యుత్తు వంటి అనేక పథకాల ద్వారా ప్రజాప్రయోజనాలను చాలావరకు కాపాడుతున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ పాలన కుటుంబ పాలన అని విమర్శలు వస్తున్నా, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కానీ ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులు ఇలా సకల సామాజిక వర్గాలూ టీడీపీ ప్రభుత్వానికి దూరమయ్యారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన సర్వేలో ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది కూడా. ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవడని ఆ రహస్య సర్వే నివేదిక తేల్చిచెప్పేసింది.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top